ఎండలు బాబోయ్‌..!

ABN , First Publish Date - 2022-05-02T09:39:32+05:30 IST

గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు భానుడి భగభగల దెబ్బకు మలమల మాడిపోతున్నాయి.

ఎండలు బాబోయ్‌..!

  • 122 సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
  • లానినా ప్రభావం.. పర్యావరణ మార్పులు
  • కొవిడ్‌ ఉధృతి తగ్గడంతో పెరిగిన కాలుష్యం
  • కారణాలేవైనా అల్లాడిపోతున్న సామాన్యులు
  • పర్యావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలు
  • చేసినా కూడా ఉష్ణోగ్రతలు పెరిగే ముప్పుంది
  • ఐక్యరాజ్యసమితికి చెందిన ఐపీసీసీ నివేదిక


భానుడు భగభగలాడిపోతున్నాడు! ఫ్యాన్లు, కూలర్లు సరిపోవట్లేదు.. ఏసీ వేస్తే తప్ప ప్రాణాలు కుదుటపడే పరిస్థితి కనిపించట్లేదు. ఎండాకాలం అంటే మే నెల గురించే చెప్పుకొంటాంగానీ.. ఈ ఏడాది ఏప్రిల్‌ (ప్రీ సమ్మర్‌)లోనే వేసవిని మించిన వేడి వాతావరణం గుబులుపుట్టించింది. గత 122 ఏళ్లలో మార్చినెలలో ఎన్నడూ ఎరగనంత ఉష్ణోగ్రతలు ఈ మార్చిలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ‘ఈ వేసవిలో ఎండలు మండిపోబోతున్నాయి.. తస్మాత్‌ జాగ్రత్త’’ అంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలకూ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో.. సూర్యుడి ప్రతాపంపై ప్రత్యేక కథనం.


(విశాఖపట్నం, సెంట్రల్‌ డెస్క్‌-ఆంధ్రజ్యోతి): గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు భానుడి భగభగల దెబ్బకు మలమల మాడిపోతున్నాయి. 1901 తర్వాత మార్చినెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు (33 డిగ్రీలు) ఈ ఏడాదే నమోదయ్యాయి. సాధారణంగా ఏటా మార్చిలో నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతలు 31.24 డిగ్రీలేనని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్‌, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో అయితే ఈ ఏప్రిల్‌లో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత సర్వసాధారణంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లోనూ.. ఎండదెబ్బకు కష్టజీవులు బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి కారణమేంటి? పర్యావరణ మార్పులా? లేక లానినా కారణమా? అంటే.. వాతావరణ నిపుణులు ఈ రెండూ కారణమే అని చెబుతున్నారు. ‘‘పసిఫిక్‌ మహాసముద్రంలో లానినా పరిస్థితులు అంచనా వేసినదానికన్నా ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. 


అదే సమయంలో ఆర్కిటిక్‌ వైపు నుంచి వస్తున్న వేడిగాలుల వల్లే ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి’’ అని యూనివర్సిటీ ఆఫ్‌ మేరీల్యాండ్‌(అమెరికా)కు చెందిన వాతావరణ నిపుణుడు రఘు వివరించారు. భారతదేశంలో చలికాలం, వేసవికాలంపై లానినా ప్రభావం అనూహ్యంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. పర్యావరణ మార్పు కూడా ప్రస్తుత పరిస్థితులకు కొంతవరకూ కారణమని ఐక్యరాజ్యసమితికి చెందిన పర్యావరణ విభాగం ‘ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ ఆన్‌ క్లైమేట్‌ చేంజ్‌ (ఐపీసీసీ)’ అభిప్రాయపడింది. పర్యావరణ సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతినే దేశాల జాబితాలో భారతదేశం కూడా ఉందని ఐపీసీసీ ఇటీవలే విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.


 ‘‘పర్యావరణ మార్పులను తగ్గించడానికి గణనీయంగా చర్యలు తీసుకున్నా కూడా భవిష్యత్తులో వేసవి ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో హైడ్రాలజీ అండ్‌ క్లైమేట్‌ విభాగం ప్రొఫెసర్‌ ఎల్‌ఫతిహ్‌ ఎల్‌తహిర్‌ హెచ్చరించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. అలాగే.. ఏటా మార్చి, ఏప్రిల్‌లో పలుచోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తుంటాయి. ఉత్తరాది మీదుగా పయనించే పశ్చిమ అవాంతరాల ప్రభావంతో జమ్ముకశ్మీర్‌ నుంచి మధ్యప్రదేశ్‌ వరకు, ఒక్కోసారి ఉత్తర కర్ణాటక వరకు వర్షాలు కురుస్తుంటాయి. అలాంటిది ఈ ఏడాది పశ్చిమ అవాంతరాలు అత్యంత బలహీనంగా ఉండడంతో హిమాలయ పర్వత ప్రాంతాలకు అనుకుని ఉన్న ప్రదేశాల్లో తప్ప దేశంలో ఎక్కడా వర్షాలు కురవలేదు. దీంతో అనేక ప్రాంతాల్లో నేల పొడిబారిపోయింది. కొద్ది రోజులుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన యాంటీ సైక్లోన్‌ ప్రభావంతో పశ్చిమ భారతం పూర్తిగా పొడిబారింది. అందుకే పశ్చిమ, మధ్య భారతంలో అనేక ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఎక్కువ ఉష్ణోగ్రత అంటే?

సాధారణంగా మైదాన ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, తీరప్రాంతాల్లో 37 డిగ్రీలు, కొండప్రాంతాల్లో 30 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశంముంటే వాతావరణ శాఖ హీట్‌వేవ్‌ హెచ్చరికలను జారీ చేస్తుం ది. అలాగే, ఆయా ప్రాంతాల్లో ఎప్పుడూ నమోదయ్యే సగటు ఉష్ణోగ్రతల కన్నా 4.5-6.4 డిగ్రీల దాకా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నా ‘హీట్‌ వేవ్‌’ హెచ్చరిక జారీ చేస్తుంది. 6.4 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశం ఉంటే.. అతి తీవ్ర ఉష్ణోగ్రతల హెచ్చరిక జారీచేస్తుంది. మార్చి-జూన్‌ మధ్య ఆరు కన్నా ఎక్కువ హీట్‌వేవ్‌లు నమోదయ్యే జోన్లను ‘కోర్‌ హీట్‌వేవ్‌ జోన్‌’లుగా వ్యవహరిస్తారు. ఆ జోన్‌లో ఉండే రాష్ట్రాలు/ప్రాంతాలు.. రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, ఢిల్లీ, పశ్చిమ మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, విదర్భ (మహారాష్ట్ర), పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, కోస్తాంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ. వాయవ్య రాజస్థాన్‌లోని చాలా ప్రాంతాలు, ఏపీ, ఒడిశా తీరప్రాంతాల్లోని పలు నగరాల్లో మార్చి-జూన్‌ మధ్య సగటున ఎనిమిది హీట్‌వేవ్‌లు నమోదవుతాయి. 


ప్రతి దశాబ్దానికీ పెరుగుతూ..

మనదేశంలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత నానాటికీ పెరుగుతోందని.. హీట్‌వేవ్‌ రోజుల సంఖ్య ప్రతి దశాబ్దానికీ కొత్త రికార్డులు సృష్టిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకు 1981-90 నడుమ దేశంలో 413 హీట్‌వేవ్‌ రోజులు నమోదుకాగా, ఆ సంఖ్య 2001-10 నడుమ 575 రోజులకు, 2011-20 నడుమ 600 రోజులకు పెరిగిందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, ఒడిశాలో.. అధిక ఉష్ణోగ్రతలతోపాటు వాతావరణంలో తేమ కూడా ఎక్కువగా ఉంటుందని, దీన్ని ‘వెట్‌బల్బ్‌ టెంపరేచర్‌’గా వ్యవహరిస్తారని వారు వివరించారు. ఇలాంటి వాతావరణం తీవ్ర ఉక్కబోత, చెమటలకు కారణమవుతుందని, కొన్ని సందర్భాల్లో డీహడ్రేషన్‌కు దారి తీసి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు.


కరోనా తగ్గుముఖంతో పెరిగిన కాలుష్యం.. ఉష్ణోగ్రత

గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ లాక్‌డౌన్లు, వర్క్‌ ఫ్రమ్‌ హోం కారణంగా ట్రాఫిక్‌ చాలా తక్కువగా ఉంది. రోడ్లపైకి వాహనాలు తక్కువగా రావడంతో కాలు ష్యం తగ్గిపోయింది. ఫలితంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎండలు ఒక మోస్తరుగా ఉన్నాయని వాతావరణ నిపుణులు గుర్తుచేస్తున్నారు. కరోనా తగ్గుము ఖం పట్టడంతో వాహనాల రాకపోకలు, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడంతో కాలుష్యం పెరిగి ఆ ప్రభావం వాతావరణంపైనా పడిందని వారు వివరిస్తున్నారు. ప్రస్తుత అధిక ఉష్ణోగ్రతలకు అది కూడా ఒక కారణం అని వారు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-05-02T09:39:32+05:30 IST