కాసులిస్తేనే..క్లాసు వినేది

ABN , First Publish Date - 2020-10-16T06:06:59+05:30 IST

ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కొవిడ్‌-19 నిబంధనలకు వ్యతిరేకంగా

కాసులిస్తేనే..క్లాసు వినేది

ఇష్టానుసారంగా వ్యవహిరస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు

ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో అధిక ఫీజు వసూలు

ఫీజు కట్టకుంటే ఆన్‌లైన్‌ లింక్‌ కట్‌ చేస్తామని బెదిరింపులు

ప్రతి రోజూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు

చోద్యం చూస్తున్న జిల్లా విద్యాధికారులు


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం), అక్టోబరు 15 : ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు కొవిడ్‌-19 నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా ఫీజులు చెల్లిస్తారా? లేదంటే ఆన్‌లైన్‌ తరగతుల లింక్‌ను కట్‌ చేయమంటారా? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నాయి. 


మహబూబ్‌నగర్‌ పట్టణంలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. స్థానిక తెలంగాణ చౌరస్తా, క్రిష్టియన్‌పల్లి, భగీరథ కాలనీల్లోని కొన్ని ప్రైవేట్‌ విద్యా సంస్థలు విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే, సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం అధిక ఫీజులను ఈ విద్యా సంస్థలను వసూలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకొచ్చారు. అందులో నారాయణ అనే ఓ విద్యార్థి తండ్రిని ఓ పాఠశాల యాజమాన్యం వారం రోజులుగా ఫోన్లు చేసి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. మరో పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి తండ్రి రవిని ఫీజు చెల్లించాలని, లేకుంటే ఆన్‌లైన్‌ కనెక్షన్‌ను కట్‌ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈయన అప్పటికే రూ.10 వేలు చెల్లించగా, అవి పాత బకాయి కింద జమ చేసుకున్నట్లు సదరు పాఠశాల యాజమాన్యం చెపిన్నట్లు ఆ విద్యార్థి తండ్రి తెలిపాడు. వారం రోజుల పాటు ఆన్‌లైన్‌ తరగతలు వచ్చే విధంగా లింక్‌ ఇచ్చారని, ఆ తరువాత కట్‌ చేస్తామని చెప్పినట్లు ఆయన వివరించారు.


ఫీజు తరువాత కడతామని చెప్పినా వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మరో విద్యార్థి తండ్రిని కూడా ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారు. ఇప్పటికే రూ.15 వేలు చెల్లించాలని, కానీ యాజమాన్యం మాత్రం వాటిని పుస్తకాలు, ఇతర ఖర్చుల కింద చూపిస్తోందని ఆ విద్యార్థి తండ్రి వెంకటయ్య తెలిపాడు. అంతే కాకుండా ఆన్‌లైన్‌ తరగతులు వినేందు కోసం ప్రత్యేకంగా రూ.1,250 చెల్లించాలనే నిబంధన పెట్టినట్లు ఆయన చెప్పాడు. 


చెప్పిన చోటే పుస్తకాలు కొనాలి

కొన్ని పైవేట్‌ పాఠశాలల యాజమాన్యలు తాము చెప్పిన చోటే పుస్తకాలు కొనాలనే పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. అందులో తెలంగాణ చౌరస్తాలో ఉన్న పాఠశాల యాజమాన్యం స్టడి మెటీరియల్‌ కోసం పాఠశాలలోనే బిల్లు చెల్లించుకుంటుంది. ఆ బిల్లు తీసుకొని న్యూటౌన్‌లోని ఓ బుక్‌ సెంటర్‌కు వెళ్లి మెటీరియల్‌ తీసుకోవాలని సూచిస్తున్నట్లు ఓ విద్యార్థి తండ్రి రామకృష్ణ తెలిపారు. మూడు, నాలుగో తరగతి పిల్లల స్టడి మెటీరియల్‌కు కూడా దాదాపు రూ.12,500 తీసుకుంటున్నారని చెప్పారు. ఇంత జరుగుతున్నా విద్యా శాఖాధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. కనీసంగా పాఠశాలలను తనిఖీ కూడా చేయడం లేదు. ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణ ఎలా జరుగుతుందనే దానిపై కూడా దృష్టి సారించడం లేదు.

Updated Date - 2020-10-16T06:06:59+05:30 IST