ధరలు మరింత పెరగొచ్చు.. RBI అంచనా

ABN , First Publish Date - 2022-05-27T22:10:06+05:30 IST

పోనుపోను ధరలు మరింత మండిపోనున్నాయా ? టోకు ద్రవ్యోల్బణం తీవ్రత ప్రభావంతో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగబోతోందా ? అంటే ఔననే సమాధానం చెబుతోంది

ధరలు మరింత పెరగొచ్చు.. RBI అంచనా

ముంబై : పోనుపోను ధరలు మరింత మండిపోనున్నాయా ? టోకు ద్రవ్యోల్బణం(Wholesale Inflation) తీవ్రతతో రిటైల్ ద్రవ్యోల్బణం(Retail Inflation) పెరగనుందా ? అంటే కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ(RBI) ఔననే సమాధానం చెబుతోంది. పెరిగిన ముడిపదార్థాల ధరలు, రవాణా వ్యయాలు, గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లయ్ చెయిన్‌ సంబంధిత సవాళ్ల కారణంగా అధునాతన పరిశ్రమల వ్యయాలు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా అధిక టోకు ద్రవ్యోల్బణం ప్రభావం రిటైల్ ద్రవ్యోల్బణంపై పడొచ్చని ఆర్బీఐ విశ్లేషించింది. ఈ మేరకు శుక్రవారం వార్షిక నివేదికను విడుదల చేసింది. అధిక టోకు ద్రవ్యోల్బణం(WPI) ఒత్తిడితో క్రమంగా ఆహార, నిత్యావసర, ఇతర అన్నిరకాల ధరలు పెరిగేందుకు అవకాశముందని హెచ్చరించింది.


రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, అనంతర పరిణామాల కారణంగా సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రపంచంతోపాటు భారత్‌లోనూ ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఇటివలే పలు కీలకమైన చర్యలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. అంతేకాకుండా స్టీల్, ప్లాస్టిక్ ఇండస్ట్రీలో వినియోగించే కొన్ని ముడిపదార్థాలపై దిగుమతుల సుంకాన్ని తగ్గించింది. మరోవైపు ఇనుము ధాతువు, ఇనుము గుండ్లపై ఎగుమతుల సుంకాన్ని పెంచింది. అంతేకాకుండా గోధుమలు, పంచదారతోపాటు పలు కీలకమైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతులపై పరిమితులు విధిస్తున్న విషయం తెలిసిందే.


కాగా ఇంధనం నుంచి కూరగాయలు, వంటనూనె ధరలు ఆకాశాన్ని తాకడంతో టోకు ద్రవ్యోల్బణం(హోల్‌సేల్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్) గత ఏప్రిల్‌ నెలలో ఏకంగా 15.08 శాతంగా నమోదయింది. కాగా ఇదే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు 8 ఏళ్ల గరిష్ఠం 7.79 శాతంగా రికార్డయిన విషయం తెలిసిందే. కాగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఈ నెలల ఆరంభంలో షెడ్యూల్ కంటే ముందే ద్రవ్యపరపతి సమీక్షను ఏర్పాటు చేసింది. ఎవరూ అంచనా వేయలేని రీతిలో కీలకమైన రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-05-27T22:10:06+05:30 IST