వన్డే మజా పంచిన హై ఓల్టేజ్ మ్యాచ్..!

ABN , First Publish Date - 2021-07-25T08:20:09+05:30 IST

ఇంగ్లండ్‌లో జరిగిన రాయల్ లండన్ కప్ టోర్నీలో ఓ హై-వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వివరాల్లోకి వెళితే..

వన్డే మజా పంచిన హై ఓల్టేజ్ మ్యాచ్..!

లండన్: ఇంగ్లండ్‌లో జరిగిన రాయల్ లండన్ కప్ టోర్నీలో ఓ హై-వోల్టేజ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. వివరాల్లోకి వెళితే.. రాయల్ లండన్ వన్డే కప్ టోర్నీలో భాగంగా జూలై 22వ తేదీ గురువారం జరిగిన మ్యాచ్‌లో కెంట్, డర్హామ్ జట్లు పోటీ పడ్డాయి. తొలుత టాస్ గెలిచిన కెంట్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన డర్హామ్.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 405 పరుగుల భారీ స్కోరు చేసింది. డర్హామ్ కౌంటీ చరిత్రలో ఇంత భారీ స్కోరు చేయడం ఇదే తొలి సారి కావడం మరో విశేషం.


ఓపెనింగ్ నుంచే డుర్హామ్ ఆటగాళ్లు కెంట్ బౌలర్లపై ఏ మాత్రం దయలేకుండా విరుచుకుపడ్డారు. క్లార్క్(141) కెంట్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. క్లార్క్ ఇన్నింగ్స్‌లో 20 ఫోర్లు, 2 భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు మరో ఓపెనర్ లీస్(100) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా 34 ఓవర్లలో 242 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి తరువాత కూడా కెంట్ బౌలర్లపై డర్హామ్ బ్యాట్స్‌మన్ దాడి పూర్తి కాలేదు. మిడిల ఆర్డర్‌లో వచ్చిన డేవిడ్ బెడింగ్‌హామ్(67), కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(60) మెరుపు వేగంతో అర్థ సెంచరీలు పూర్తి చేశారు. దీంతో డర్హామ్ చారిత్రాత్మకమైన భారీ స్కోర్ చేసింది. కెంట్ బౌలర్లలో క్విన్ ఏకంగా 10 ఓవర్లలో 97 పరుగులు సమర్పించుకుని మోస్ట్ రన్స్ ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. 


ఇదిలా ఉంటే ఈ భారీ లక్ష్యాన్ని చేధించడంలో కెంట్ విఫలమైంది. ప్రధానంగా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. మిడిలార్డర్‌లో జార్జ్ మున్సీ(96), హ్యారీ ఫించ్(64) ఆదుకునే ప్రయత్నం చేసినా.. వారిద్దరూ అవుటైన తరువాత మరొక్కరూ కూడా క్రీజులో నిలవలేదు. దీంతో 50 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 302 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయం డర్హామ్ సొంతమైంది.

Updated Date - 2021-07-25T08:20:09+05:30 IST