అతివేగం.. భారీ రోడ్డుప్రమాదం

ABN , First Publish Date - 2022-07-01T06:24:43+05:30 IST

అతివేగం.. పరిమితి మించి లోడ్‌ ఘోరప్రమాదానికి దారితీసింది. మండలంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై పూసలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భారీ రోడ్డుప్రమాదం జరిగింది.

అతివేగం.. భారీ రోడ్డుప్రమాదం
ప్రమాదానికి గురైన బస్సుఅతివేగంతో ఘోరప్రమాదం

నుజ్జునుజ్జయిన ట్రావెల్‌ బస్సు

పాదచారిని ఢీకొట్టి అదుపుతప్పిన వైనం     

బేస్తవారపేట, జూన్‌ 30 : అతివేగం.. పరిమితి మించి లోడ్‌ ఘోరప్రమాదానికి దారితీసింది. మండలంలోని అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై పూసలపాడు సమీపంలో గురువారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భారీ రోడ్డుప్రమాదం జరిగింది. ఒకరు మృతిచెందగా, 30మందికి తీవ్ర గాయాలయ్యాయి.  బుధవారం రాత్రి విజయవాడ నుంచి అనంతపురానికి బయలుదేరిన ఎస్‌వీకేడీటీ ట్రావెల్స్‌ బస్సులో 32మంది ప్రయాణికులున్నారు. వీరితో పాటు విజయవాడలోనే ఆ బస్సు టాప్‌పై పుస్తకాలు అధిక లోడ్‌ వేశారు. గురువారం తెల్లవారుజాముకు బస్సు పూసలపాడు గ్రామ సమీపానికి వచ్చింది. ఈ సమయంలో గ్రామానికి చెందిన రిటైర్డ్‌ సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ జంగా సాంబశివుడు(78) గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నాడు. అది గమనించని బస్సుడ్రైవర్‌ అతనిని వెనక నుంచి ఢీకొట్టాడు. దీంతో ఎగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. ఉలిక్కిపడ్డ డ్రైవర్‌ అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. బస్సుపైన లగేజీ అధికంగా ఉండటంతో నియంత్రించలేకపోయాడు. అదే సమయంలో గోవా నుంచి ఒంగోలుకు చేపల దాణా లోడుతో లారీ వస్తోంది. బస్సును గమనించి లారీడ్రైవర్‌ వాహనాన్ని నిలిపివేశాడు. అదుపుతప్పిన బస్సు ఆగిన లారీని ఎదురుగా ఢీకొట్టి నడిరోడ్డుపై బోల్తాపడింది. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. ఈ ప్రమాదంలో 10మంది తీవ్రంగా, 20మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైవే రక్షకదళం, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న క్షతగాత్రులను బస్సు నుంచి బయటకు తీశారు. 108 వాహనాల ద్వారా కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాణనష్టం తక్కువగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అతివేగం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీడ్రైవర్‌ ముందే గమనించి వాహనాన్ని నిలిపివేయడంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. అదే లారీ కూడా వేగంతో ఉంటే ప్రమాదంతో మరింత తీవ్రంగా ఉండేదని సమాచారం.

రెండుగంటల నరకయాతన

ప్రమాదం జరిగిన సమయంలో లారీ డ్రైవర్‌ పీర్‌ మహ్మద్‌ రెండు కాళ్లు స్టీరింగ్‌కు, ఇనుప రేకుకు మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో నొప్పి తీవ్రతతో డ్రైవర్‌ తీవ్ర ఇబ్బంది పడ్డారు. సహాయ కార్యక్రమాలు చేయడానికి ఎక్సకవేటర్లు వచ్చినప్పటికీ, వాటితో పాటు పోలీసులు గడ్డపారలు సహాయంలో అతన్ని బయటకు తీశారు. దీంతో డ్రైవర్‌ రెండు కాళ్లు లోపల ఎముకలు నుజ్జయ్యాయి. ఈ ప్రమాదం పందిళ్లపల్లి టోల్‌గేటుకు 7 కిలోమీటర్ల దూరంలో జరిగింది. ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోపే జాతీయ రహదారి రక్షకదళం అక్కడకు చేరుకొని సహాయ కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రమాదం జరిగిన వెంటనే  ఒపిక ఉన్న క్షతగాత్రులు బస్సు పైరేకును తొలగించుకొని బయటకు వచ్చారు. అనంతరం వారి సంబంధికులతోపాటు ఇతరులను బయటకు తీశారు. ఘటన స్థలానికి కంభం గిద్దలూరు, కొమరోలు 108 వాహనాలు నుంచి వెళ్లాయి. మూడు వాహనాలు ఒక్కొక్కటి రెండుసార్లు తిరిగాయి. ఈ బస్సులో చిన్నారులు ఎవరు లేరు. అలాగే కంభం ఆస్పత్రిలో డ్యూటీ వైద్యుడు సత్వర సేవలందించారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి పోలీసులకు 4గంటలు పట్టింది. ట్రాఫిక్‌లో లారీలు బస్సులు ఆగగా, బైకులు, కార్లు, ఆటోలు గ్రామాల్లో నుంచి మరో మార్గంలో గమ్యస్థానాలకు చేరాయి. ట్రావెల్‌ బస్సుకు సంబంధించిన వారు కానీ, ప్రభుత్వ అధికారుల కానీ ఎవరు వెంటనే ఘటనా స్థలానికి రాలేదు. పోలీసులే సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులు వీరే...

ప్రమాదంలో గాయపడి కంభం వైద్యశాలలో చికిత్సపొందుతున్న వారిలో యం.గిరిధర్‌నాయుడు(తాడిపత్రి), కుమార్‌ నందిష్‌(తాడిపత్రి), పి.గణేష్‌కుమార్‌(తమిళనాడు), కేవీ.కృష్ణదాస్‌గుప్త(కర్నూలు), ఇల్లూరు లక్ష్మీప్రమోద్‌(అనంతపురం), గుడివేముల కౌసిక్‌రెడ్డి(నంద్యాల), సాకన గాయత్రి(అనంతపురం), సాకెన వికాస్‌(అనంతపురం), విష్ణుబట్ల శ్రీకృష్ణ(తెనాలి), వాసన నాగేంద్రబాబు(గుంటూరు), అనిపిరెడ్డి లక్ష్మీప్రసాద్‌రెడ్డి(హైదరాబాద్‌), బుర్రాల లక్ష్మన్న(కర్నూలు), గౌరిపేరు లక్ష్మీ ప్రసన్న(కర్నూలు), కీరు సుమంత్‌(కర్నూలు), ఎం.శ్రీరాములు(కర్నూలు), ఉప్పర రోషిక కుమారి(అనంతపురం), శాంతిశ్రీ (పాండురంగాపురం), లక్క వెంకటేశ్వరమ్మ(కోడూరి), దాసరి జాన్‌(రాయదుర్గం), తగిలే సూరి(అనంతపురం), ఎస్‌.భాస్కర్‌( ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌, అనంతపురం) కంభం వైద్యశాలలో చికిత్సపొందుతున్నారు. పలువురు మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, కర్నూలు వైద్యశాలలకు తరలించారు. వారిలో హరిక(కర్నూలు), గాండ్ల సుధాకర్‌(కర్నూలు), చిన్న రఘునిఖిల్‌(నెల్లూరు), పీరు మహ్మద్‌, లారీడ్రైవర్‌ (బల్లికురవ మండలం), కమ్మ కార్తీక్‌(కర్నూలు), గోత్రే హనుమంతకుమార్‌(హైదరాబాద్‌), పున్నమి శ్రీనివాసులు(పర్చూరు), గోగడ నాగేశ్వరరావు(కర్నూలు), మారం రామోహన్‌(నంద్యాల), కమ్మ మహేష్‌(కర్నూలు) ఉన్నారు.

అతివేగంతో ప్రమాదం

నేను కర్నూలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. బదిలీ పక్రియలో భాగంగా కౌన్సెలింగ్‌ ఉండడంతో విజయవాడ వెళ్లి వస్తున్నాను.  విజయవాడ నుంచే బస్సు వేగంగా వస్తోంది. తెల్లవారుజామున కావడంతో అందరం గాఢనిద్రలో ఉన్నాం. ఒకసారిగా పెద్దశబ్దం రావడంతో లేచి చూసేసరికి బస్సు నడిరోడ్డుపై బోల్తాపడి  ఉంది. ఎలాగోలా బయటపడ్డాం.

గౌరిపేరు లక్ష్మీ ప్రసన్న, ప్రిన్సిపల్‌ కర్నూల్‌

Updated Date - 2022-07-01T06:24:43+05:30 IST