తప్పనిసరి కానున్న హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌

ABN , First Publish Date - 2021-10-12T05:18:40+05:30 IST

మోటరు వాహనం చట్టం-50 ప్రకారం సెంట్రల్‌ మోటర్‌ యాక్ట్‌, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహనదారులు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు వాహనాలకు అమర్చు కోవాల్సి ఉంది.

తప్పనిసరి కానున్న  హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌
హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌

2015 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలకు కంప్సలరీ

నేరస్థులను గుర్తించడంలో ఎంతో ఉపయోగం

వచ్చేనెల 20 నుంచి తనిఖీలు


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) అక్టోబరు 11 : మోటరు వాహనం చట్టం-50 ప్రకారం సెంట్రల్‌ మోటర్‌ యాక్ట్‌, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాహనదారులు తప్పనిసరిగా హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు వాహనాలకు అమర్చు కోవాల్సి ఉంది. నవంబర్‌ 20వ తేదీ లోపల హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లను వాహనాలకు అమర్చుకోకపోతే ఆర్టీవో శాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటారు. వాహనాలు, వాహన యజమానుల పూర్తి వివరాలకు సులువుగా గుర్తించేందుకు ఈ నెంబర్‌ ప్లేట్‌లు ఉపయోగ పడతాయి. ఈ నెంబర్‌ ప్లేట్‌లు వాహనాలకు ఉండటం ద్వారా పోలీసులు సైతం ఈజీగా నిందితులు ఉపయో గించిన వాహనాలు ఎవరివి, వాటిని ఎక్కడ రిజిస్ట్రేషన్‌ చేశారు అన్న సమాచారం తెలుసుకోవచ్చు. 


2015 నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలకు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2015 నుంచి రిజిస్టర్‌ అయిన ప్రతి వాహనం తప్పనిసరిగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్లను అమర్చుకోవాలి. సామాన్యులకు వర్తించే నిబంఽధనలు ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తింపజేయాలన్న ఆలోచనతోనే ముందుగా ప్రతి ప్రభుత్వ వాహనం హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం కొత్తగా వాహనం కొనేవారికి ఆ షోరూమ్‌ వారే ఉచితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ అందిస్తుండగా, పాత వాహనదారులు నిర్ణీత రుసుము చెల్లించి రిజిస్ర్టేషన్‌ ప్లేట్‌లు పొందాల్సి ఉంది. 


నెంబరు కనిపించకుండా...

జిల్లాలో వాహనాలకు విచిత్రంగా నెంబర్‌ ప్లేట్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. పార్టీ రంగులు, నాయకుల బొమ్మలు, హీరోల బొమ్మలు, కవిత్వాలు ఇలా నెంబరు ప్లేట్‌లను చిన్న తెరగా మార్చేస్తూ అసలు వాహనం నెంబర్‌ కన్పించకుండా నెంబర్‌ ప్లేట్‌లు బిగించుకుంటున్నారు. దీంతో ప్రమాదాలు జరిగిన సమయంలో, అసాంఘిక కార్యక్రమాలకు వాహనాలను ఉపయోగించిన సమయంలో, చోరీలకు, చైన్‌ స్నాచింగ్‌లకు వాహనాలను ఉపయోగించిన సమయంలో వాహనాలకు ఉన్న నెంబర్‌ ప్లేట్‌లోని నెంబర్‌ను ప్రజలు గుర్తించకపోగా సీసీ కెమెరాల్లో సైతం నెంబరు కన్పించక పోతుండటంతో పోలీసులు కేసులను ఛేదించడం కష్టంగా మారింది. ఇక రంగురంగుల బొమ్మల నెంబరు ప్టేట్‌లు వాహనాలకు వేసుకోని రహదారులపై ప్రయాణాలు చేస్తుంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు తప్పనిసరిగా వాహనాలకు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అందులో ప్రత్యేకంగా ఉంచిన చిప్‌ సాయంతో వాహన రిజిస్ట్రేషన్‌ అడ్రస్‌, వాహన యజమాని వివరాలు వెంటనే గుర్తించవచ్చు. ఇలా హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.


నవంబరు 20 నుంచి తనిఖీలు

ఆర్టీవో అఽధికారులు నవంబరు 20వ తేదీ నుంచి హై సెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు ఉపయోగించని వాహనాలను గుర్తించి వాటిపై చర్యలు చేపట్టనున్నారు. ముందుగా వాహనాలు విక్రయించే షోరూమ్‌లలో తనిఖీలు ముమ్మరం చేసి ఎన్ని వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్‌లు ఇచ్చారు, ఎన్ని ఇవ్వాల్సి ఉంది అన్న వివరాలకు సేకరించనున్నారు. ఆ తర్వాత ఆర్టీవో అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టి అన్ని వాహనాలకు ఆ ప్లేట్‌లు బిగించేలా చర్యలు చేపట్టనున్నారు.

Updated Date - 2021-10-12T05:18:40+05:30 IST