రక్షణ వలయంలో కేపిటల్ భవనం.. వాషింగ్టన్ లాక్‌డౌన్

ABN , First Publish Date - 2021-01-19T12:36:23+05:30 IST

అమెరికాలో నాలుగేళ్ల ట్రంప్‌ శకానికి తెరపడనుంది. మరోసారి డెమోక్రాట్లు అధికార పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన బైడెన్‌ - కమలా హారిస్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ట్రంప్‌ అనుచరుల దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్‌ నగరమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు.

రక్షణ వలయంలో కేపిటల్ భవనం.. వాషింగ్టన్ లాక్‌డౌన్

దుర్భేద్యమైన కోటలా మారిన వాషింగ్టన్‌ నగరం

మున్నెన్నడూ లేనంతగా 25 వేల మందితో భారీ భద్రత

అంతర్గత దాడి జరుగుతుందేమోనన్న భయాందోళన

రేపే బైడెన్‌ ప్రమాణ స్వీకారం.. అందరి దృష్టీ కమలపైనే

100 మందికి ట్రంప్‌ క్షమాభిక్ష?.. చివర్లోనూ వివాదం

అమెరికాలో నాలుగేళ్ల ట్రంప్‌ శకానికి తెరపడనుంది. మరోసారి డెమోక్రాట్లు అధికార పగ్గాలు చేపట్టనున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో అప్రతిహత విజయం సాధించిన బైడెన్‌ - కమలా హారిస్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ట్రంప్‌ అనుచరుల దుశ్చర్యలను దృష్టిలో పెట్టుకొని వాషింగ్టన్‌ నగరమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. 


వాషింగ్టన్‌, జనవరి 18: సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న అమెరికాలో ఓ కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌, దేశ ఉపాధ్యక్షురాలిగా భారతీయ మూలాలున్న కమలా హారిస్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగేళ్ల పాటు అనేక ఆటుపోట్ల మధ్య సాగిన డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఈనెల 6వ తేదీన కేపిటల్‌ భవనంపై తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనపై కాంగ్రెస్‌ అభిశంసనను ఎదుర్కొన్న ఆయన అనేక సవాళ్లను బైడెన్‌కు విడిచి వెళుతున్నారు. సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన బైడెన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి కూడా హాజరుకాబోవడం లేదు.


ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ హాజరవుతారు. సుమారు 25,000 మంది నేషనల్‌ గార్డ్స్‌ వాషింగ్టన్‌ మొత్తాన్ని కమ్మేశారు. గతంలో అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవాలకు నియమించిన భద్రతకు ఇది మూడు రెట్లు ఎక్కువ. వాషింగ్టన్‌ నగరం ఓ దుర్భేద్యమైన కోటను తలపిస్తోంది. కేపిటల్‌ భవన ప్రాంగణం సమీపానే ప్రమాణస్వీకారం జరగనున్నందున అంతర్గతంగా ఎవరైనా దాడులకు దిగొచ్చేమోనన్న భయాలు భద్రతా అధికారులను వెన్నాడుతున్నాయి. ప్రమాణస్వీకార వేదిక వద్ద ట్రంప్‌-అనుకూల గార్డ్స్‌ ఎవరూ లేకుండా సీక్రెట్‌ సర్వీస్‌, ఆర్మీ ప్రయత్నిస్తున్నాయి. ప్రమాణస్వీకార ఉత్సవాన్ని తిలకించడానికి వేలమంది ప్రజలు సాధారణంగా హాజరయ్యే నేషనల్‌ మాల్‌ను ఈసారి మూసేశారు. కేపిటల్‌ భవనం చుట్టుపక్కల కనీసం మూడు మైళ్ల దూరం దాకా ఎవరూ ప్రవేశించలేని స్థితి! ఒక్క వాషింగ్టన్‌లోనే కాదు, దేశంలోని 50 రాష్ట్రాల ప్రధాన నగరాల్లోనూ భారీభద్రత ఏర్పాట్లు చేశారు. 


స్వల్ప ఘటనకే బెంబేలు!

మరోవైపు- కేపిటల్‌ భవనానికి ఓ మైలు దూరంలో నిర్మానుష్యమైన ఓ గుడారంలో సోమవారంనాడు ఓ చిన్న అగ్నిప్రమాదం సంభవించింది. ఇది తెలిసిన వెంటనే కేపిటల్‌ భవనాన్ని లాక్‌డౌన్‌ చేశారు. హుటాహుటిన అందరినీ బయటకు పంశారు. గంటన్నర తరువాత గానీ తిరిగి తెరవలేదు! 


కమలపైనే అందరి దృష్టీ!

ఉపాధ్య క్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌ సోమవారం సెనేటర్‌ పదవికి రాజీనామాను కాలిఫోర్నియా గవర్నర్‌ కెవిన్‌ న్యూసోమ్‌కు సమర్పించారు. దేశ ఉపాధ్యక్షురాలే సెనెట్‌ ప్రెసిడెంట్‌ కానుండడం వల్ల ఆ హోదాలో ఆమె పాత్ర కీలకం కానుంది. వంద మంది సభ్యులున్న సెనెట్‌లో రిపబ్లికన్లు- డెమొక్రాట్లకు చెరో 50 మంది బలం ఉంది. దీంతో కీలకమైన చట్టాల విషయంలో కమల ఓటు కీలకమవుతుంది. 2024 అధ్యక్ష ఎన్నికలకు ఆమె డెమొక్రాట్‌ అభ్యర్థిగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు.. నిష్క్రమణకు ఒక రోజు ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ వందమంది నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించనున్నారు. వీరిలో తీవ్ర ఆర్థిక నేరాలకు, మాదవద్రవ్యాల రవాణాకు పాల్పడిన వారు సైతం ఉండటం గమనార్హం.

Updated Date - 2021-01-19T12:36:23+05:30 IST