హైస్కూల్‌ క్రీడా మైదానం అంతేనా..?

ABN , First Publish Date - 2020-12-06T04:45:33+05:30 IST

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన ఎర్రగుంట్ల జడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానం వర్షపునీరు నిలిచి అపరిశుభ్రంగా మారినా పట్టించుకునేవారు లేరు.

హైస్కూల్‌ క్రీడా మైదానం అంతేనా..?
నీరు ప్రవహిస్తుండటంతో పాడైన ట్రాక్‌

మురుగునీటితో వర్షపునీరు కలిసి దుర్గంధం వెదజల్లుతున్న వైనం  పట్టించుకోని అధికారులు ఇక్కట్లలో క్రీడాకారులు

ఎర్రగుంట్ల, డిసెంబరు 5: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చిన ఎర్రగుంట్ల జడ్పీ హైస్కూల్‌ క్రీడా మైదానం వర్షపునీరు నిలిచి అపరిశుభ్రంగా మారినా పట్టించుకునేవారు లేరు. కోట్లాది రూపాయల విలువచేసే సుమారు 13ఎకరాల క్రీడా మైదానం జిల్లాలో ఎక్కడా లేదనే చెప్ప వచ్చు. పుట్‌బాల్‌, హాకీ, సాఫ్ట్‌బాల్‌, త్రోబాల్‌ లాంటి విభాగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు డజన్లకొద్ది ఉన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మైదానంలోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ఈ  రూ.2లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 400మీటర్ల ట్రాక్‌పై ప్రవహించడంతో ట్రాక్‌ మొత్తం పాడైపోయి అందరికి ఇబ్బంది కలుగుతోంది. వర్షపునీటితోపాటు బయటి వైపు ఉన్న డ్రైనేజి నీరు కూడా క్రీడా మైదానంలోకి వస్తుండటంతో తీవ్ర కంపు కొడుతోందీ. నీరు ఎక్కువ కాలంపాటు స్టాకు వుండటంతో పాచిపట్టి భరించరాని దుర్వాసన వెదజల్లడంతోపాటు క్రీడా కారులు జారీ కిందపడుతున్నారు. ఎంతో వ్యయ ప్రాయాసాలకోడ్చి దశాబ్దాలకు పైబడి పెంచిన చెట్లు సైతం నేలకొరుగుతున్నాయి.  గతంలో క్రీడా ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం నిత్యం క్రీడాకారులకు ఇక్కడే శిక్షణ ఇస్తూ క్రీడా మైదానాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే వారు. కాని నేడు ఆవైపు కన్నెత్రైనా చూసే వారు కరువైయ్యారనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. పాఠశాల అధికారులు వెంటనే స్పందించి నీరు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అలాగే ప్రహరీ ఆనుకుని ఉన్న వారు వారి ఇంట్లోని వృఽథానంతా క్రీడా మైదానంలోకి పారవేయడంపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

మైదానం పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటాం

ఎర్రగుంట్ల క్రీడా మైదానాన్ని త్వరలో నాడు-నేడు పనుల్లో భాగంగా శుభ్రం చేయిస్తాం. క్రీడా మైదానంలో వర్షపు నీటితోపాటు  తూర్పు ప్రహరీ బయటి వైపు నుంచి నీరు లోపలికి వస్తుండడంతో నీరు నిలిచి పాచిపట్టింది. ఈ విషయమై నగరపంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్క రిస్తాం.  మైదానంలో ఎవరైనా వేస్టేజిని వేస్తే  చర్యలు తీసుకుం టాం. వ్యాయామ ఉపాధ్యాయులను వాటిపై పర్యవేక్షించేలా చూస్తాం.  

- వసుంధరాదేవి, హెచ్‌ఎం, జడ్పీ హైస్కూల్‌

Updated Date - 2020-12-06T04:45:33+05:30 IST