అవగాహనతో అధిక మార్కులు

ABN , First Publish Date - 2022-05-23T05:25:29+05:30 IST

విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మానసికంగా వారికి ధైర్యం ఇచ్చేలా 11 పేపర్లను 6 పేపర్లుగా మార్చారు. అలాగే పేపర్‌లోని విధానాన్ని సులభతరం చేశారు. నేటి నుంచి జరిగే పరీక్షల్లో సులభంగా అత్యధిక మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టు నిపుణుల సూచనలు.

అవగాహనతో అధిక మార్కులు

 ఇలా చదితే పరీక్షల్లో సత్తా చాటవచ్చు

 నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం


కొండపాక. మే 22: కరోనా మహమ్మారి విద్యారంగంలో విపరీతమైన నష్టాన్ని కలిగించింది. పాఠశాల విద్యలో కీలకమైన పదో తరగతి పరీక్షలు రెండు సంవత్సరాలు నిర్వహించలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం పరీక్షలు ఈ నెల 23 నుంచి జూన్‌ 1 వరకు జరగనున్నాయి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మానసికంగా వారికి ధైర్యం ఇచ్చేలా 11 పేపర్లను 6 పేపర్లుగా మార్చారు. అలాగే పేపర్‌లోని విధానాన్ని సులభతరం చేశారు. నేటి నుంచి జరిగే పరీక్షల్లో సులభంగా అత్యధిక మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టు నిపుణుల సూచనలు.


అవగాహనతో తెలుగులో అత్యధిక మార్కులు

-గుండ్ల గోపాల్‌, తెలుగు పండిట్‌, జి.ప.ఉ.పా. అనంతసాగర్‌, చిన్నకోడూరు

తెలుగులో మంచి మార్కుఉలు సాధించడానికి ఈ విధానాన్ని అనుసరించాలి. ఇచ్చిన పేరాను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకొని ఆ ప్రశ్నావళికి జవాబులివ్వాలి. ప్రశ్నావాచకాల సహాయంతో మరో పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయవలసి ఉంటుంది. ఆ తరువాత పద్యపూరణము లేదా ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్థము, తాత్పర్యము అడిగిన విధంగా జవాబు రాయాలి. తదుపరి చిన్న ప్రశ్నలకు జవాబులు ఐదారు వాక్యాల నిడివితో రాయాలి. అడిగిన ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా సమాధానం రాస్తే మంచి మార్కులు సాధించవచ్చు. అలాగే వ్యాసరూప ప్రశ్నలకు 10 నుంచి 12 వాక్యాల నిడివితో సమాధానాలు రాయాలి. కరపత్రం లేదా లేఖ సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్న ఏదైనా తగు విరామచిహ్నాలను పాటిస్తూ, పద్ధతి ప్రకారం రాస్తే పూర్తి మార్కులు పొందే అవకాశం ఉంది. పార్టు-బి లో సొంతవాక్యాలు తప్పిస్తే మొత్తం మల్టీపుల్‌ చాయిస్‌ రూపంలో ఉంటుంది.  కాబట్టి జవాబులన్ని ఒకే రకంగా అనిపించినప్పటికి, చిన్నపాటి తేడా ఉంటుంది. ఆ తేడా గమనించి సరియైున సమాధానాన్ని సూచించాలి.

 

సాధనతో గణితం సులువే

-నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఏ గణితం, జడ్పీహెచ్‌ ఎస్‌, సింగన్నగూడెం

గణితం విషయంలో సాధనతో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. ప్రధానంగా వాస్తవ సంఖ్యలు యూక్లిడ్‌, ఆల్గారిధమ్‌, సమితులలో సమ్మేళన చేదనము బేధనములపై సమన్వయ వెన్‌ చిత్రాలపై సాధన చేయాలి. బహుపదులలో వాటి రకాలు శూన్య విలువలపై సమస్యలు, గ్రాఫ్‌ సమస్యలు సాధన చేయాలి. రేఖియా సమీకరణాలలో వాటి సాధన గ్రాఫ్‌ సమస్యలు బీజగణిత పద్ధతులలో చేయాలి. శ్రేడులలో అంక శ్రేడి ‘ఎన్‌ ’ పదం, ‘ఎన్‌’ పదాల మొత్తంపై సాధన చేయాలి. నిరూపక గణితములో మధ్యదూరం బిందువులపై సమస్యల సాధన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. జామితిలో అనుపాత సిద్ధాంతము, పైతాగరస్‌ సిద్ధాంతాలపై అవగాహన కలిగి ఉండాలి. సరూప త్రిభుజ నిర్మాణాలపై సమస్యలు సాధించాలి. వృత్తాలపై  స్పర్శ రేఖలు నిర్మాణము గీయడం, బాహ్య బిందువు నుంచి స్పర్శ రేఖలు నిర్మాణం చేయాలి. త్రికోణమితి అనువర్తన సమస్యలు సాధన చేయాలి. సాంఖ్యక శాస్త్రంలో వర్గీకృత అవర్గీకృతం దత్త అంశాలపై అంకమద్యమం మధ్యగతం బహుళకములపై దృష్టి పెట్టాలి. క్షేత్ర గణితంలో త్రిమితీయ ఆకారమైన గణములు, శంకువు తదితర అంశాలపై దృష్టి సారించాలి. ఎక్కువ సమయం సులభమైన చాప్టర్‌పై దృష్టి పెట్టి సాధన చేస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 


సాంఘిక శాస్త్రం పరీక్షలో 

-జి.బాలరాజు, ఎస్‌ఏ సోషల్‌, జడ్పీహెచ్‌ఎస్‌ చింతమడక

సాంఘిక శాస్త్రం పేపర్‌లో 50 శాతం ఛాయిస్‌ వుంటుంది. అందుకోసం సులభమైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా నినాదాలు ప్రాక్టీస్‌ చేసినట్లయితే వీటి నుంచి 6 మార్కులు వస్తాయి. అదే విధంగా కరపత్రం, లేఖ ప్రాక్టీస్‌ చేస్తే ఏదో ఒకటి పరీక్షలో వస్తుంది. నాలుగు మార్కులు సాధించవచ్చు. మ్యాప్‌ పాయింటింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లయితే 20 కి 20 మార్కులు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా సమాచార నైపుణ్యాలులో భాగంగా పట్టికలు ఇచ్చి విశ్లేషణ చేయమని ప్రశ్నలు అడుగుతారు. దీని నుంచి 20 మార్కులు వస్తాయి. అదేవిధంగా పేరాగ్రాఫ్‌ ఇచ్చి వ్యాఖ్యానం చేయమని కోరుతారు. దీని నుంచి 16 మార్కులు వస్తాయి. బాగా చదివి అర్థం చేసుకుంటే సుమారు 60 మార్కులకు పార్ట్‌ -ఏ లో 50 మార్కులు సులభంగా సాధించవచ్చు. 10 మార్కులు విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నకు సమాధానాలు రాస్తే సరిపోతుంది. అదే విధంగా 20 మార్కులు పార్ట్‌ -బి కి సంబంధించినవి ఉంటాయి. ఈ విషయ అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ప్రతి పాఠంలో ముఖ్యమైన అంశాలను చదవడం ద్వారా 20 మార్కులు సాధించవచ్చు. 


సైన్సులో మార్కులు ఇలా సాధించవచ్చు

-భగవాన్‌, ఎస్‌ఏ ఫిజికల్‌సైన్స్‌ జడ్‌.పి.హెచ్‌.ఎ్‌స, చిట్టాపూర్‌

సైన్సులో అధిక మార్కుల కోసం ద్రవాల వాహకత, తటస్థీకరణం, ఆమ్లాలు క్షారాలు యొక్క ధర్మాలు, నిరోధము పొడవుపై ఆధారపడటం, నిరోధము మధ్యచేదంపై ఆధారపడటం, నిరోధము పదార్థ స్వభావంపై ఆధారపడి వంటి కృత్యాలు కచ్చితంగా చదవాలి. 1) పుటాకార దర్పణం నాభ్యంతరం 2) కుంభాకార దర్పణ నాభ్యంతరం 3) ఓం నియమము పరిశీలన 4)లోహాలు ఆమ్లాలతో చర్య నొంది హైడ్రోజన్‌ వాయువును వెలువడే ప్రయోగం 5)లోహ క్షయంనకు గాలి నీరు అవసరము హస్వదృష్టి, దీర్ఘ దృష్టి, ప్రగలనం, రివర్బరీటరిఫర్నేస్‌ వంటి పటాలను జాగ్రత్తగా ఒకసారి వేసి ప్రాక్టీస్‌ చేయాలి. పుటాకార దర్పణం కుంభాకార కటకంపై అన్ని కిరణ రేఖా చిత్రాలను జాగ్రత్తగా ప్రాక్టీస్‌ చేయాలి. దర్పణ సూత్రము, కటక సూత్రము, నిరోధాల శ్రేణి సంధానం, నిరోధాల సమాంతర సంధానంపై గల గణిత సమస్యలపై సాధన చేయాలి. పీహెచ్‌ విలువ, కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం, కుంభాకార కటకం, పుటాకార కటకం, వాషింగ్‌ సోడా, బేకింగ్‌ సోడా, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ వంటి నిత్యజీవిత ఉపయోగాలను కచ్చితంగా చదవాలి. కృత్యము లేదా ప్రయోగశాల కృత్యంలలో గల పరికరాల జాబితా రాయండి అనే ప్రశ్నలు అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆఫ్‌బౌ నియమము, హున్డ్‌ నియమము, పౌలి  నియమము, మాయిలర్‌ చిత్రము, క్వాంటం సంఖ్యలు, మెండలీఫ్‌ మోస్లే నియమాలు, నవీన ఆవర్తన పట్టికపై ప్రశ్నలు ఉంటాయి. అయనీకరణ శక్మమ, ఎలకా్ట్రన్‌ ఆఫనిటీ, రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకత, లోహ స్వభావము, పరమాణు వ్యాసార్థం వంటి ఆవర్తన ధర్మాలు గ్రూపు పీరియడ్‌లలో ఏ విధంగా మారుతాయి వంటి ముఖ్యమైన ప్రశ్నలు కచ్చితంగా చదవాలి. 


ఇంగ్లీష్‌లో అధిక మార్కులు సులభమే

-ఎస్‌.జ్యోతి, ఎస్‌ఏ ఇంగ్లీష్‌, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ములుగు

ఇంగ్లీష్‌ పేపర్‌లో కొన్ని టిప్స్‌ అనుసరిస్తే అత్యధిక మార్కులు సాధించవచ్చు. పార్ట్‌ 1 లో టెక్స్ట్‌బుక్‌లోని మొదటి భాగం నుంచి వస్తుంది. ఇచ్చిన ప్యాసేజ్‌ను మూడుసార్లు చదవాలి. ఏ పాఠంలోనిది, అందులోని పాత్రలు ఎవరు గుర్తించాలి. ఇచ్చిన అంశం మీద రచయిత పాత్రల ప్రశ్నలు గుర్తించే జవాబులు రాయాలి. ప్యాసేజ్‌లోని పదాలపై దృష్టి పెట్టాలి. ప్రశ్నలు అర్థం చేసుకొని ఒక వాక్యంలో జవాబులు రాయాలి. రెండవ బిట్‌లో పద్యం (పోయమ్‌) వస్తుంది. ఇందులో దీనికి ఏం పేరు పెట్టాలి. ఎవరికి ఏమి జరిగింది. ఆ స్థానంలో నీవే ఉంటే ఏం చేస్తావు లాంటి ప్రశ్నలు వస్తాయి. దానికి సంబంధించిన జవాబు రాస్తే మార్కులు వస్తాయి. 11, 12, 13 ప్రశ్నల్లో చిన్న టిప్స్‌ ఉపయోగిస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కన్వర్జేషన్‌, ఇంటర్వ్యూ, లెటర్‌, డైరీ, నోటీస్‌, ఇన్విటేషన్‌ లాంటి డిస్‌కోర్సెస్‌ వాటిని అవగాహనతో రాస్తే ఎక్కువ మార్కులు సాధించవచ్చు. 18 నుంచి 22 వరకు సరిచేసి రాయడం వస్తాయి. మిగతా ప్రశ్నలు కూడా గ్రామర్‌ ఉపయోగించే జవాబులు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదివి తప్పులు లేకుండా రాస్తే అధిక మార్కులు సాధించవచ్చు. 


అర్థం చేసుకుంటే హిందీ సులభమే

- భైతి దుర్గయ్య, ఎస్‌ఏ హిందీ, జి.ప.ఉ.పా. జక్కాపూర్‌

మారిన ప్రశ్న పత్రం ప్రకారం ద్వితీయ భాష హిందీపై సరైన శ్రద్ధ కనబరిస్తే 10 పాయింట్లు సాధించడం పెద్ద కష్టమేమీకాదు. పార్టు-ఎ లో 60 మార్కులుంటాయి. 1 నుంచి 13 వరకు గల ప్రశ్నలు అర్థ గ్రాహ్యతకు సంబంధించినవి. 1 నుంచి 5 వరకు పాఠ్య పుస్తకంలోని ఉపవాచక పాఠములలో నుంచి ఏదేని ఒక పేరాగ్రాఫ్‌ ఇచ్చి అందులో నుంచే ప్రశ్నలు ఇస్తారు. 6 నుంచి 10 వరకు అపఠిత గద్యం ఇచ్చి అందులో నుంచే ప్రశ్నలు ఉంటాయి. 11 నుంచి 13 వరకు పాఠ్య పుస్తకం నుంచి ఏదేని పద్యం ఇచ్చి, ప్రతీ పద్యానికి సంబంధించిన 5  ప్రశ్నలు ఎ బి సి డి ఈ అడుగుతారు. ఈ మూడు ప్రశ్నలలోని ఏదేని ఒకటి మాత్రమే ఎంచుకుని దానికి సంబంధించిన 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. ఇందులోని ప్రశ్నలు అర్థం కావడానికి కొన్ని పదాల అర్థాలపై అవగాహన ఉంటే చాలు. పూర్తి మార్కులు సంపాదించవచ్చు. 14నుంచి 21వరకు లఘు సమాధాన ప్రశ్నలు. పద్య, గద్య పాఠాల నుంచి ఎనిమిది ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఒక ప్రశ్న లేదా రెండు ప్రశ్నలు కవి/రచయిత పరిచయం గురించి ఉంటాయి. ఈ నాలుగు ప్రశ్నలకు అర్థవంతమైన వాక్య నిర్మాణంతో సూటిగా స్పష్టంగా జవాబులు రాయాలి. 22 నుంచి 24 వరకు పద్య భాగం, 25 నుంచి 27వరకు  గద్యభాగానికి సంబంధించిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు వస్తాయి. సమాధానం ప్రారంభంలో కవి, కవయిత్రి లేదా రచయితల గురించి ఉదహరించడం వలన ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి సమాధానం పేరాగ్రా్‌ఫలుగా, అంశాలుగా విభజించి, సమగ్ర అవగాహనతో పది నుంచి పదిహేను వాక్యాలు వ్రాయాలి. 28నుంచి 30 వరకు విద్యార్థుల స్వీయ పరిజ్ఞానంకు సంబంధించినవి. లేఖ, వ్యాసం, సంభాషణ, నినాదాలు, ముఖాముఖి ప్రశ్నలు, కర పత్రం, పోస్టర్‌, జాగృతపరిచే కార్యక్రమాలకు చెందిన మూడు ప్రశ్నలు ఇస్తారు. ఈ విభాగంలో విద్యార్థులు అత్యధిక మార్కులు సంపాదించాలంటే సృజనాత్మకత, వినూత్నమైన ఆలోచన, రచనా నియమాలు పాటించాలి. ఉదాహరణకు వ్యాసంలో పరిచయం, విశ్లేషణ, ముగింపు లాంటివి. ఇక పార్టు-బిలో 20 ప్రశ్నలు. ప్రతీ దానికి ఒక మార్కు ఉంటుంది. ఇది అత్యంత ముఖ్యమైనది. ఇచ్చిన నాలుగు సమాధానాల నుంచి సరియైున సమాధానాన్ని గుర్తించి బ్రాకెట్లలో  ఎ/ బి/సి /డి లు రాయాలి. రెండు అక్షరాలు గాని, కొట్టివేతలు గాని ఉండొద్దు. ఇవి పూర్తిగా వ్యాకరణాంశాలకు చెందినవి. పర్యాయ పదాలు, విలోమ శబ్దాలు, ఉపసర్గాలు, ప్రత్యాయలు, లింగవచనములు, శబ్ద భేదాలు, కాలాలు, జాతీయాలు, వాక్య నిర్మాణం, సరియైున పదం, వాక్య ప్రకారం, విరామ చిహ్నాలు, విభక్తి ప్రత్యయాలు అంకెలు హిందీ అక్షరాల్లో మార్చడం లాంటి 20 ప్రశ్నలలో శబ్ద, వాక్యాలకు సంబంధించిన జవాబులను బాగా ఆలోచించాలి.  

Updated Date - 2022-05-23T05:25:29+05:30 IST