వినియోగదారులపై గ్యాస్‌ బండ

ABN , First Publish Date - 2021-03-08T05:43:03+05:30 IST

రూ.749, రూ.774, రూ.824, రూ.849, రూ.874..! ఏమిటీ చిట్టా పద్దులు అనుకుంటున్నారా?

వినియోగదారులపై గ్యాస్‌ బండ

  1. బెంబేలెత్తిస్తున్న గ్యాస్‌ ధరలు
  2. నెల రోజుల్లో సిలిండర్‌పై రూ.125 పెంపు
  3. గుట్టుచప్పుడు కాకుండా సబ్సిడీ ఎత్తేసిన కేంద్రం
  4. త్వరలో రోజువారీ ధరలు నిర్ణయించే అవకాశం
  5. కేంద్ర ప్రభుత్వం తీరుపై సామాన్యుడి ఆగ్రహం


కర్నూలు-ఆంధ్రజ్యోతి: రూ.749, రూ.774, రూ.824, రూ.849, రూ.874..! ఏమిటీ చిట్టా పద్దులు అనుకుంటున్నారా? ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు ఇవి. ఒక్క నెలలోనే ఇంత పెంచేశారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? అందుకే అడ్డూ అదుపు లేకుండా ఇలా పెంచుతూ పోతున్నారు. పదిహేను రోజులకు ఒకసారి సిలిండర్‌ ధరను పెంచుతూ కేవలం నెల రోజుల్లోనే రూ. 125 అదనపు భారాన్ని వినియోగదారులపై వేశారు. రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో ఉక్కిరిబిక్కిర వుతున్న సామాన్యులకు గ్యాస్‌ ధరను చూసి కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. గ్యాస్‌ బండ కొనాలంటే బెంబేలెత్తుతున్నారు. మొన్నటి వరకు గ్యాస్‌పై సబ్సిడీ ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు అది కూడా ఎత్తేసింది. ముందు ముందు ఇంధనం ధరల తరహాలోనే గ్యాస్‌ ధరలను కూడా రోజువారీ నిర్ణయించే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోజూ కొంత పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజలను తిరిగి కట్టెల పొయ్యి వైపు  నడిపిస్తారేమో అన్న చర్చ జరుగుతోంది. కేంద్ర తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమౌతోంది. 



రోజువారీ బాదుడు తప్పదా?

గత సంవత్సరం డిసెంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు గ్యాస్‌ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.250 మేర పెంచింది. సిలిండర్‌ ధర ఎంత వసూలు చేసినా, సబ్సిడీ వస్తోందిలే అన్న భ్రమలో ప్రజలు ఉండిపోయారు. ఈ ఏమరుపాటును కేంద్రం అదనుగా తీసుకుంటోంది. ఎంత పెంచినా వ్యతిరేకించడం లేదులే అని నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ తరహాలోనే గ్యాస్‌ ధరలను కూడా రోజూ వారీగా పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దానిలో భాగంగానే మొదట 15 రోజులకు ఒకసారి, ఆ తర్వాత వారానికి ఒకసారి గ్యాస్‌ ధరలను పెంచుతోందని, చివరిగా రోజూ పెంచుతా రన్న చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే త్వరలోనే గ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర లేదని నిపుణులు అంటున్నారు. తమది సామాన్య ప్రజానీకానికి మేలు చేసే ప్రభుత్వమని బీరాలు పలికే కేంద్ర ప్రభుత్వం పప్పు, బెల్లాల దగ్గర నుంచి గ్యాస్‌ వరకు అన్నింటి పైనా అడ్డూ అదుపు లేకుండా ధరలు పెంచు తోంది. రోజుకు ఒక్క పూట తినే రోజులు ఎంతో దూరంలో లేవని జిల్లా వాసులు ఆవేదన చెందుతున్నారు. 


మోయలేని భారం

నెలకు ఒకసారి గ్యాస్‌ తీసుకుంటారు. ధర పెంచినా ప్రజలు గుర్తించలేరని చమురు సంస్థలు భావిస్తున్నాయేమో..! ఒకే నెలలో రూ.125 పెంచి పడేశాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన సిలిండ్‌ ధర రూ.749 ఉండేది. ఫిబ్రవరి 4న రూ.25 పెంచారు. దీంతో రూ.774కి చేరింది. అదే నెల 15న మరో రూ.50 పెంచారు.  దీంతో ధర రూ.824కు చేరింది. కేవలం పదిహేను రోజుల్లో సిలిండర్‌పై రూ.75 పెరిగింది. ఇది చాలదన్నట్లు ఫిబ్రవరి 25వ తేదిన ఓ మారు, మళ్ళీ ఈ నెల 1వ తేదిన మరో మారు రూ.25 చొప్పున రెండుసార్లు పెంచారు. జిల్లాలో ప్రస్తుతం 14.2 సిలిండర్‌ ధర రూ.874 చేరింది. జిల్లాలో దాదాపు పన్నెండు లక్షల మంది గ్యాస్‌ వినియోగదారులు ఉన్నారు. పెరిగిన ధరతో జిల్లా వాసులపై దాదాపు రూ.6-7 కోట్ల అదనపు భారం పడుతోంది. ప్రతి ఇంటికీ గ్యాస్‌ అందించడమే లక్ష్యమని ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలపై ఏ మాత్రం కనికరం లేకుండా ధరలను పెంచుతోంది. 


సబ్సిడీ కట్‌

ఒక్కో కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తామని, సబ్సిడీ కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌ మూలఽ ధరను క్రమంగా రూ.700కి పెంచింది. ఈ ధరకంటే వినియోగదారుడు చెల్లించే ఎక్కువ  మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. అంతకు ముందు సిలిండర్‌పై రూ.230 నుంచి రూ.280 వరకు సబ్సిడీ వచ్చేది. కొవిడ్‌ విపత్తు తరువాత పెంచిన మూల ధరతో సబ్సిడీ పూర్తిగా తగ్గిపోయింది. ముందుగానే డబ్బు చెల్లించి సిలిండర్‌ తీసుకోవడం అలవాటైన ప్రజలు సబ్సిడీ గురించి ఆలోచించడం మానేశారు. ఎపుడో ఒకప్పుడు జమ అవుతుందిలే అని బ్యాంకు ఖాతాను కూడా చూడడం లేదు. అసలు ఎంత సబ్సిడీ వస్తోందో కూడా చాలా మందికి తెలియదు. దీన్ని ఆసరాగా తీసుకున్న కేంద్రం, ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సబ్సిడీని నెమ్మదిగా తగ్గిస్తోంది. ప్రస్తుతం సిలిండర్‌పై రూ.25 నుంచి రూ.41 మాత్రమే సబ్సిడీ వస్తోంది. అది కూడా చమురు కంపెనీలే ఇస్తున్నాయి. సబ్సిడీ ఎత్తివేయడం ద్వారా జిల్లా ప్రజలపై సుమారు రూ.200 కోట్లను కేంద్ర ప్రభుత్వం భారం మోపింది. సబ్సిడీ ఇవ్వకపోగా, ధర పెంచడం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల జేబులను ఖాళీ  చేస్తోంది. 


ఇక కట్టెలు ఏరుకొచ్చుకుంటాం..

కట్టెల పొయ్యి ఆరోగ్యానికి హానికరమని గ్యాస్‌ పొయ్యి వాడటం అలవాటు చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ ధరలు పెంచుకుంటూ పోతోంది. ఇంతకు ముందు ఎపుడో ఒకసారి గ్యాస్‌ ధర పెరిగేది. ఇప్పుడు 15 రోజులకు ఒకసారి పెంచడం మొదలెట్టారు. ప్రతిసారీ రూ. 50, రూ. 25 పెంచుకుంటూ పోతే కొనేదెలా..? ఇంతకు ముందు రేషన్‌ కార్డు మీద కిరోసిన్‌ ఇచ్చినట్లు మళ్లీ ఇవ్వాలి. కానీ ఇస్తారన్న నమ్మకం లేదు. కట్టెలు ఏరుకుని వచ్చి కట్టెల పొయ్యి రాజేసు కుంటే సరిపోతుంది. - రాములమ్మ, ఓర్వకల్లు


మేం బతకాలా.. వద్దా..?

అధికారంలోకి వస్తే అన్ని ధరలు తగ్గిస్తామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు ఇలా ధరలను పెంచడం సరికాదు. ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు గ్యాస్‌పై ధర పెంచేశారు. ఒక్క సిలిండర్‌కు డెలివరీ బాయ్‌ ఖర్చుతో కలిపి రూ.930-940 అవుతోంది. అడ్డూ అదుపు లేకుండా ప్రతి దానిపై ధరలు పెంచితే సామాన్యులు బతకాలా వదా..? - కాంతమ్మ, ఓర్వకల్లు 



రూ.వెయ్యి దాటుతుందేమో.. 

మాది మధ్య తరగతి కుటుంబం. ఎంత చూసి వాడుకున్నా నెలకు ఒక సిలిండర్‌ అయిపోతుంది. ఇంతకు ముందు గ్యాస్‌పై సబ్సిడీ వచ్చేది కాబట్టి ఒక సిలిండర్‌ రూ.500-600కు వచ్చేది. ఇపుడు సబ్సిడీ ఎత్తివేశారు. ధరలు పెంచుతున్నారు. పెరిగిన ధరతో నెలకు రూ.400 అదనపు భారం పడుతోంది. రెండు నెలల్లో  రూ.2వందలు పెరిగింది. గ్యాస్‌ బుక్‌ చేయాలంటే భయమేస్తోంది. తొందర్లోనే సిలిండర్‌ ధర రూ.వెయ్యి  దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. - మహాదేవి, సి బెళగల్‌ 


Updated Date - 2021-03-08T05:43:03+05:30 IST