అక్రమార్కులకే ‘ఉన్నత’ అండ !

ABN , First Publish Date - 2020-09-20T08:55:51+05:30 IST

ఏకంగా 120కి పైగా ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వెంచర్‌ ఏర్పాటు చేసి స్థలాలను విక్రయిస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు...

అక్రమార్కులకే ‘ఉన్నత’ అండ !

సర్కారు ఆశయానికి తూట్లు 

అనుమతుల్లేని లేఅవుట్‌పై చర్యల్లేవ్‌

బ్యానర్‌లతో వెళ్లిన అధికారులకు పైనుంచి చీవాట్లు

అడ్డుకుని వెళ్లగొట్టిన నిర్వాహకులు

ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని అక్రమ వెంచర్లు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, సెప్టెంబరు 19 : ఏకంగా 120కి పైగా ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ వెంచర్‌ ఏర్పాటు చేసి స్థలాలను విక్రయిస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. అక్రమ వెంచర్‌ వ్యవహారాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురాగా ఎట్టకేలకు సంబంధిత అధికారులు స్పందించారు. అనుమతులు లేని వెంచర్‌లో ఎవరూ ప్లాట్లు కొనవద్దని పేర్కొంటూ రాయించిన ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేసేందుకు వెళ్లగా... సదరు రియల్‌ ఎస్టేట్‌ సిబ్బంది ప్రభుత్వాధికారులను అడ్డుకున్నారు. అంతవరకైతే పర్వాలేదు.. కానీ మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్లమన్నారు.. ఎందుకు వెళ్లారు అంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మండలాధికారులు బిక్క మొహాలు వేసుకుని వెనుదిరిగారు. మరోసారి అటువైపు కన్నెత్తి చూడవద్దంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ సంఘటన చాలు మెదక్‌ జిల్లాలో అక్రమార్కులు ఎంత పవర్‌ఫుల్లో తెలియడానికి, అధికార యంత్రాంగం నిస్సహాయతను రుజువు చేయడానికి.


అక్రమ వెంచర్‌పై అధికారుల ఉపేక్ష

మెదక్‌ జిల్లాలో శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్కల గ్రామ పరిధిలో సుమారు  120 ఎకరాల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ భారీ వెంచర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఫార్మ్‌ప్లాట్ల పేరుతో పనులు చేస్తూ ఇప్పటికే సగం మేర స్థలాల విక్రయాలను పూర్తి చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఎలాంటి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలన్నా ముందుగా సదరు భూమికి నాలా కన్వర్షన్‌ చేయించాలి. ఇందుకు గాను భూమి రిజిస్ట్రేషన్‌ విలువలో 3 శాతం పన్నుగా చెల్లించాలి. అంతేకాకుండా హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అనుమతులను పొందాలి. కానీ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఇవేమీ లేకుండానే స్థలాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. అయినప్పటికీ అధికారులు స్పందించి పనులను అడ్డుకుని నిబంధనల మేర చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఈ నెల 15న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా ఎడిషన్‌లో సాగుభూమి పేరుతో రియల్‌ దందా’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో మేల్కొన్న స్థానిక  అధికారులు ఎట్టకేలకు చర్యలకు కదిలారు.


ఈ నెల 18న శివ్వంపేట ఎంపీవో లచ్చులు, చిన్నగొట్టిముక్కల గ్రామ పంచాయతీ కార్యదర్శి కిరరణ్‌ సదరు వెంచర్‌ వద్ద ఇది అనుమతిలేని లేఅవుట్‌.. ఇందులో ఎవరూ స్థలాలు కొనవద్దు అని రాయించిన బ్యానర్‌ను కట్టేందుకు వెళ్లారు. వెంచర్‌ గేట్‌ వద్దే సదరు సంస్థ సిబ్బంది అధికారులను అడ్డుకున్నారు. లోపలికి అనుమతించలేదు. వెంచర్‌కు వెళ్లే దారిలోనైనా బ్యానర్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమవగా.. సీఎంవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి బంధువు అభ్యంతరం చెప్పారు. ఈలోగా ఓ జిల్లా అధికారి నుంచి అక్కడున్న అధికారులకు ఫోన్‌ వెళ్లింది. ‘మిమ్మల్ని అక్కడికి ఎవరు వెళ్లమన్నారు.. ఎందుకెళ్లారు.. బ్యానర్‌ కట్టొద్దు.. వెంటనే తిరిగి వచ్చేయండి’ అంటూ ఆదేశాలు ఇచ్చాడు. చేసేదిలేక సదరు అధికారులు తీసుకెళ్లిన బ్యానర్‌ను కట్టకుండానే వెనక్కి వచ్చేశారు. నిబంధనలు పాటించని సంస్థపై చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సిన సదరు అధికారి.. కిందిస్థాయి సిబ్బంది విధులను నిర్వర్తిస్తుంటే ఆగ్రహం వ్యక్తం చేయడం, రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు వంతపాడటం విడ్డూరంగా ఉంది. సర్కారు ఖజానాకు రూ.కోట్లలో పన్ను రూపంలో కట్టాల్సిన ఆదాయానికి గండికొట్టినా జిల్లా అధికారులు ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది జవాబులేని ప్రశ్న. ఓ వైపు రాష్ట్రంలో ఉన్న అక్రమ వెంచర్లను ఆదిలోనే అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంటే.. జిల్లా యంత్రాంగం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. చిన్నగొట్టిముక్కల వ్యవహారంలో మొత్తానికి తమ బాధ్యతను నిర్వర్తించేందుకు వెళ్లిన అధికారులకు చివాట్లు పడగా... అక్రమ వెంచర్‌ యాజమాన్యం తమకు పైస్థాయిలో ఉన్న పట్టును నిరూపించుకున్నది.


ఆదిలోనే అడ్డుకోకుంటే ఇబ్బందులు తప్పవు

హెచ్‌ఎండీఏ అనుమతులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలో స్థలాలు కొంటే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా ఎల్‌ఆర్‌ఎస్‌ కింద క్రమబద్ధీకరణ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇందుకు భారీగా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తమ వెంచర్‌కు అనుమతులు లేని విషయాన్ని గోప్యంగా ఉంచి గుట్టుచప్పుడు కాకుండా స్థలాలు అంటగడుతోంది. అక్రమాన్ని అడ్డుకోవాల్సిన అధికారులేమో చేష్టలుడిగి చూస్తున్నారు. ఇకనైనా స్పందించకుంటే పన్నుల రూపంలో దక్కాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోనుంది. అంతేగాక కొనుగోలుదారులు అవస్థలు పడాల్సి వస్తుంది. జిల్లా అధికారులు ఇకనైనా అడ్డుకుని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దందాకు చెక్‌పెడతారా లేక దండం పెట్టి దాసోహమంటారా చూడాల్సిందే. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెనక్కి వచ్చిన మాట వాస్తవమేనని ఓ అధికారి అంగీకరించారు. కాని తాము చిన్నవాళ్లమని ఏం చేయగలమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2020-09-20T08:55:51+05:30 IST