మరణమృదంగం

ABN , First Publish Date - 2021-05-08T05:04:25+05:30 IST

జిల్లాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి.

మరణమృదంగం
జ్ఞానాపురం శ్మశానవాటిక

కరోనాతో రోజూ పదుల సంఖ్యలో మృతి

జ్ఞానాపురం శ్మశానవాటికలో ఆరని చితిమంటలే సాక్షి

గత వారం రోజులుగా ప్రతిరోజు వందకుపైగా మృతదేహాలకు దహన సంస్కారాలు

6వ తేదీన అత్యధికంగా 159!

వాస్తవానికి దూరంగా అధికారుల లెక్కలు

పదో వంతు కూడా చూపించడం లేదనే విమర్శలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


జిల్లాలో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల్లో మరణాలు సంభవిస్తున్నాయి. నగరంలో ఒక్క జ్ఞానాపురం శ్మశానవాటికలోనే గత వారం రోజులుగా వందకుపైగా మృతదేహాలకు దహన సంస్కారాలు జరుగుతున్నాయి. ఇందులో సాధారణ మరణాలు 20 వరకూ ఉంటే...మిగిలినవన్నీ కొవిడ్‌వేనని చెబుతున్నారు. కానీ అధికారుల లెక్క మాత్రం గరిష్ఠంగా ఇప్పటివరకూ 11 దాటలేదు. 


కరోనా మరణాలను జిల్లా యంత్రాంగం దాచిపెడుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంద మంది చనిపోతే...అందులో పదో వంతు మాత్రమే చూపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఏప్రిల్‌ నెల ప్రారంభం నుంచి కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తి ఉధృతమైంది.   కేసులు వందలతో మొదలై...నెలాఖరు నాటికి వెయ్యి దాటిపోయాయి. ఇక, ఈ నెలలో అయితే రెండు వేలకు అటుఇటుగా నమోదవుతున్నాయి. అత్యధికంగా ఐదో తేదీన 2,289 కేసులు వచ్చాయి. ఇదే సమయంలో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ప్రజలు ఆందోళన చెందుతారనో లేక మరణాలను నియంత్రించడంలో విఫలమయ్యామనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుందనో గానీ...అధికార యంత్రాంగం మరణాల సంఖ్యను తగ్గించి చూపిస్తోందనే వాదన వినిపిస్తోంది. ఇందుకు జ్ఞానాపురం శ్మశానవాటికలో నిరంతరంగా కొనసాగుతున్న అంత్యక్రియల పర్వం బలం చేకూరుస్తోంది. గత 20 రోజులుగా ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభిస్తే...రాత్రి ఎనిమిది, తొమ్మిది గంటల వరకూ దహన సంస్కారాలు జరుగుతూనే వుంటున్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. జ్ఞానాపురం శ్మశానవాటికలో కరోనాకు ముందు సాధారణ మరణాలు, రోడ్డు ప్రమాద మృతులు, హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించి ప్రతిరోజూ సగటున 20 వరకూ మృతదేహాలు వచ్చేవి. కరోనా కారణంగా అధికారుల లెక్కల ప్రకారం రోజుకు పది మంది వరకూ మృతి చెందుతుంటే...సగటున 30 రావాలి. కానీ అక్కడ గత 20 రోజులుగా వంద కు తగ్గకుండా మృతదేహాలకు అంత్యక్రియలు జరుగుతున్నాయని సిబ్బందే చెబుతున్నారు.


పొంతనలేని అధికారుల లెక్కలు


కరోనా మరణాలకు సంబంధించి అధికారులు ప్రతిరోజూ అధికారికంగా ప్రకటిస్తున్న లెక్కలకు, జ్ఞానాపురం శ్మశానంలో అంత్యక్రియలు జరుగుతున్న మృతదేహాల సంఖ్యకు ఏమాత్రం పొంతన వుండడం లేదు. ఈ నెల ఒకటిన కరోనా కారణంగా ఏడుగురు మృతిచెందినట్టు అఽధికారులు ప్రకటించారు. ఆరోజు జ్ఞానాపురం శ్మశానవాటికలో 103 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. పోనీ అందులో 20-25 సాధారణ మరణాలే అనుకుంటే....మిగిలిన 80-85 మంది ఏ కారణంగా మృతిచెందారనే ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం వుండడం లేదు. అదేమాదిరిగా ఈ నెల రెండో తేదీన ఎనిమిది మంది కరోనాతో మృతిచెందినట్టు ప్రకటించగా...ఆరోజు 103 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. మూడో తేదీన తొమ్మిది మంది కరోనాతో మృతి చెందినట్టు అధికారులు ప్రకటించగా...120 మందికి అంత్యక్రియలు జరిగాయి. నాలుగో తేదీన తొమ్మిది మంది కరోనాతో మృతిచెందినట్టు ప్రకటించగా...ఆరోజు 109 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. ఐదున 11 మంది కరోనాతో మృతిచెందినట్టు ప్రకటించగా, 103 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. గురువారం 11 మంది కరోనాతో మృతిచెందినట్టు ప్రకటించగా, 159 మృతదేహాలకు అంత్యక్రియలు జరిగాయి. అయితే వీటికి సంబంధించిన వివరాలను శ్మశానవాటికలోని సిబ్బందిని అడిగితే అధికారులు తమను వివరాలు వెల్లడించకూడదని ఆదేశించారని, తాము నోరు విప్పలేమని చెప్పడం విశేషం.


జ్ఞానాపురం శ్మశానవాటికలో....

తేదీ అధికారుల అంత్యక్రియలు

 లెక్క జరిగినవి 

మే 1 7 104  

2 8 103  

3 9 120  

4 9 109  

5 11 103  

6 11 159 

7 10 95

Updated Date - 2021-05-08T05:04:25+05:30 IST