హైకోర్టు తీర్పు చెంపపెట్టు

ABN , First Publish Date - 2020-05-30T10:00:05+05:30 IST

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించి ఆర్డినెన్స్‌ ద్వారా కనకరాజును

హైకోర్టు తీర్పు చెంపపెట్టు

సీఎం రాజీనామా చేయాలి

టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 29: రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగించి ఆర్డినెన్స్‌ ద్వారా కనకరాజును నియమించడంపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్‌ కూడా ఎన్నికల అధికారిపై విమర్శలు చేశారన్నారు. హైకోర్టు తీర్పుతో నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి, స్పీకర్‌, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టికల్‌ 213 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్డినెన్స్‌ తెచ్చే అధికారం లేకపోయినా రాత్రికి రాత్రి కనగరాజును రాష్ట్రానికి రప్పించి కమిషనర్‌గా నియమించారన్నారు.


రాష్ట్రంలో కరోనా వైరస్‌ విపరీతంగా వ్యాపిస్తున్న సమయంలో ఇలా ఎన్నికల అధికారులను మార్చుకుంటూ పోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న జగన్‌ ఇప్పటికైనా కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కోర్టుల ద్వారా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలు ఏ మాత్రం నచ్చడం లేదని, వారు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.


ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల్ని ఆదుకోవాల్సిందిపోయి మోయలేని భారం మోపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అధికారులపై కక్ష పెంచుకుంటున్నారని, తాను క్యాంపు కార్యాలయంలో ఉంటూ అధికారులను కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారని అన్నారు. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రమేష్‌కుమార్‌ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి నిర్వహించాలని, ఏకగ్రీవాలైన స్థానాలను కూడా రద్దు చేసి అన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరారు. సమావేవంలో నాగేంద్రకుమార్‌, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, పోతురాజు రవికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-30T10:00:05+05:30 IST