హైకోర్టు తీర్పులతో పెరిగిన విపక్షాల నైతిక స్థైర్యం

ABN , First Publish Date - 2020-05-30T10:59:04+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలో

హైకోర్టు తీర్పులతో పెరిగిన విపక్షాల నైతిక స్థైర్యం

తిరుపతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొలగింపు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జిల్లాలో ప్రతిపక్షాల నైతిక స్థైర్యాన్ని అమాంతం పెంచివేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష భారీ విజయంతో టీడీపీతో సహా విపక్షాలన్నీ స్థైర్యం కోల్పోయాయి. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ పార్టీలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోయాయి. ఎక్కడికక్కడ నాయకత్వాలు ఆర్థికంగానూ, భౌతికంగానూ కూడా వైసీపీ వర్గాల దూకుడును అడ్డుకోలేకపోయాయి. అయితే ఆశ్చర్యకరంగా కిందిస్థాయి కార్యకర్తలు మాత్రం పార్టీలకు స్థంభాల్లా నిలిచారు.


వైసీపీ దాడులకు, దౌర్జన్యాలకు బెదరకుండా ధైర్యంగా నిలబడి ఎన్నికల పోటీకి దిగారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆలస్యంగానైనా స్పందించడం, జిల్లా అధికారుల బదిలీకి ఆదేశించడంతో జిల్లాలో విపక్షాలకు, ఎన్నికల అక్రమాలను కళ్ళారా చూసిన పలు వర్గాలకు కొంతలో కొంత ఊరట కలిగించింది. అయితే ప్రభుత్వం ఏకంగా ఎన్నికల కమిషనర్‌నే తొలగించడం, జిల్లాలో ఎన్నికల అక్రమాలకు బాధ్యులుగా ఎన్నికల కమిషనర్‌ ప్రకటించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్శీ సంబంధిత వర్గాలను నిర్వేదంలోకి నెట్టివేసింది.


కాకపోతే ఎంతోకాలం కొనసాగకుండానే కేవలం రెండున్నర నెలల్లోనే రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వ ఆర్డినెన్స్‌ చెల్లదని ప్రకటించడంతోపాటు ఎన్నికల కమిషనర్‌ను తిరిగి విధుల్లోకి చేర్చుకోమని ఆదేశించడం జిల్లాలో ప్రతిపక్షాలకు మండు వేసవిలో ఉపశమనాన్నిచ్చింది. దానికి తోడు గత కొంతకాలంగా హైకోర్టు పలు అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పడుతూ రావడం, పలు నిర్ణయాలను అమలు కాకుండా అడ్డుకోవడం, చివరికి టీటీడీలో కూడా పలు వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేసుకోవడం, మార్చుకోవడం వంటి పరిణామాలు జిల్లాలో ప్రతిపక్షాలకు, ప్రజా సంఘాలకు నైతిక స్థైర్యాన్ని పెంచుతోందనే చెప్పాలి.

Updated Date - 2020-05-30T10:59:04+05:30 IST