హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి):మధుకాన్ ఇన్ఫ్రా అనుబంధ సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్ విలువను తగ్గించి విక్రయించాలన్న ప్రతిపాదనపై హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ సంస్థ గతంలో ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందించింది. ఈ మొత్తం రుణాలను వన్ టైం సెటిల్మెంట్ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని ప్రతిపాదించింది.
ఇందుకు అంగీకరించని ఎస్బీఐ.. లిక్విడేషన్ ప్రక్రియ ద్వారా నిర్ధారించిన విలువకు విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. లిక్విడేషన్ ప్రక్రియలో కంపెనీ విలువను రూ.335 కోట్లుగా నిర్ణయించారు. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రూ.800 కోట్లు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించకుండా, రూ.335 కోట్లకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ మధుకాన్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జి.రాధారాణి ధర్మాసనం.. లిక్విడేషన్ విలువకు సింహపురి ఎనర్జీ విక్రయంపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.