అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు నోటీసులా?

ABN , First Publish Date - 2022-05-21T09:09:07+05:30 IST

విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 20 మంది కంటే తక్కువగా ఉన్న ఏపీ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల గుర్తింపును ఎందుకు ఉపసంహరించకూడదో వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ

అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలలకు నోటీసులా?

ఇది ఏపీ విద్యాహక్కు చట్టానికి విరుద్ధం

విద్యాశాఖ ఉత్తర్వులు రద్దుచేసిన హైకోర్టు


అమరావతి,  మే 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ప్రవేశాల సంఖ్య 20 మంది కంటే తక్కువగా ఉన్న ఏపీ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల గుర్తింపును ఎందుకు ఉపసంహరించకూడదో వివరణ కోరుతూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ గత ఏడాది అక్టోబరు 24న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ఏపీ విద్యాహక్కు చట్టంలోని నిబంధనలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా ఈ ప్రొసీడింగ్స్‌ ఉన్నాయని ప్రాథమికంగా అభిప్రాయపడింది. పూర్తిస్థాయి విచారణ వేసవి సెలవుల తరువాత చేపడతామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌(ఏపీపీయుఎ్‌సఎంఏ) జనరల్‌ సెక్రెటరీ కె.తులసి విష్ణుప్రసాద్‌తో పాటు మరో మూడు పాఠశాలలు వేసిన పిటిషన్లపై ఈ నిర్ణయం వెలువరించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపించారు.


‘‘విద్యాహక్కు చట్టం 2009కి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఏపీ విద్యాహక్కు చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టంలోని నిబంధనలు ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసొసియేషన్‌కు వర్తించవు. ఎయిడ్‌ పొందని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌, మైనారిటీ, నాన్‌ మైనారిటీ పాఠశాలలకు ఆ నిబంధనలు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది’’ అని వాదించారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి పాఠశాల విద్యాకమిషనర్‌ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ని సస్పెండ్‌ చేశారు.

Updated Date - 2022-05-21T09:09:07+05:30 IST