Pub: పబ్‌లలో నిర్దిష్ట సౌండ్ ఉండేలా చూడాలని ఆదేశించిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-09-27T00:37:21+05:30 IST

హైదరాబాద్ (Hyderabad) పబ్‌ల వ్యవహారంపై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. పబ్‌ అనుమతులు

Pub: పబ్‌లలో నిర్దిష్ట సౌండ్ ఉండేలా చూడాలని ఆదేశించిన హైకోర్టు

హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) పబ్‌ల వ్యవహారంపై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. పబ్‌ అనుమతులు, చర్యలపై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్ (Rachakonda Cyberabad) సీపీలు హైకోర్టులో నివేదిక సమర్పించారు. పబ్స్‌లో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు సౌండ్ పొల్యూషన్ లేకుండా.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. పబ్‌లలో నిర్దిష్ట సౌండ్ ఉండేలా చూడాలని, నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లపై కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించారు. ఈ కేసుపై దసరా సెలవుల తర్వాత మరోసారి విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఇటీవల పబ్స్‌పై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రాత్రి 10 దాటితే  పబ్స్‌లో ఎలాంటి సౌండ్ పెట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 6 వరకు ఎలాంటి సౌండ్ పెట్టొద్దని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, సౌండ్‌ పొల్యూషన్‌ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఉందని హైకోర్టు పేర్కొంది. రాత్రి వేళల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్‌కు అనుమతి లేదని పేర్కొంది. ఇళ్లు, విద్యాసంస్థలున్న ప్రదేశాల్లో పబ్‌లకు ఎలా అనుమతి ఇచ్చారు? అని కోర్టు ప్రశ్నించింది. ఏ అంశాలను పరిగణించి పబ్‌లకు అనుమతులిచ్చారో చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ శాఖకు హైకోర్టు ఆదేశించింది. అలాగే పబ్‌లో రాత్రిపూట లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని సూచించింది.


హైకోర్టులో పిటిషన్‌..

స్రవంతి నగర్‌ వెల్ఫేర్‌ కమిటీ, జూబ్లీహిల్స్‌ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తో పాటు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు టాట్‌ పబ్‌పై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించారు. ప్రతి రోజూ అర్ధరాత్రి కాగానే శబ్దాలు వస్తున్నాయని దీని వల్ల నిద్రాభంగం కలుగుతోందని, కాలనీకి సమీపంలో ఉన్న పబ్‌నే తొలగించాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. యేడాదిన్నరగా ఈ పిటీషన్‌పై వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్వాహకులు మాత్రం ఏమవుంతుందిలే అనే ధీమాతో ఉన్నారు. అవసరమైతే రాజకీయ పలుకుబడి ఉపయోగించాలని అనుకున్నారు. కానీ, హైకోర్టు అందుకు విరుద్ధంగా తీర్పుచ్చింది. రాత్రి పది గంటలు దాటాక శబ్దాలు రావద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం పబ్‌ నిర్వహిస్తూ మద్యం సరఫరా చేసుకోవచ్చు కానీ సంగీతం పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దని హెచ్చరించింది. ఈ తీర్పు టాట్‌ పబ్‌తోపాటు మిగతా పబ్‌ల నిర్వాహకులకు కూడా చెక్‌ పెట్టేలా తీర్పు వెలువడటంతో నిర్వాహకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 

Updated Date - 2022-09-27T00:37:21+05:30 IST