నివేదికలు ఇవ్వకుండా విచారణా?

ABN , First Publish Date - 2021-10-20T09:09:57+05:30 IST

ఎస్టీ (వాల్మీకీ) కుల ధ్రువపత్రాల అంశంలో వాస్తవాలు తేల్చేందుకు ప్రాథమిక నివేదిక అందజేయకుండా విచారణకు హాజరుకావాలనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా స్థాయి స్ర్కూట్నీ కమిటీ

నివేదికలు ఇవ్వకుండా విచారణా?

నోటీసులకు వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లకు 8వారాల సమయమివ్వండి

ఎస్టీ కుల ధ్రువపత్రాల కేసులో తూర్పుగోదావరి జిల్లా అధికారులకు హైకోర్టు ఆదేశం


అమరావతి, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎస్టీ (వాల్మీకీ) కుల ధ్రువపత్రాల అంశంలో వాస్తవాలు తేల్చేందుకు ప్రాథమిక నివేదిక అందజేయకుండా విచారణకు హాజరుకావాలనడం సరికాదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, జిల్లా స్థాయి స్ర్కూట్నీ కమిటీ (డీఎల్‌ఎ్‌ససీ) ఛైర్మన్‌.. పిటిషనర్లకు నోటీసులు జారీ చేయడం సరికాదని పేర్కొంది. అధికారుల నోటీసులకు వివరణ ఇచ్చేందుకు తహసీల్దార్ల కమిటీతో పాటు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌.. జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలను 8 వారాల్లో పిటిషనర్లకు అందజేయాలని అధికారులను ఆదేశించింది. ఆ తరువాత ఎనిమిది వారాల్లో అధికారులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు పిటిషనర్లకు అనుమతి ఇచ్చింది. నిబంధనలను అనుసరించి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం విషయంలో విచారణ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులకు సూచించింది. అందుకు సంబంధించిన సమాచారాన్ని పిటిషనర్లకు తెలియజేయాలని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో చాలామందికి నోటీసులు ఇచ్చారని గుర్తుచేసిన న్యాయస్థానం.. బ్యాచ్‌ల వారీగా విచారణ నిర్వహించడం వల్ల వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి ఇటీవల తీర్పు ఇచ్చారు. కాగా నకిలీ ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలపై వాస్తవాలు తేల్చేందుకు తమ ముందు విచారణకు హాజరుకావాలంటూ.. 2019 జనవరిలో తూర్పుగోదావరి జిల్లా స్థాయి స్కూట్నీ కమిటీ ఛైర్మన్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన నోటీసులను సవాల్‌ చేస్తూ రాజవొమ్మంగి మండలం, వంచంగి గ్రామానికి చెందిన సీహెచ్‌పీ కుమార్‌ మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ..‘‘1988 ఫిబ్రవరి 20న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ జారీచేసిన మార్గదర్శకాల ఆధారంగా పిటిషనర్లకు ఎస్టీ కుల ధ్రువీకరణపత్రాలు ఇచ్చారు.


తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పిటిషనర్లపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు ముందు పిటిషనర్లకు తహసీల్దార్ల కమిటీ నోటీసులు ఇవ్వలేదు. నివేదిక దస్త్రాలను పిటిషనర్లకు అందజేయకుండా విచారణకు హాజరుకావాలని కోరడం సరికాదు’ అని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కౌంటర్‌ దాఖలు చేస్తూ..‘‘రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏడు మండలాల్లో రెవెన్యూ అధికారులు నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారని ఫిర్యాదులు అందాయి. కుల ధ్రువీకరణ పత్రాల వాస్తవికతను తేల్చేందుకు జిల్లా స్థాయి స్ర్కూట్నీ కమిటీ విచారణ చేపట్టింది’ అని వెల్లడించారు.

Updated Date - 2021-10-20T09:09:57+05:30 IST