‘సేవా శిక్ష’ను పునఃసమీక్షించండి

ABN , First Publish Date - 2022-04-08T08:29:17+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులో సామాజికసేవ శిక్షను విధిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై

‘సేవా శిక్ష’ను పునఃసమీక్షించండి

ఐఏఎస్‌ అధికారిణి వై.శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్‌   

నెంబరు కేటాయించేందుకు రిజిస్ట్రీ అభ్యంతరం

కోర్టు ధిక్కరణ కేసుల్లో తీర్పును రివ్యూ చేయొచ్చు

నెంబరు కేటాయించండి.. రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): కోర్టు ధిక్కరణ కేసులో సామాజికసేవ శిక్షను విధిస్తూ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. ఈ పిటిషన్‌కు నంబరు ఇవ్వడానికి తొలుత రిజిస్ట్రీ నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కేసులో వేసిన శిక్షను రివ్యూ చేసే అధికారం తమకు ఉంటుందని, నంబరు ఇవ్వాలని జస్టిస్‌ బట్టు దేవానంద్‌ చెప్పడంతో.. రిజిస్ట్రీ నంబరు కేటాయించారు. పిటిషన్‌కు విచారణార్హత ఉందని ఈ సందర్భంగా న్యాయమూర్తి అన్నారు. అనుబంధ పిటిషన్‌కు నెంబరు కేటాయించిన తరువాత తీర్పును పునఃసమీక్షించాలా...లేదా అనే విషయంపై విచారణ జరుపుతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకే కేంద్రాలు నిర్వహించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ వ్యాజ్యాలను విచారించిన హైకోర్టు...వాటిని తక్షణం తొలగించాలని 2020 జూన్‌లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఆదేశాలు అమలుకాకపోవడంతో కోర్టు సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.


ఈ వ్యాజ్యంలో పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్‌ గిరిజాశంకర్‌, పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి బీ రాజశేఖర్‌, అప్పటి కమిషనర్‌ వీ చినవీరభధ్రుడు, పురపాలకశాఖ ప్రస్తుత ప్రత్యేకప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, పురపాలకశాఖ అప్పటి ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, పురపాలకశాఖ అప్పటి డైరెక్టర్‌ జీ విజయ్‌కుమార్‌, ప్రస్తుత డైరెక్టర్‌ ఎంఎం నాయక్‌ను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యాలను విచారించిన కోర్టు.. తన ఆదేశాల అమలులో అధికారులు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని నిర్ధారించింది. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారులకు రెండు వారాల సాధారణ జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా తొలుత విధించింది. అయితే ఉత్తర్వులను సకాలంలో అమలు చేయనందుకు అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పడంతోపాటు తమ వయసు, సర్వీసును  పరిగణనలోకి తీసుకుని క్షమించాలని కోరారు. సామాజిక సేవ చేయడానికి అంగీకరిస్తే... మానవతా దృక్పథంతో క్షమిస్తానని కోర్టు అనగా.. అందుకు అధికారులు మౌఖికంగా అంగీకరించారు. దీంతో న్యాయమూర్తి తీర్పును సవరించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని, నెలలో ఒక ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సమయం కేటాయించాలని ఆదేశించారు. ఆ రోజు మధ్యాహ్నం లేదా రాత్రి విద్యార్థులకు అయ్యే భోజన ఖర్చులను అధికారులే భరించాలని స్పష్టం చేశారు. ఎనిమిది మంది అధికారులకు ఒక్కో జిల్లాను కేటాయించారు. అయితే.. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ తాజాగా వై శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ విచారణార్హతపై రిజిస్ట్రీ సందేహం లేవనెత్తారు. నెంబరు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నేపధ్యంలో ఈ వ్యవహారం  గురువారం విచారణకు వచ్చింది. 


పిటిషనర్‌ తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగా, అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరామ్‌ కోర్టుకు సహాయకారిగా వ్యవహరించారు. రివ్యూ పిటిషన్‌ విచారణార్హత పై తమ వాదనలు వినిపించారు. కోర్టు ధిక్కరణ కేసులో ఖరారు చేసిన శిక్షను రివ్యూ చేసే అధికారం కోర్టుకి ఉందని, అందుకు సంబంధించి ఏపీ, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పులను అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ ఉదహరించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.... ‘‘ఎనిమిది మంది ఐఏఎ్‌సలకు శిక్ష విధించినప్పుడు..అందులో ఒకరు వేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించవచ్చా? కోర్టు సుమోటాగా నమోదు చేసిన  కోర్టు ధిక్కరణ కేసులో విధించిన శిక్షను పునఃసమీక్షించే అధికారం న్యాయస్థానానికి ఉందా? ఈ రెండు అంశాల పై వాదనలు వినిపించండి’’ అని అడ్వకేట్‌ జనరల్‌ను న్యాయమూర్తి కోరారు. ఆ విచక్షణాధికారం కోర్టుకు ఉన్నదని అడ్వకేట్‌ జనరల్‌ అన్నారు. అధికరణ 215 మేరకు రివ్యూ పిటిషన్‌ను విచారించేందుకు న్యాయస్థానానికి ఎలాంటి పరిమితులూ లేవన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వై శ్రీలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. 

Updated Date - 2022-04-08T08:29:17+05:30 IST