టీటీడీ తీరులో వ్యాపార ధోరణి

ABN , First Publish Date - 2022-09-25T09:29:54+05:30 IST

ఆర్జిత సేవా టికెట్ల జారీ, భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో టీటీడీ తీరుపై హైకోర్టు మండిపడింది. కొవిడ్‌ను సాకుగా చూపించి 14ఏళ్ల క్రితం బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు..

టీటీడీ తీరులో వ్యాపార ధోరణి

భక్తుల మనోభావాలను గౌరవించరా? : హైకోర్టు 

ఒకవైపు కొత్తగా ఆర్జిత సేవ టికెట్లు విక్రయిస్తున్నారు 

మరి ఎప్పుడో బుక్‌ చేసుకున్నవారికి అవకాశమివ్వరేం?.. హైకోర్టు ప్రశ్న 

పిటిషనర్లకు సేవలో పాల్గొనే అవకాశమివ్వాలని ఆదేశం


అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆర్జిత సేవా టికెట్ల జారీ, భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో టీటీడీ తీరుపై హైకోర్టు మండిపడింది. కొవిడ్‌ను సాకుగా చూపించి 14ఏళ్ల క్రితం బుక్‌ చేసుకున్న టికెట్లు రద్దు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్జిత సేవ టికెట్లు బుక్‌ చేసుకోవడానికి కొత్తవారికి అవకాశం కల్పిస్తూ టీటీడీ భారీగా సొమ్ము వసూలు చేస్తోందని గుర్తుచేసింది. గతంలో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఆర్జిత సేవలో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పిస్తే ఎలాంటి ఆదాయం రాదన్న భావనలో ఉన్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఇలాంటి వ్యవహార శైలి భక్తుల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడమేనని వ్యాఖ్యానించింది. టీటీడీ వైఖరిలో వ్యాపార ధోరణి కనపడుతోందని వ్యాఖ్యానించింది. పిటిషన ర్లు కోరుకున్నవిధంగా ఆర్జిత సేవలో పాల్గొనేందుకు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల ఉత్తర్వులిచ్చారు. 


కేసు నేపథ్యం ఇదీ... 

విశాఖపట్నానికి చెందిన ఆర్‌.ప్రభాకరరావు 2007 జూలై 9న తిరుమల శ్రీవారి వస్త్రాలంకరణ సేవ (మేల్‌చాట్‌ వస్త్రం) కోసం ఆన్‌లైన్‌ ద్వారా ఈ-టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. 2021 డిసెంబరు 17న ఆ సేవలో పాల్గొనేందుకు ఆయనకు అవకాశం లభించింది. అయితే కొవిడ్‌ కారణంగా వస్త్రాలంకరణ సేవను రద్దు చేస్తున్నట్లు పిటిషనర్‌కు డిసెంబరు 7న టీటీడీ లేఖ రాసింది. దానికి ప్రత్యామ్నాయంగా వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు పొందాలని లేదా టీటీడీ వెబ్‌సైట్‌ ద్వారా సేవ కోసం చెల్లించిన మొత్తం తిరిగి పొందవచ్చని పేర్కొంది. అయితే తమకు కేటాయించిన సేవను వినియోగించుకొనేందుకు  మరో తేదీ ఖరారు చేయాలని పిటిషనర్‌ అభ్యర్థించారు. టీటీడీ నుంచి స్పందన లేకపోవడంతో ప్రభాకరరావు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే వివిధ ఆర్జిత సేవ  టికెట్లు పొంది రద్దు అయిన మరో ముగ్గురు కూడా పిటిషన్లు వేశారు. జడ్జి ఈ వ్యాజ్యాలన్నింటినీ కలిపి విచారించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఎం.విద్యాసాగర్‌, శశాంఖ భువనగిరి, సీహెచ్‌ ధనంజయ్‌, సోదుం అన్వేష వాదనలు వినిపించారు. 


తీర్పులో ఏముందంటే... 

‘జూన్‌, జూలై నెలల్లో ఆర్జిత సేవ టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు టీటీడీ మే నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. స్థలాభావం, కొవిడ్‌లతో టికెట్లు రద్దు అయినవారికి సర్దుబాటు చేయలేమనే వాదన సరికాదు. ఒకటి లేదా రెండేళ్లలో ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు టికెట్లు కేటాయించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను ఎందుకు నిరాకరిస్తున్నారు. దశాబ్దన్నర క్రితం నగదు కట్టించుకొని ఇప్పుడు తిరిగి చెల్లిస్తామనడం అనైతికం. నిర్దేశించిన తేదీల్లో స్వామివారి సేవలో పాల్గొనేందుకు అవకాశం కలుగుతుందని పిటిషనర్లకు ఆశ కల్పించారు. ఆ హామీకి కట్టుబడాలి. చట్ట హామీ నుంచి వైదొలగడానికి వీల్లేదని రాజధాని వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పిటిషనర్లకు టీటీడీ పంపిన లేఖలను రద్దు చేస్తున్నాం’ అని తీర్పులో న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2022-09-25T09:29:54+05:30 IST