రేపటి వరకు అంతమంది ప్రాణాలు కోల్పోవాలా?: హైకోర్టు

ABN , First Publish Date - 2021-05-11T21:00:53+05:30 IST

తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం నుంచి 10 రోజులు పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని కోర్టుకు ఏజీ తెలిపారు.

రేపటి వరకు అంతమంది ప్రాణాలు కోల్పోవాలా?: హైకోర్టు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బుధవారం నుంచి 10 రోజులు పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇస్తున్నామని చెప్పారు. అనంతరం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడిలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని కోర్టుకు ఏజీ తెలిపారు. అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద అంబులెన్సులను ఎందుకు నిలిపివేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.


ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఆర్ఎంపీ డాక్టర్ల ప్రిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని.. హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ అని, ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజలను ఇక్కడికి రావొద్దని చెప్పడానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించింది. ‘హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చే వారిని మీరెలా అడ్డుకుoటారు? కేర్, అపోలో ఆస్పత్రిలో అంతర్జాతీయ పేషంట్లు ఉంటారు. వాళ్ళను కూడా అడ్డుకుంటారా? దేశ రాజధాని ఢిల్లీకి కూడా ఎంతో మంది పేషంట్లు ఎన్నో రాష్ట్రాల నుంచి వెళుతుంటారు. అలా అని ఢిల్లీలో అంబులెన్సులను ఆపేస్తున్నారా? ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే అంబులెన్సులను ఆపడం ఏమిటి? గతంలో మేం చెప్పినట్టు మొబైల్ టెస్టులను కూడా మీరు నిర్వహించలేక పోయారు. కానీ ఇప్పుడేమో అంబులెన్సులను ఆపేస్తున్నారు. ఒక ప్రకటన కూడా చేయకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను ఎలా ఆపేస్తారు? అన్ని మీడియా సంస్థల్లో చుస్తున్నాం. సరిహద్దులో 40-50 అంబులెన్సులు నిరీక్షిస్తున్నాయి’’ అని హైకోర్టు వ్యాఖ్యానించగా.. రేపటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ వ్యాఖ్యలతో మండిపడ్డ ఉన్నత న్యాయస్థానం.. రేపటి వరకు అంత మంది ప్రాణాలు కోల్పోవాలా అని ఉన్నతన్యాయస్థానం సీరియస్ అయ్యింది.

Updated Date - 2021-05-11T21:00:53+05:30 IST