‘పది’ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ముగిసిన విచారణ

ABN , First Publish Date - 2022-05-19T08:41:35+05:30 IST

పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ

‘పది’ ప్రశ్నపత్రం లీక్‌ కేసులో ముందస్తు బెయిల్‌పై ముగిసిన విచారణ

నేడు ఉత్తర్వులు ఇవ్వనున్న హైకోర్టు


అమరావతి,  మే 18(ఆంధ్రజ్యోతి): పదో తరగతి ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఈ పిటిషన్లను మాజీ మంత్రి నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు కొతపా పునీత్‌తో పాటు విద్యాసంస్థలకు చెందిన మరికొందరు దాఖలు చేశారు. ఈ విషయంలో తగిన నిర్ణయం వెల్లడించేందుకు గురువారానికి వాయిదా వేస్తున్నట్లు  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. మన్మథరావు ప్రకటించారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో చిత్తూరు జిల్లా డీఈవో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు మాల్‌ ప్రాక్టీస్‌ నిరోధక చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 4వ అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో పోలీసులు తమను అరెస్టు చేసే అవకాశం ఉందని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషనర్లపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఈ నెల 15న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు రాగా.. పోలీసుల తరఫు న్యాయవాది దుష్యంత్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లో పిటిషనర్లను నిందితులుగా పేర్కొనలేదన్నారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లకు విచారణార్హత లేదన్నారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. నారాయణ విద్యాసంస్థల్లో వారు వివిధ హోదాల్లో పనిచేస్తున్నందున అరెస్టు చేసే అవకాశం ఉందన్నారు. మాల్‌ప్రాక్టీస్‌ చట్టం కింద కేసు నమోదు చేసినప్పుడు ఐపీసీ సెక్షన్లు పెట్టడానికి వీల్లేదన్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 41(ఏ) నిబంధలు పాటించాలన్నారు.  

Updated Date - 2022-05-19T08:41:35+05:30 IST