ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కోసం అంగుళం భూమి సేకరించలేదు

ABN , First Publish Date - 2022-05-19T08:40:49+05:30 IST

రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ రూపకల్పన వ్యవహారంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కోసం అంగుళం భూమి సేకరించలేదు

అనుచిత లబ్ధిచేకూర్చామనేది ఎక్కడ?

రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రభుత్వ ప్రయత్నం

సీఐడీ కేసు నమోదు దానిలో భాగమే

ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి

మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌

నేడు విచారించనున్న హైకోర్టు


అమరావతి,  మే 18(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌ రూపకల్పన వ్యవహారంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ నేతలను జైలుకి పంపి, ఆ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. అందులో భాగంగానే సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు.


ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం కోసం అంగుళం భూమి కూడా సేకరించలేదని.. ఈ నేపథ్యంలో అనుచిత లబ్ధి అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ వ్యాజ్యం గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె. మన్మథరావు ముందు విచారణకు రానుంది. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌తో పాటు ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మే 9న సీఐడీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 120(బి),420, 166,167, 217, అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌13(2) రెడ్‌ విత్‌ 13(1)(ఏ) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాజీ సీఎం చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు. మాజీ మంత్రి నారాయణను కేసులో ఏ2గా పేర్కొన్నారు.


పిటిషన్‌లో ఏముందంటే

‘2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం ప్రతిపాదనను పక్కన పెట్టింది. దీనికోసం అంగుళం భూమి కూడా సేకరించలేదు. ఈ నేపథ్యంలో కొందరికి లబ్ధిచేకూర్చేలా వ్యవహరించి, మరికొందరికి నష్టం చేశామనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఓ ప్రైవేట్‌ హౌసింగ్‌ సంస్థతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణల్లో పేర్కొన్నారు.  నాకుగానీ, నా కుటుం బ సభ్యులకుగానీ ఆ సంస్థతో ఆర్థికపరమైన సంబంధాలు లేవు. అమరావతి మా స్టర్‌ ప్లాన్‌ రూపకల్పన వ్యవహారాన్ని సీఆర్డీఏ 2015 ఆగస్టు 28న సింగపూర్‌ కంపెనీ సుర్బానా-జురాంగ్‌ సంస్థకు అప్పగించింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో 6 సంవత్సరాల 8 నెలల అసాధారణ జాప్యం తరువాత ఇప్పుడు ఫిర్యాదు చేశారు. జాప్యానికి గల కారణాలను ఫిర్యాదులో పేర్కొనలేదు. ఏపీ సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం రాజధాని నిర్మాణానికి సమిష్ఠిగా తీసుకున్న నిర్ణయాల విషయంలో ప్రభుత్వ అధికారులు లేదా వ్యక్తిని ప్రాసిక్యూట్‌ చేయడానికి వీల్లేదు. ఆ మేరకు చట్టంలో రక్షణ ఉంది.


చట్ట విరుద్ధంగా ప్రతిఫలం పొందారని ఫిర్యాదులో ఎక్కడా పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో సెక్షన్‌ 120 (బీ), సెక్షన్‌ 420, అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు  పిటిషనర్‌కు వర్తించవు. ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కక్షసాధించాలని, పార్టీ ప్రతిష్ఠను దిగజార్చాలనే దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారు. ఈ వివరాలు పరిగణలోకి తీసుకొని ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి’ అని కోరారు. మరోవైపు ఇదే కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ లింగమనేని రమేశ్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఈ పిటిషన్లు కూడా గురువారం విచారణకు రానున్నాయి.

Updated Date - 2022-05-19T08:40:49+05:30 IST