మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-06-06T15:42:57+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ శ్రీలంకలో ఉన్న తల్లితో ఫోన్‌లో మాట్లాడితే భద్రతాపరంగా కలిగే ముప్పు ఏమిటో తెలపాలంటూ మద్రాసు హైకోర్టు

మాజీ ప్రధాని రాజీవ్ హత్య కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు

  • మురుగన్‌ తల్లికి ఫోన్‌ చేస్తే ముప్పు ఏమిటి?
  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  


చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ శ్రీలంకలో ఉన్న తల్లితో ఫోన్‌లో మాట్లాడితే భద్రతాపరంగా కలిగే ముప్పు ఏమిటో తెలపాలంటూ మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వేలూరు జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అను భవిస్తున్న మురుగన్‌, అతడి భార్య నళిని తరపున నళని తల్లి పద్మ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో నళిని, మురుగన్‌లు శ్రీలంకలో ఉన్న మురుగన్‌ తల్లి, లండన్‌లో ఉన్న అతడి సోదరితో రోజూ పది నిమిషాలపాటు వీడియో కాల్‌లో మాట్లాడేందుకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్‌ న్యాయమూర్తులు కృపాకరన్‌, ఆర్‌.హేమలత ఎదుట విచారణకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎ.నటరాజన్‌ హాజరై ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య భద్రతకు సంబంధించిన విషయమని, అంతే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఖైదీలు విదేశాల్లో ఉన్నవారితో ఫోన్‌లో మాట్లాడేందుకు జైలు నిబంధనలు అంగీకరించవని వాదించారు. న్యాయమూర్తి కృపాకరన్‌ జోక్యం చేసుకుంటూ జైలులో ఉన్న మురుగన్‌ తన తండ్రి మరణించడంతో శ్రీలంకలో ఉన్న తల్లిని పరామర్శించేందుకు ఫోన్‌ చేసి మాట్లాడటం వల్ల ఎలాంటి భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతాయని ప్రశ్నించారు. మురుగన్‌ విదేశీయుడే (శ్రీలంక వాసి) అయినా మనిషిగా అన్ని రకాల సెంటిమెంట్లు కలిగిన వ్యక్తే కదా అని ప్రశ్నించారు. తర్వాత కేసు విచారణను న్యాయమూర్తులు వాయిదా వేశారు.


Updated Date - 2020-06-06T15:42:57+05:30 IST