రాజధానిపై 307 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు

ABN , First Publish Date - 2022-03-03T21:48:30+05:30 IST

అమరావతి రాజధానిపై హైకోర్టు 307 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును న్యాయస్థానం అప్లోడ్‌ చేసింది.

రాజధానిపై 307 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు

అమరావతి: అమరావతి రాజధానిపై హైకోర్టు 307 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును న్యాయస్థానం అప్లోడ్‌ చేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాజధాని పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు.. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని తేల్చిచెప్పింది. రాజధాని విషయంపై మొత్తం 70 పిటిషన్లపై గురువారం ఉదయం త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. రెక్యూజల్‌ పిటీషన్‌పై కూడా 18 పేజీల తీర్పును హైకోర్టు వెలువరించింది. ఇద్దరు న్యాయమూర్తులను విచారణ నుంచి తప్పుకోవాలని, ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.


రాజధానిపై దాఖలైన 64 పిటిషన్ల విచారణకు హైకోర్టు అంగీకారం తెలిపింది. ప్రభుత్వానికి శాసన అధికారం లేదని, సీఆర్‌డీఏ చట్టం ప్రకారం రైతులకు.. న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో ప్లాట్లు అప్పగించాలని ఆదేశించింది. ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, హైకోర్టు పర్యవేక్షణలోనే అభివృద్ధి జరగాలని నిర్దేశించింది. మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించాలని, 6 నెలల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పేర్కొంది. 


తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు మ్యాడమస్‌ కొనసాగుతుందని, మాస్టర్‌ ప్లాన్ ప్రకారం ఉన్నది ఉన్నట్లు అభివృద్ధి చేయాలని కోర్టు ఆదేశించింది. అన్ని సౌకర్యాలతో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని, అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, అమరావతి భూములను తనఖా పెట్టకూడదని న్యాయస్థానం ఆదేశించింది. రాజధాని అవసరాలకు తప్ప వేరేవాటికి భూములు ఇవ్వొద్దని, ఒక్కో పిటిషనర్‌కు ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు చెప్పింది.

Updated Date - 2022-03-03T21:48:30+05:30 IST