సిట్‎పై స్టే

ABN , First Publish Date - 2020-09-17T09:05:41+05:30 IST

జగన్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పాలకులను...

సిట్‎పై స్టే

న్యాయశాస్త్ర నిబంధనల మేరకు ఏ ప్రభుత్వమైనా అంతకుముందున్న ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందే. బలమైన, స్పష్టమైన కారణాలుంటేనే ఆ విధానాల నుంచి వైదొలగవచ్చు. కానీ ఈ కేసులో అలాంటిదేమీ కనిపించడం లేదు.

గత ప్రభుత్వానికి చెందిన ప్రతి నిర్ణయాన్నీ పునఃసమీక్షించే విశృంఖలాధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదు. పునఃసమీక్షాధికారం చట్టం ద్వారా పొందాలి తప్ప.. స్వతఃసిద్ధంగా రాదు.

ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలేవీ లేవు.

ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుంది. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చారు.

- హైకోర్టు


మంత్రివర్గ ఉపసంఘం చర్యలపైనా 

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విశృంఖల పునఃసమీక్షాధికారం రాష్ట్ర సర్కారుకు లేదు

అది చట్టం ద్వారానే వస్తుంది.. స్వతఃసిద్ధంగా రాదు

గత ప్రభుత్వ విధానాలను ఏ సర్కారైనా అనుసరించాలి

ఉపసంఘం, సిట్‌ ఏర్పాటును సమర్థించే అంశాలేవీ లేవు

కేసు నమోదుకు ముందే దర్యాప్తు చేయడమా?

నేరాల విభజన, ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థనా?

ఇవన్నీ లోపభూయిష్టమే: ధర్మాసనం

కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చడానికి నో

ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ కొట్టివేసిన న్యాయస్థానం


 ‘రాజ్యాంగం కేవలం ఉనికిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగ సంస్కృతి ఉన్నట్లు కాదు. రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిపక్వత, సత్సంప్రదాయాల్ని అవలంబించే ప్రజలు ఉన్నచోట మాత్రమే రాజ్యాంగ సంస్కృతి పరిఢవిల్లుతుంది. అది లేనిచోట రాజ్యాంగ ప్రమాణాలు పుస్తకాలకే పరిమితమైన ఆదర్శాలుగా మిగిలిపోతాయి’ అని ఓ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి గుర్తుచేశారు.


మంత్రివర్గ ఉపసంఘానివి కూడా..

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ పాలకులను ఇరుకునపెట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేసిన సర్కారుకు హైకోర్టు కళ్లెం వేసింది. మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) తదుపరి చర్యలన్నీ నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో, దాని సిఫారసు మేరకు సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవోల ఆధారంగా తదుపరి చర్యలన్నిటిపైనా స్టే విధించింది. అంతేగాక ఈ పిటిషన్లలో కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ పిటిషన్లలో కేంద్రం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లను ప్రతివాదులుగా చేర్చాలని అభ్యర్థిస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. న్యాయశాస్త్ర నిబంధనల మేరకు ఏ ప్రభుత్వమైనా అంతకుముందున్న ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని తేల్చిచెప్పింది. బలమైన, స్పష్టమైన కారణాలుంటేనే ఆ విధానాల నుంచి వైదొలగవచ్చని పేర్కొంది.


కానీ ఈ కేసులో అలాంటిదేమీ కనిపించడం లేదని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వానికి చెందిన ప్రతి నిర్ణయాన్నీ పునఃసమీక్షించే విశృంఖలాధికారం ప్రస్తుత ప్రభుత్వానికి లేదని, తమ ముందున్న రికార్డుల ప్రకారం పరిమితులకు లోబడి కొన్నింటిలో మాత్రమే సమీక్ష చేస్తున్నట్లుగా లేదని హైకోర్టు అభిప్రాయపడింది. పునఃసమీక్షాధికారం చట్టం ద్వారా పొందాలి తప్ప.. స్వతఃసిద్ధంగా రాదని కుండబద్దలు కొట్టింది. అలాంటి అధికారం తనకు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆధారమూ చూపలేకపోయిందని పేర్కొంది. ప్రభుత్వ విధానాలు చట్ట నిబంధనలు విరుద్ధంగా, ఏకపక్షంగా ఉన్నా.. సహేతుకంగా లేనిపక్షంలో న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొంది. తమ ముందున్న వివరాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం చెబుతున్న నేరాలకు సంబంధించి దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు, కొనసాగింపును సమర్థించే ఆధారాలేవీ లూవని వ్యాఖ్యానించింది. ఎప్పుడైనా ఫిర్యాదు చేశాకే నేరం నమోదవుతుందని.. కానీ ఇక్కడ నేరం నమోదు కావడానికి ముందే దర్యాప్తు చేయడంతో పాటు ఆయా నేరాలను విభాగాలుగా మార్చారని గుర్తుచేసింది. అంతేగాక ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు అభ్యర్థించడం వంటివన్నీ లోపభూయిష్టమేనని పేర్కొంది. ఈ వ్యవహారంలో కేవలం దురభిప్రాయంతో రాష్ట్రప్రభుత్వం ఫిర్యాదు చేయడం, దర్యాప్తు చేయడం, అపరిమితమైన పునఃసమీక్షాధికారం కలిగి ఉన్నామనుకోవడం ఏమాత్రం సరి కాదని అభిప్రాయపడింది. ఈ పిటిషన్ల వ్యవహారంలో ప్రజాస్వామ్యంలోని ముఖ్యాంశాలకు తగినట్లుగా ప్రభుత్వ చర్యలు లేవని ప్రాథమికంగా అభిప్రాయపడింది. అందువల్ల మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు చేస్తూ జారీ అయిన జీవోల వ్యవహారంలో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం సమీక్షించజాలదని, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలన్న పిటిషనర్ల తరఫు న్యాయవాదుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘రాజ్యాంగం కేవలం ఉనికిలో ఉన్నంత మాత్రాన రాజ్యాంగ సంస్కృతి ఉన్నట్లు కాదు. రాజకీయ నాయకత్వం ప్రదర్శించే పరిపక్వత, సత్సంప్రదాయాల్ని అవలంబించే ప్రజలు ఉన్నచోట మాత్రమే రాజ్యాంగ సంస్కృతి పరిఢవిల్లుతుంది. అది లేనిచోట రాజ్యాంగ ప్రమాణాలు పుస్తకాలకే పరిమితమైన ఆదర్శాలుగా మిగిలిపోతాయి’ అని ఓ తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు గుర్తు చేశారు. 


కొందరిని ఇబ్బంది పెట్టేందుకే..: పిటిషనర్లు

‘ఐదేళ్లకోసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించిన పార్టీయే రాష్ట్రాన్ని పాలిస్తుంది. రాజకీయ పార్టీల విధానాలు వేర్వేరు కాలాల్లో వివిధ రకాలుగా, ప్రయోగాత్మకంగా ఉంటాయి. ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వానికి ఎన్నికల మేనిఫెస్టో మేరకు నిర్ణయాలు తీసుకునే హక్కు, కాలానుగుణంగా అవసరం మేరకు తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటాయి. గత ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించజాలదు.. పునఃపరిశీలించలేదు. ప్రభుత్వం అనేది నిరంతరం కొనసాగుతుంది. చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం, వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అనడంలో అర్థం లేదు. ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వులు మున్ముందు జరుగబోయే వాటి గురించి ఉంటాయి తప్ప.. అంతకు ముందున్న వాటి గురించి కాదు. అందువల్ల ప్రస్తుత ప్రభుత్వానికి గత ఏడాది మే 30వ తేదీకి ముందు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై సమీక్షించే అధికారం లేదు. గత ప్రభుత్వ నిర్ణయాలపై పునఃసమీక్షకు ప్రస్తుత ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు.. అధికార పరిధిని అతిక్రమించడంతో పాటు రాజ్యాంగవిరుద్ధమైనవి. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు గానీ, సిట్‌ ఏర్పాటుకు గానీ తగిన కారణాలే లేవు. జీవో 1411లో పేర్కొన్న ఆదేశాలను ఉపసంఘం పూర్తి చేయలేదు.


ఎలాంటి సిఫారసులు లేని మొదటి విడత నివేదికను ప్రభుత్వానికి అందించింది. గతంలో జరిగిన నిర్ణయాలపై సమగ్ర దర్యాప్తు జరగాలని అసెంబ్లీ స్పీకర్‌ ప్రభుత్వానికి చేసిన సూచనల మేరకే సిట్‌ ఏర్పాటైంది. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ అసెంబ్లీని మాత్రమే నిర్వహించాల్సి ఉంది. వారు ప్రభుత్వానికి ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేరు. సిట్‌కు పోలీసుస్టేషన్‌ హోదా కల్పించడం నిబంధనలకు విరుద్ధమే. ఎక్కడైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక దర్యాప్తు చేస్తారు. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా గత ప్రభుత్వంలోని కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో సిట్‌ ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు శాసనాధికారమే లేదు. అలాంటప్పుడు కార్యనిర్వాహక అధికారంతో జారీ చేసే జీవోలు చెల్లుబాటు కావు. అందువల్ల ఆ రెండు జీవోలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడంతో పాటు, వాటిని రద్దు చేయండి’ అని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాదులు పి.వీరారెడ్డి, వేదుల వెంకటరమణ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.


టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న ప్రధాన విధాన నిర్ణయాలు, ప్రాజెక్టులు, పథకాలు, ఏర్పాటు చేసిన సంస్థలు, ఇతర కీలకమైన పరిపాలనా నిర్ణయాలపై సమీక్షించేందుకు వైసీపీ ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 26న మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో 1411ను జారీ చేసింది. ఆ ఉపసంఘం సిఫారసు మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 21న ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురాంరెడ్డి నేతృత్వంలో పది మంది పోలీసు అధికారులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ జీవో 344ను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్‌ చేస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య, ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ గత మార్చి నెలలో వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ‘ప్రభుత్వ ఆదేశాలు చట్టవిరుద్ధం, రాజ్యాంగవిరుద్ధం. టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ పార్టీ నేతలపై ప్రతీకారం తీర్చుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘం, సిట్‌ ఏర్పాటు చేసింది. ఎలాంటి శాస్త్రీయత లేని ఆ జీవోలు నిరాధారమైనవి, అస్పష్టమైనవి.. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్న ఆ జీవోలను రద్దు చేయాలి’ అని వారు అభ్యర్థించారు. వారి తరఫున సీనియర్‌ న్యాయవాదులైన వేదుల వెంకటరమణ, పి.వీరారెడ్డి వాదనలు వినిపించారు. మఽఽధ్యంతర ఉత్తర్వుల జారీకి సంబంధించి ఇరు పక్షాల వాదనలు ఈ నెల 9వ తేదీన ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వు చేసి, బుధవారం వెలువరించింది.


సమీక్షించే అధికారం ఉంది: అడ్వకేట్‌ జనరల్‌

‘గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక మేరకే సిట్‌ను ఏర్పాటు చేశాం. గత ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేయకమునుపే అక్కడ పలువురితో భూములు కొనుగోలు చేయించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తేనే అక్రమాలు వెలుగులోకి వస్తాయి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలం. గత ప్రభుత్వ కాలంలో ఏపీ ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయి. ఈ వ్యవహారంలో కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఈ అక్రమాలపై నివేదికను కేంద్రానికి పంపడంతో పాటు దర్యాప్తు కోసం సీఐడీకి ప్రాథమిక అంగీకారం కూడా తెలిపాం. అందువల్ల ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం, సీఐడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చి వారి వాదనలు కూడా వినాలి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల దర్యాప్తు కోసమే సిట్‌ ఏర్పాటు చేశాం’ అని అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరాం హైకోర్టుకు తెలిపారు.

Updated Date - 2020-09-17T09:05:41+05:30 IST