కోర్టు తీర్పుతో ఆనందంగా ఉంది: డాక్టర్‌ సుధాకర్‌ తల్లి

ABN , First Publish Date - 2020-06-05T21:01:21+05:30 IST

కోర్టు తీర్పుతో ఆనందంగా ఉందని డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరి బాయ్‌ చెప్పారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు. నిన్న సాయంకాలం వరకు ప్రభుత్వం నుంచి

కోర్టు తీర్పుతో ఆనందంగా ఉంది: డాక్టర్‌ సుధాకర్‌ తల్లి

విశాఖ: కోర్టు తీర్పుతో ఆనందంగా ఉందని డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరి బాయ్‌ చెప్పారు. సీబీఐ కూడా తమకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని పేర్కొన్నారు.  నిన్న సాయంకాలం వరకు ప్రభుత్వం నుంచి తనపై ఒత్తిడి తెచ్చిందన్నారు. సీబీఐ విచారణలో ఇంకా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయని, మానసిక వైద్యశాల నుంచి సుధాకర్‌ని డిశ్చార్జ్‌ చేసి.. మరో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం సేవలు అందిస్తామని చెప్పారు. మానసిక వైద్యశాలలో పెట్టి పూర్తిగా పిచ్చివాడిగా చూపించాలనే ప్రయత్నం చేశారని, తన బిడ్డకు చేసిన అన్యాయం ఒక్కొక్కటి బయటకు వస్తుందని కావేరి బాయ్‌ తెలిపారు. 


డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. డాక్టర్ సుధాకర్ తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్ప‌స్ పిటిషన్‌పై  శుక్రవారం హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. డాక్టర్ సుధాకర్ డిశ్చార్జ్‌కు ధర్మాసనం సమ్మతించింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేసి ఎప్పుడైనా డిశ్చార్జ్‌ కావొచ్చని కోర్టు తెలిపింది. సీబీఐ విచారణకు సహకరించాల్సిందిగా సుధాకర్‌కు హైకోర్టు సూచించింది. అలాగే  డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిపై వేసిన పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం మరో తీర్పును వెల్లడించింది. డాక్టర్‌ సుధాకర్‌ను బంధువులకు అప్పగించాలని ఆదేశించింది.

 

డాక్టర్‌ సుధాకర్‌ను కోర్టు ఎదుట హాజరుపరచాలని అభ్యర్థిస్తూ ఆయన తల్లి కావేరీ బాయి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అత్యవసరంగా విచారించాలంటూ గురువారం సాయంత్రం హెబియస్‌ కార్పస్‌ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన బిడ్డను చూపించాలని కావేరీ బాయి కోర్టును అభ్యర్ధించారు. 





Updated Date - 2020-06-05T21:01:21+05:30 IST