భూములు అమ్ముకోవచ్చు

ABN , First Publish Date - 2022-02-18T08:35:42+05:30 IST

ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం ఊరట లభించింది. ప్రభుత్వం తాను యజమానిగా ఉన్న భూములను..

భూములు అమ్ముకోవచ్చు

  • ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
  • విజయశాంతి పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూముల అమ్మకానికి సంబంధించి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి గురువారం ఊరట లభించింది. ప్రభుత్వం తాను యజమానిగా ఉన్న భూములను విక్రయించరాదని ఏ చట్టంలోనూ లేదని హైకోర్టు పేర్కొంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌ గ్రామంలోని ప్రభుత్వ భూముల ఈ-వేలంను అడ్డుకోవాలని కోరుతూ బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు కొట్టివేసింది. ఈ భూములను విక్రయించేందుకు అనుమతిస్తూ గత ఏడాది జూన్‌లో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, గతంలో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయానికి వ్యతిరేకమని, ఈ భూముల విక్రయాలను అడ్డుకోవాలని కోరుతూ విజయశాంతి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గండిపేట మండలం కోకాపేటలో ప్రభుత్వ భూముల విక్రయానికి బిడ్లను ఆహ్వానిస్తూ హెచ్‌ఎండీఏ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సైతం కొట్టేయాలని కోరారు. గతంలో ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన హైకోర్టు ఖానామెట్‌ భూముల ఈ-వేలానికి అనుమతించింది. తదుపరి భూముల విక్రయాలు చేపట్టాలంటే  హైకోర్టు అనుమతి తీసుకోవాలని పేర్కొంది. తాజాగా  ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినందన్‌కుమార్‌ షావిలి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.  ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేయరాదని 2015లో జారీ అయిన జీవో 191కు ప్రస్తుత జీవో విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తాళ్లపల్లి రాజశేఖర్‌  తన వాదన వినిపించారు. ప్రజాసంక్షేమం  ప్రభుత్వ బాధ్యత అని, వ్యాపారం చేయడంకాదని వాదించారు. 


 ‘ఒమీమ్‌మానెక్‌ షా’ కేసులో ఇదే తరహా వివాదం తలెత్తినప్పుడు ప్రభుత్వం తన భూములు అమ్ముకోవచ్చని పేర్కొంటూ ఇదే హైకోర్టు సదరు కేసును కొట్టేసిందని  హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు తన వాదనలు వినిపించారు. ఆక్రమణలను అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న  ధర్మాసనం ప్రభుత్వం తాను యజమానిగా ఉన్న భూములను అమ్ముకోరాదని ఏ చట్టంలో ఉందో చెప్పాలని పిటిషనర్‌ను ప్రశ్నించింది. గత జీవోలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని పిటిషనర్‌ పేర్కొనగా, జీవోలు చట్టాలు కాదని స్పష్టంచేసింది. ప్రభుత్వ భూములు విక్రయించరాదని ఎలియనేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రూల్స్‌లోగానీ, ఇతర చట్టాల్లోగానీ లేదని తెలిపింది. భూముల విక్రయాల్లో ఏమైనా లోపాలు ఉంటే ప్రశ్నించవచ్చని పేర్కొంది.  ప్రజా అవసరాలకు ఉపయోగపడని భూమిని ప్రభుత్వం అమ్ముకోవచ్చని తెలిపింది. ఈ మేరకు విజయశాంతి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ తుది తీర్పు వెలువరించింది. 


Updated Date - 2022-02-18T08:35:42+05:30 IST