ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదు?

ABN , First Publish Date - 2020-09-25T09:46:19+05:30 IST

పారిశుద్ధ్య కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితంగా ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదని వ్యాఖ్యానించింది...

ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదు?

  • పారిశుద్ధ్య కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణపై హైకోర్టు ధర్మాసనం

హైదరాబాద్‌, సెప్టెంబరు24 (ఆంధ్రజ్యోతి): పారిశుద్ధ్య కార్మికుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన కేసులో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితంగా ఊడిగం చేయించుకోడానికి ఇదేమీ రాచరికం కాదని వ్యాఖ్యానించింది. సర్వీసు రూల్‌ 1994లోని సెక్షన్‌ 3 ప్రకారం దినసరి కూలీలుగా కొనసాగించరాదని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీలో పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా  ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న 98 మంది సిబ్బంది సర్వీసును క్రమబద్ధీకరించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాల్లో తప్పేముందని హైకోర్టు డివిజన్‌ ప్రశ్నించింది.  ఎంతోకాలంగా పనిచేస్తున్న వీరి సర్వీసులను వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద పరిష్కరించవచ్చని అభిప్రాయపడింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసంగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలు జారీచేసింది. తాత్కాలిక పోస్టులైతే దీర్ఘకాలంగా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించింది. జనాభా లెక్కల మాదిరిగా  కొద్దికాలం చేసి వదిలేసే పనులు కాదని, ప్రజల ఆరోగ్య రక్షణకోసం నిత్యం కొనసాగించాల్సినవేనని స్పష్టం చేసింది.


ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో జీహెచ్‌ఎంసీలో శానిటరీ సూపర్‌వైజర్స్‌, శానిటేషన్‌ వర్కర్స్‌, ఎంటమాలజీ ఫీల్డ్‌ వర్కర్స్‌, ఎంటమాలజీ సుపీరియర్‌ ఫీల్డ్‌ వర్కర్స్‌, సూపర్‌వైజర్స్‌, సుపీరియర్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌గా పనిచేస్తున్న జి.శ్రీనివాస చారి మరో 97 మంది కార్మికులు తమ సర్వీసునులను క్రమబద్ధీకరించాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన నాటినుంచి పిటిషనర్లకు కనీసటైం స్కేల్‌ వేతనాలు చెల్లించాలని, బకాయిలు లెక్కించి సెప్టెంబరు 15లోగా చెల్లించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి ఈ ఏడాది ఆగస్టులో తీర్పు వెలువరించారు. సింగిల్‌ జడ్జి తీర్పుపై జీహెచ్‌ఎంసీ డివిజన్‌ బెంచ్‌కు అప్పీలు చేసింది. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ తరపున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చేసిన వాదనలను బెంచ్‌ తప్పుట్టింది. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వారికి రెగ్యులర్‌ స్కేల్‌ చెల్లిస్తే సంస్థపై తీవ్ర ఆర్థికభారం పడుతుందన్నారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, గడువు ఇవ్వాలని నిరంజన్‌రెడ్డి కోరారు. దీంతో విచారణను ఈనెల 29కి వాయిదా వేసిన ధర్మాసనం... సర్వీసు నిబంధనలు సైతం కోర్టు ముందుంచాలని ఆదేశించింది. 


Updated Date - 2020-09-25T09:46:19+05:30 IST