Abn logo
Sep 28 2021 @ 02:59AM

ఏదో తప్పు జరుగుతోంది!

  • కొందరికే నోటీసులు ఇవ్వడం ఏమిటి?
  • అంబటి తదితరులపై దాఖలైన
  • అక్రమ గనుల వ్యాజ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు


అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అక్రమ మైనింగ్‌కు సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు, మరికొందరిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ విషయంలో ఏదో తప్పు జరుగుతోందని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ ఆరోపిస్తున్న వ్యక్తులకు కాకుండా వేరేవారికి నోటీసులు ఇవ్వడంపై అనుమానం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై మరోసారి పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను అక్టోబరు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూ్‌పకుమార్‌ గోస్వామి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం, కోటనెమలిపురి, కుబుదాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు పప్పుల శ్రీనివా్‌సరెడ్డి, నల్లగొర్ల రామయ్య గతేడాది హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నాగరఘు వాదనలు వినిపిస్తూ... ‘ఎమ్మెల్యే అంబటి రాంబాబు సహకారంతో ఆయన అనుచరులు అక్రమ మైనింగ్‌కి పాల్పడుతున్నారు.


దీనిపై పిటిషనర్లు అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఖనిజాన్ని తరలిస్తున్న వాహనాల నంబర్లతో సహా ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. పైగా పిటిషనర్లపైనే పోలీసులు కేసు నమోదు చేశారు’ అని చెప్పారు. ప్రభుత్వ న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎలాంటి అక్రమ మైనింగ్‌కి పాల్పడలేదన్నారు. పర్మిట్లు లేకుండా కొందరు ప్రైవేటు భూముల్లో అక్రమమైనింగ్‌కి పాల్పడుతున్నారని గుర్తించామన్నారు. పెనాల్టీ చెల్లించాలని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామన్నారు. నోటీసులు అందుకున్నవారి తరఫున న్యాయవాది రాజేశ్వరి వాదనలు వినిపిస్తూ.. వారికి అక్రమ మైనింగ్‌తో సంబంధం లేదన్నారు. పెనాల్టీ చెల్లించాలని అధికారులు తమకు అన్యాయంగా నోటీసులు ఇచ్చారన్నారు. తమని కూడా ప్రతివాదులుగా చేర్చుకోవాలని కోరారు.