హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ.. సీఎం సభకు తొలగిన అడ్డంకి

ABN , First Publish Date - 2021-04-13T19:56:15+05:30 IST

నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలగాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు.

హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణ.. సీఎం సభకు తొలగిన అడ్డంకి

హైదరాబాద్: నాగార్జునసాగర్‌లో సీఎం కేసీఆర్ సభకు న్యాయస్థానంలో అడ్డంకులు తొలగాయి. హౌస్ మోషన్ పిటిషన్ విచారణను హైకోర్టు చీఫ్ జస్టిస్ తిరస్కరించారు. దీంతో బుధవారం సీఎం కేసీఆర్ సభ యథావిథిగా కొనసాగనుంది. సభను రద్దుచేయాలని రైతులు సోమవారం వేసిన పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించగా... హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలు పట్టించుకోకుండా.. తమ భూముల్లో సభ నిర్వహిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే విచారణకు చీఫ్ జస్టిస్ అనుమతించలేదు. 


ఇదిలా ఉంటే, హాలియా మండలంలోని అనుమల గ్రామంలో ముఖ్యమంత్రి ఎన్నికల సభను నిలువరించాలని కోరుతూ దాఖలైన రెండు వ్యాజ్యాల్లోనూ జోక్యానికి హైకోర్టు సోమవారమే నిరాకరించింది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిర్వహణ నిబంధనలు (ఎస్ఓపీ) తూ.చ. తప్పకుండా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీహెచ్‌ సైదయ్య కూడా సోమవారం లంచ్‌ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్రీదేవి విచారణ చేపట్టారు. రాజకీయ పార్టీలు కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయన్న పిటిషనర్‌.. ఏ ఒక్క పార్టీనీ ప్రతివాదిగా చేర్చక పోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. ఉల్లంఘనలకు ఆధారాలు చూపించకుండా కోర్టునెలా ఆశ్రయిస్తారని ప్రశ్నించింది.

Updated Date - 2021-04-13T19:56:15+05:30 IST