ఆన్‌లైన్‌ టికెట్లకు హైకోర్టు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-07-02T08:50:33+05:30 IST

ఆన్‌లైన్‌ టికెట్లకు హైకోర్టు బ్రేక్‌

ఆన్‌లైన్‌ టికెట్లకు హైకోర్టు బ్రేక్‌

రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు కళ్లెం

నేటి నుంచి ఆన్‌లైన్‌లో జరగాల్సిన సినిమా టికెట్ల విక్రయాల నిలిపివేత

సవరణ చట్టం, జీవోల అమలు నిలిపివేత.. స్టే ఇవ్వకపోతే పిటిషనర్లకు నష్టం

థర్డ్‌ పార్టీతో ఒప్పందాలకు విఘాతం.. థియేటర్ల లైసెన్సూ రద్దయ్యే ప్రమాదం

రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు.. 27కి తదుపరి విచారణ వాయిదా


అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్లు విక్రయించే వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ దూకుడుకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. శనివారం నుంచి ప్రవేశపెట్టనున్న ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ విధానాన్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ చట్టంతో(యాక్ట్‌ 12/2021) పాటు తదనంతరం జారీ చేసిన జీవోల అమలును నిలుపుదల చేసింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకపోతే పిటిషనర్లకు తీవ్రనష్టం జరుగుతుందని అభిప్రాయపడింది. బుక్‌ మైషో, తదితర సంస్థలు థర్డ్‌ పార్టీలతో చేసుకున్న ఒప్పందాలకు ఇబ్బందులు కలుగుతాయని పేర్కొంది. జూలై 2లోగా ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్తవిధానంలోకి మారకపోతే మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ , సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యాజమాన్యాలు తమ లైసెన్స్‌లు కోల్పోయే ప్రమాదం ఉందని గుర్తు చేసింది. వ్యాజ్యాలపై తుదివిచారణ జరిపేవరకు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానాన్ని వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికిగానీ, ప్రేక్షకులకుగానీ ఎలాంటి నష్టం జరగదని పేర్కొంది. పాత విధానంలో వారు టికెట్లు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందని తెలిపింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయకపోతే పిటిషనర్లకు జరిగే నష్టాన్ని పూడ్చలేమని అభిప్రాయపడింది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న విధానాన్ని కొనసాగించడమే మంచిదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యాజ్యాలపై తుది విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ప్రభుత్వమే ఆన్‌లైన్‌ విధానంలో సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుకల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఏపీ సినిమా రెగ్యులేషన్‌ సవరణ చట్టం(యాక్ట్‌ 12/2021), సంబంధిత నిబంధనలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టికెట్ల విక్రయ ఫ్లాట్‌ఫామ్‌ను  ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ కార్పోరేషన్‌కి అప్పగిస్తూ గత ఏడాది డిసెంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 142ను విడుదలచేసింది. సవరణ చట్టంతో పాటు ఈ జీవోను బుక్‌ మైషో సంస్థ, మల్టీఫ్లెక్స్‌ అసోసియేషన్‌ , సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యాజమాన్యాలు హైకోర్టులో వేర్వేరుగా సవాల్‌ చేశాయి. ఈ వ్యాజ్యాలు పై ఇటీవల వాదనలు ముగియడంతో ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘బుక్‌ మైషో’ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.... ‘రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ చట్టం వల్ల ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయించే ప్రైవేటు సంస్థల వ్యాపారం ప్రమాదంలో పడుతుంది. ప్రభుత్వమే నేరుగా టికెట్లు విక్రయిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే మమ్మల్ని కూడా ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ రూపొందించే వెబ్‌సైట్‌ ద్వారానే టికెట్లు విక్రయించాలని కోరడం సరికాదు. ఒకవైపు పోటీదారుగా మాతోపాటు టికెట్లు విక్రయించేందుకు రెడీ అవుతూ, విక్రయించిన ప్రతి టికెట్‌ పై సర్వీస్‌ ట్యాక్స్‌ చెల్లించాలని నిబంధన పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరడంలో అర్థం లేదు’’ అని వాదించారు. మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాల తరఫున న్యాయవాది సీవీ మోహన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ.... ‘‘ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయించేందుకు మల్టీఫ్లెక్స్‌ యాజమాన్యాలు ఇప్పటికే సొంత వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. టికెట్ల విక్రయం విషయంలో జూలై 2లోగా ఒప్పందం చేసుకోవాలని మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఒప్పందానికి అంగీకరించకపోతే లైసెన్స్‌లు రద్దు చేస్తామని బెదిరిస్తోంది. శనివారం నుంచి అమలయ్యేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయండి. ఆలోపు ప్రధాన వ్యాజ్యాల పై విచారణ జరిపి ఒక నిర్ణయం తీసుకోండి’ అని కోరారు. సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ యాజమాన్యాల తరఫున న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.... ‘‘ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం పేరుతో ప్రభుత్వం నేరుగా వచ్చి మా బాక్సాఫీసులో కూర్చునే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ శివారు ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో ఆన్‌లైన్‌ విధానం ప్రవేశపెట్టాలని కోరడమంటే థియేటర్‌ యాజమాన్యాల స్వేచ్ఛని హరించడమే. ప్రభుత్వమే మా థియేటర్లకు వచ్చి టికెట్లు అమ్మితే మాకు ఇచ్చిన లైసెన్స్‌లకు అర్థం లేదు. ప్రభుత్వం టికెట్లు అమ్మకం ద్వారా వచ్చే సొమ్మును తమ ఖాతాలో వేసుకోని, ఆ తరువాత ఎప్పుడో చెల్లిస్తామంటోంది. దీని వల్ల యాజమాన్యాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. పాత విధానంలో టికెట్లు విక్రయించుకొనేందుకు అనుమతించాలి’’ అని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ... పారదర్శకత కోసమే కొత్త విధానం తీసుకొచ్చామన్నారు. భాగస్వాములందరితో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తరువాతే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ విధానం ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు. గత ఆరునెలలుగా ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి నూతనవ్యవస్థను సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల పిటిషనర్ల ప్రయోజనాలకు భంగం కలగదని శ్రీరామ్‌ తెలిపారు. 

Updated Date - 2022-07-02T08:50:33+05:30 IST