ప్రభుత్వాన్ని నడపాల్సింది వాళ్లా.. మేమా?

ABN , First Publish Date - 2020-09-19T09:27:37+05:30 IST

‘‘మేం రాజకీయాంశాలను నిర్ణయించేందుకు విచారణ జరపడంలేదు. వ్యాఖ్యలు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించండి. అలాంటి వ్యాఖ్యలు చేయరాదు’’ అని అదనపు అడ్వొకేట్‌

ప్రభుత్వాన్ని నడపాల్సింది వాళ్లా.. మేమా?

బెంచ్‌ ముందు అదనపు ఏజీ వ్యాఖ్యలు

హైకోర్టును ఉద్దేశించా అని జడ్జి ప్రశ్న

కోర్టును కాదని ఏఏజీ సమాధానం

స్వీయ నియంత్రణకు ధర్మాసనం సూచన

బిల్డ్‌ ఏపీపై మధ్యంతర ఉత్తర్వు పొడిగింపు

తదుపరి విచారణ 12కు వాయిదా


అమరావతి, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ‘‘మేం రాజకీయాంశాలను నిర్ణయించేందుకు విచారణ జరపడంలేదు. వ్యాఖ్యలు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ పాటించండి. అలాంటి  వ్యాఖ్యలు చేయరాదు’’ అని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌ రెడ్డికి  సూచించింది. పథకాల అమలుకోసం ప్రభుత్వ భూములను విక్రయించే ‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’పై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా  ఏఏజీ, ధర్మాసనం మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘బిల్డ్‌ ఏపీ’ పేరుతో ప్రభుత్వం భూములు విక్రయిస్తోందంటూ దాఖలైన తొమ్మిది పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ముందు మరోమారు విచారణ జరిగింది. 


తమకు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్లు అందలేదని కొందరు పిటిషనర్లు తెలిపారు. దీంతో వారికి అఫిడవిట్లు అందజేయాలని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డికి ధర్మాసనం సూచించింది. ‘పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవే కదా!’ అని ధర్మాసనం అడగ్గా.. ఏఏజీ స్పందిస్తూ.. ‘అన్నిటిదీ ఒకే ఒక్క ఇష్ష్యూ. ఎవరు ప్రభుత్వాన్ని నడపాలి అనేదే ఇక్కడ ఇష్ష్యూ. వాళ్లు నడపాలా? మేము నడపాలా అనేదే ఇష్ష్యూ’’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారనే సందేహం ధర్మాసనానికి వచ్చింది. జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ జోక్యం చేసుకుని... ‘ప్రభుత్వమా? లేక హైకోర్టా అన్నది తెలియజేయాలనుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు. ఇందుకు ఏఏజీ బదులిస్తూ.. ‘‘లేదు, లేదు హైకోర్టు గురించి కాదు.


వారు ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారు. ఇతరుల భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు. నిజానికి వారు కూడా ప్రభుత్వాన్ని నడుపుతున్నా రు’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... గతంలో అనేక పరిశ్రమలను తెగనమ్మినా ఎవ్వరూ మాట్లాడలేదని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయలేదని తెలిపారు. ఈ వ్యాజ్యాల్లో ప్రజాహితమే లేదన్నారు. ఈ వ్యాఖ్యలపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘అసలు విషయం నుంచి పక్కకు పోవద్దు.  ఇతర విషయాలు మాకెందుకు చెబుతున్నారు? అవి మా వద్ద విచారణలో లేవు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన నర్రా శ్రీనివాసరావు వాదిస్తూ, తహసీల్దార్‌ కార్యాలయాలను, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని వివరించారు.


దీనిపై ఏఏజీ స్పందిస్తూ.. ‘మీరే ప్రభుత్వాన్ని నడపండి’ అని వ్యాఖ్యానించడంతో ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజకీయాంశాన్ని నిర్ణయించేందుకు విచారణ జరపడం లేదని, వ్యాఖ్యలు చేసేటప్పుడు స్వీయనియంత్రణ పాటించాలని సూచించింది. అలాంటి వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. కౌంటర్లు అందలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు చెబుతున్నందున ఆ పత్రాలు వారికి అందజేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లపై తిరుగు సమాధానం ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. అదేవిధంగా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2020-09-19T09:27:37+05:30 IST