వడ్డీతో ఇద్దామా? సుప్రీంకి వెళ్దామా?

ABN , First Publish Date - 2020-09-19T09:01:18+05:30 IST

వడ్డీతో ఇద్దామా? సుప్రీంకి వెళ్దామా?

వడ్డీతో ఇద్దామా? సుప్రీంకి వెళ్దామా?

వేతన బకాయిలపై ఆర్థిక శాఖ తర్జనభర్జన

అక్టోబరు 11లోగా 12% వడ్డీతో ఇవ్వాలన్న హైకోర్టు


అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రభు త్వ ఉద్యోగులు, పింఛనుదారులకు బకాయిపడిన వేతనాలు, పింఛన్లను హైకోర్టు ఆదేశాల మేరకు వడ్డీతో ఇవ్వాలా.. వద్దా.. అనే అంశంపై ఆర్థిక శాఖ తర్జనభర్జన పడుతోంది. ఏదైనా అవకాశం ఉంటే వడ్డీ ఇవ్వకుండా కేవలం బకాయిపడిన వేతనాలు, పింఛన్లనే ఇవ్వాలని భావిస్తోంది. ఈ మేరకు వడ్డీ చెల్లింపు అంశంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ ద్వారా సవాల్‌ చేయాలని ఆర్థిక శాఖ అధికారులు ఆలోచిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో ఊరట లభిస్తే వడ్డీ ఇవ్వకుండా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయనిపుణుల సలహా తీసుకున్నట్టు సమాచారం. లాక్‌డౌన్‌ సమయంలో రెండు నెలలపాటు ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ప్రభుత్వం సగం వేతనాలు, పెన్షన్లు మాత్రమే చెల్లించింది.


దీనిపై కొందరు ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా అక్టోబరు 11లోగా 12ు వడ్డీతో ఉద్యోగులకు వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వేతన బకాయిల చెల్లింపునకు గడువు దగ్గరపడుతుండడంతో నిధుల కోసం ఆర్థిక శాఖ అప్పుల వేట సాగిస్తోంది. అయితే, సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అడ్వొకేట్‌ ఫీజులు, అధికారుల ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతాయి. కాగా, 2 నెలల బకాయిలు కలిపి ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. 

Updated Date - 2020-09-19T09:01:18+05:30 IST