విద్యార్థి సమాఖ్య పిటిషన్‌పై విచారణ పునఃప్రారంభం

ABN , First Publish Date - 2020-08-12T09:38:27+05:30 IST

హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ బీసీ,

విద్యార్థి సమాఖ్య పిటిషన్‌పై విచారణ పునఃప్రారంభం

  • హైకోర్టు అంగీకారం
  • న్యాయాధికారి రామకృష్ణ అభ్యర్థనకు ఓకే
  • ప్రతివాదిగా చేరికపై నిర్ణయం రేపటికి వాయిదా

అమరావతి, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించాలని, ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజశేఖర్‌ మృతిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై విచారణను పునఃప్రారంభించేందుకు (రీ-ఓపెన్‌) హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సస్పెన్షన్‌లో ఉన్న న్యాయాధికారి ఎస్‌.రామకృష్ణ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతిస్తూ జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థి సమాఖ్య దాఖలు చేసిన పిల్‌లోని అంశాలు, అంతకుముందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ ఆలిండియా బీసీ ఫెడరేషన్‌ రాష్ట్రపతికి చేసిన ఫిర్యాదులోని అంశాలు ఒకటిగానే ఉన్నాయని, సదరు బీసీ ఫెడరేషన్‌ లెటర్‌హెడ్‌ ప్రకారం..


ఆ సంస్థకు రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ-పర్యవేక్షణ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య అధ్యక్షుడిగా ఉన్నారని.. ఆ రెండు సంఘాలు, సభ్యులకు, ఆయనకు మధ్య సంబంధాన్ని తోసిపుచ్చలేమని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అపఖ్యాతి పాల్జేసేలా ఉన్న ఆ పిటిషన్‌ను కొట్టివేయాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత జూలై 31న ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణకు స్వీకరించడంపై తీర్పును రిజర్వు చేసింది. ఈ నేపథ్యంలో పిల్‌పై విచారణను పునఃప్రారంభించాలని, తన వాదనలు వినిపించేందుకు తనను ప్రతివాదిగా చేర్చుకోవాలని అభ్యర్థిస్తూ రామకృష్ణ ఈ నెల 4న రెండు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం అన్ని పక్షాల వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ పిల్‌ను రీ-ఓపెన్‌ చేసేందుకు అనుమతిస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. అయితే కొన్ని అంశాలపై అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిపై కౌంటర్‌ దాఖలు చేస్తామని సోమవారం కోరినందున ధర్మాసనం అవకాశం ఇచ్చింది. దాఖలు చేయాలని ఆదేశించింది. రామకృష్ణను ప్రతివాదిగా చేర్చుకునే విషయంలో నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది.’

Updated Date - 2020-08-12T09:38:27+05:30 IST