‘పరిషత్‌’ వ్యాజ్యాలపై విచారణ 19కి వాయిదా

ABN , First Publish Date - 2021-04-16T10:08:22+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

‘పరిషత్‌’ వ్యాజ్యాలపై విచారణ 19కి వాయిదా

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గురువారం విచారణ సందర్భంగా ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేశామన్నారు. న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు స్పందిస్తూ.. ధర్మాసనం ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలన నిమిత్తం తన ముందు ఉంచాలని ఆదేశించారు. మరోవైపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రిను మొదటి నుంచి ప్రారంభించాలని..


ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జనసేన పార్టీ కార్యదర్శి చిల్లపల్లి శ్రీనివాసరావు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ఎస్‌ఈసీని ఆదేశించారు. ఇదే అంశంపై బీజేపీ నేత పాతూరి నాగభూషణం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రస్తుత పిటిషన్లతో జత చేయాలని రిజిస్ట్రీకి సూచించారు. ఎస్‌ఈసీ దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌ రికార్డుల్లో లేదని గుర్తించిన న్యాయమూర్తి.. సంబంధిత దస్త్రాలను రికార్డులకు జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇరుపక్షాల న్యాయవాదుల అంగీకారం మేరకు విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


లెక్కింపు, ఫలితాలకు అనుమతివ్వండి: ఎస్‌ఈసీ

కరోనా రెండో దశ విస్తృతంగా వ్యాపిస్తోందని.. అధికార యంత్రాంగం కరోనా కట్టడి, టీకా విషయంలో పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఎస్‌ఈసీ తన కౌంటర్‌లో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగే కొద్దీ ఖజానాపై అదనపు భారం పడుతుందని తెలిపింది. ‘ధర్మాసనం అనుమతితో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాం. బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచాం. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనకు అనుమతి ఇవ్వండి.


కోఆప్టెడ్‌ సభ్యులు, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలను పూర్తిచేస్తాం. అప్పుడే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. గ్రామపంచాయతీలు, పురపాలిక ఎన్నికల కొనసాగింపులో భాగంగానే పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాం. ఇవన్నీ ఉమ్మడి ఎన్నికలు. పరిషత్‌ పోలింగ్‌కు నాలుగు వారాల ముందు కోడ్‌ విధించాల్సిన అవసరం లేదు. కోడ్‌ అమలుపై విచక్షణాధికారం ఎస్‌ఈసీదే. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయండి’ అని కోరింది.’

Updated Date - 2021-04-16T10:08:22+05:30 IST