‘వకీల్‌ సాబ్‌‘కు ప్రభుత్వ ధరే

ABN , First Publish Date - 2021-04-11T09:14:09+05:30 IST

వకీల్‌ సాబ్‌ సినిమాకు మూడు రోజులపాటు (9వ తేదీ నుంచి 11 వరకు) ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ సింగిల్‌ జడ్జి

‘వకీల్‌ సాబ్‌‘కు ప్రభుత్వ ధరే

నేటి నుంచి అమలు చేయండి: హైకోర్టు

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులకు పాక్షిక సవరణ


అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): వకీల్‌ సాబ్‌ సినిమాకు మూడు రోజులపాటు (9వ తేదీ నుంచి 11 వరకు) ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతి ఇస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సవరించింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఈ నెల 10వ తేదీ వరకు వర్తిస్తాయని... 11వ తేదీ ఆదివారం నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని థియేటర్‌ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎం.గంగారావుతో కూడిన ధర్మాసనం శనివారం ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న జారీ చేసిన జీవో 35ను సవాల్‌ చేస్తూ థియేటర్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.


ఆ వ్యాజ్యాలను అత్యవసరంగా విచారించిన సింగిల్‌ జడ్జి ఈ నెల 9,10,11 తేదీల్లో ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించుకునేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై శనివారం ధర్మాసనం హౌజ్‌మోషన్‌ రూపంలో విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) వాదనలు వినిపిస్తూ టికెట్ల ధరలు నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేశాక... ఎగ్జిబిటర్లు నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించేందుకు అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. ప్రభుత్వం జీవో జారీ చేసే నాటికి జరిగిన టికెట్ల అమ్మకాల (అడ్వాన్స్‌ బుకింగ్‌) వివరాలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించలేదన్నారు.


థియేటర్‌ యాజమాన్యాల తరఫున న్యాయవాది కె.దుర్గాప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు చాలా తక్కువుగా ఉన్నాయన్నారు. కరోనా ప్రభావంతో థియేటర్‌ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న థియేటర్లకు ఒకే రకంగా పన్నులు వసూలు చేస్తూ...టికెట్ల ధరల నిర్ణయం విషయంలో వ్యత్యాసం చూపించారన్నారు. సింగిల్‌ జడ్జి ఆదేశాలు ఆదివారంతో ముగుస్తాయని తెలిపారు. ఆ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం... సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను శనివారం వరకే పరిమితం చేస్తూ ఆదేశాలిచ్చింది. నేటి నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు టికెట్లు విక్రయించాలని థియేటర్‌ యాజమాన్యాలకు స్పష్టం చేసింది. ఈ నెల 10 వరకు జరిగిన అడ్వాన్స్‌ బుకింగ్‌ విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు తేల్చి చెప్పింది.

Updated Date - 2021-04-11T09:14:09+05:30 IST