న్యూఢిల్లీ: సోమాలియాలోని ఓ పరిశ్రమలో బందీలుగా ఉన్న 33 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి రప్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. నైరోబిలోని భారత హైకమిషన్ అక్కడి అధికారులో సంప్రదింపులు జరుపుతోందని వివరించారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ విజృంభణకు ముందు ఉత్తరప్రదేశ్‌కు చెందిన 25 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన మరో 8 మంది ఉపాధి కోసం సోమాలియా వెళ్లారు. అక్కడ ఓ పరిశ్రమలో వారికి పని దొరికింది. పనిలో చేరిన తొలినాళ్లలో యజమానులు వారిని బాగానే చూసుకున్నారు. జీతభత్యాలను క్రమం తప్పకుండా చెల్లించారు. అయితే గత ఎనిమిది నెలలుగా వారికి జీతాలు చెల్లించకుండా పని చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో వాళ్లు తమ సమస్యను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం.. వారి సమస్యను పరిష్కరించి, స్వదేశానికి తరలించడం కోసం చర్యలు తీసుకోవాలని సోమాలియాలోని ఇండియన్ హైకమిషన్‌ను అదేశించింది. అంతేకాకుండా భారత్‌లో ఉన్న సోమాలియా ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ట్విట్టర్లో వెల్లడించారు.