హై అలర్ట్‌!

ABN , First Publish Date - 2021-12-08T05:52:21+05:30 IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేలాది మంది విదేశాల్లో ఉన్నారు. దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా, సౌదీ అరేబి యా, బ్రెజిల్‌, సౌతాఫ్రికా తదితర దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు అధికం. టూరిస్ట్‌ విసాలపై వెళ్లే వారు ఏడాదికి ఒకసారి స్వగ్రామాలకు వస్తుంటారు. ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో అటువంటి వారిపై జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టింది.

హై అలర్ట్‌!




 జిల్లా యంత్రాంగం అప్రమత్తం

 విదేశాల నుంచి వస్తున్న వారిపై దృష్టి

 హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచి రెండుసార్లు నిర్థారణ పరీక్షలు

 పాజిటివ్‌ అని తేలితే హైదరాబాద్‌ ల్యాబ్‌కు తరలింపు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, డిసెంబరు 7 : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమైక్రాన్‌’పై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాకు చెందిన ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వేలాది మంది విదేశాల్లో ఉన్నారు. దుబాయ్‌, సింగపూర్‌, మలేషియా, సౌదీ అరేబి యా, బ్రెజిల్‌, సౌతాఫ్రికా తదితర దేశాల్లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న వారు అధికం. టూరిస్ట్‌ విసాలపై వెళ్లే వారు ఏడాదికి ఒకసారి స్వగ్రామాలకు వస్తుంటారు. ‘ఒమైక్రాన్‌’ వ్యాప్తి నేపథ్యంలో అటువంటి వారిపై జిల్లా యంత్రాంగం దృష్టిపెట్టింది. నవంబరు 15 నుంచి డిసెంబరు 7 మధ్య విదేశాల నుంచి జిల్లాకు 400 మంది వచ్చినట్టు గుర్తించింది. వీరంతా కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్ట్‌తోనే స్వగ్రామాల్లో అడుగు పెడుతున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కట్టడి చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా వీరిని రెండు వారాల పాటు హోం ఐసోలేషన్‌లో పెడుతున్నారు. వారం రోజుల వ్యవధిలో ఒకసారి నిర్థారణ పరీక్షలు చేస్తున్నారు. నెగిటివ్‌ అని వచ్చినా మరో వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేలా కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. వారితో పాటు కుటుంబసభ్యులకు కూడా రెండుసార్లు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఒకవేళ విదేశాల నుంచి వచ్చిన వారికి రెండుసార్లూ పాజిటివ్‌ అని తేలితే మాత్రం తుది నిర్థారణ కోసం నమూనాలను హైదరాబాద్‌లోని సెంట్రల్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యులర్‌ బయాలజీ ల్యాబ్‌కు పంపుతున్నారు.  అక్కడ ‘జీనోమ్‌ సీక్వెన్సీ’ పరీక్ష నిర్వహించాక... అందులో కోవిడ్‌ స్ట్రయిన్‌ ఉన్నదీ లేనిదీ నిర్ధారించి ఫలితాలు వెల్లడిస్తున్నారు. దీనిపై డీఎంహెచ్‌వో జగన్నాథరావు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ ప్రజలు వదంతులను నమ్మవద్దన్నారు. సంతబొమ్మాళి మండలానికి చెందిన వ్యక్తికి కొవిడ్‌ నిర్థారణ అయ్యిందన్నారు. ఒమైక్రాన్‌ కాదన్నారు. నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని జీనోమ్‌ సీక్వెన్సీ టెస్ట్‌ కోసం పంపించినట్టు తెలిపారు. అక్కడే నిర్థారణ అవుతుందని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని జేసీ శ్రీనివాసులు ఒక ప్రకటనలో కోరారు. దీనిపై ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


Updated Date - 2021-12-08T05:52:21+05:30 IST