అటకెక్కిన చేప పిల్లల ఉత్పత్తి

ABN , First Publish Date - 2022-05-20T05:58:30+05:30 IST

జిల్లా కేంద్రం పాడేరులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. సుమారు రెండు దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రాన్ని రూ.76 లక్షలతో తిరిగి వినియోగంలోకి తేవడానికి నాలుగేళ్ల క్రితం అప్పటి ఐటీడీఏ పీవో డీకే.బాలాజీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అటకెక్కిన చేప పిల్లల ఉత్పత్తి
చేప పిల్లల పెంపకం కోసం అప్పట్లో నిర్మించిన ట్యాంకులు

పాడేరులో 20 ఏళ్ల నుంచి నిరుపయోగంగా పడిఉన్న కేంద్రం

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

గొందూరు కాలనీలో 1989లో ఐటీడీఏ,మత్స్య శాఖ సంయుక్తంగా ఏర్పాటు

ఏటా 50-75 వేల వరకు చేప పిల్లలు ఉత్పత్తి

జోలాపుట్టు, తాజంగి రిజర్వాయర్లు, మత్స్యగెడ్డ పాయల్లో విడుదల

చేపల వేటతో మత్స్యకార గిరిజనులు జీవనం

క్రమేపీ కేంద్రం నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు

పదేళ్లకే పడకేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం

తిరిగి వినియోగంలోకి తేవడానికి నాలుగేళ్ల క్రితం ఐటీడీఏ పీవో చర్యలు

రూ.76 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

నిధులు మంజూరుకాకపోవడంతో ఫలించని ప్రయత్నాలు


(పాడేరు- ఆంధ్రజ్యోతి) 

జిల్లా కేంద్రం పాడేరులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. సుమారు రెండు దశాబ్దాల నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ కేంద్రాన్ని రూ.76 లక్షలతో తిరిగి వినియోగంలోకి తేవడానికి నాలుగేళ్ల క్రితం అప్పటి ఐటీడీఏ పీవో డీకే.బాలాజీ  చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని మత్స్యగెడ్డ పాయలపై జోలాపుట్టు జలాశయాన్ని నిర్మించడంతో ముంచంగిపుట్టు, పెదబయలు మండలాలకు చెందిన పలు గ్రామాల గిరిజనులు నిరాశ్రయులయ్యారు. వీరిలో కొంతమందికి ఇవే మండలాల్లో పునరావాసం కల్పించగా, మరికొంతమందికి చింతపల్లి మండలం తాజంగి, లంబసింగి ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చింది. జోలాపుట్టు జలాశయం నిర్మించకముందు వీరంతా స్థానికంగా వున్న భూములను సాగుచేసుకుంటూ జీవనోపాధి పొందేవారు. పంట పొలాలు రిజర్వాయర్‌లో కలిసిపోవడం, కొత్తగా పునరావాసం కల్పించి ప్రదేశంలో ప్రభుత్వం వ్యవసాయ భూములు ఇవ్వకపోవడంతో జోలాపుట్టు, తాజంగి రిజర్వాయర్లలో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఇంకా మత్స్యగెడ్డ ప్రవాహం ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, డుంబ్రిగుడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన పలువురు గిరిజనులు కూడా చేపల వేటను వృత్తిగా మలచుకున్నారు. దీంతో మత్స్యకారులుగా జీవనం సాగిస్తున్న గిరిజనులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  1989లో పాడేరులోని గొందూరు కాలనీలో ఐటీడీఏ, మత్స్య శాఖ అధికారులు కలిసి చేపల పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నీటి కోసం బావి తవ్వించి, మూడు మోటారు బగించి, వాటికి షెడ్లు (పంప్‌హౌస్‌) ఏర్పాటు చేశారు. చేప పిల్లలను పెంచేందుకు 20 వరకు ట్యాంకులు నిర్మించారు. ఏటా 50 వేల నుంచి 75 వేల వరకు ఇక్కడ చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. మత్స్యశాఖ అధికారులు వీటిని ఆయా జలాశయాలు, మత్స్యగెడ్డ పాయల్లో వదిలేందుకు మత్స్యకార గిరిజనులకు ఉచితంగా పంపిణీ చేసేశారు. సుమారు పదేళ్ల వరకు చేప పిల్లల ఉత్పత్తి, పంపిణీ సవ్యంగానే జరిగింది. అనంతరం ఐటీడీఏ అధికారులు పట్టించుకోకపోవడంతో చేప పిల్లల ఉత్పత్తి నిలిచిపోయింది. 1999 నుంచి ఈ కేంద్రం నిరుపయోగంగా పడింది. తరువాత మోటార్లు, పైపులు చోరీకి గురయ్యాయి.  

ఫలించని ఐటీడీపీ పీవో ప్రయత్నాలు

పాడేరులోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు నాలుగేళ్ల కిత్రం అప్పటి ఐటీడీఏ పీవో డీకే.బాలాజీ ప్రయత్నించారు. మత్స్యశాఖ అఽధికారులతో చర్చించి,  దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు రూ.76 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైనందున జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గిరిజన మత్స్యకారులు కోరుతున్నారు.



Updated Date - 2022-05-20T05:58:30+05:30 IST