హే.. రామచంద్రా!

ABN , First Publish Date - 2022-08-07T05:05:38+05:30 IST

సుమారు 502.67 ఎకరాల భూములున్న దేవుడు.. నిత్య నైవేద్యానికి నోచుకోని దీనుడు... ఆనాడు అందరివాడుగా పూజలందుకున్న శ్రీరామచంద్రుడు నేడు ఎవరికీ కానివాడై పోయాడు.. చారిత్రక ప్రసిద్ధి గాంచిన గుళ్లసీతారాంపురం సీతారామచంద్రుడి దుస్థితి ఇది.

హే.. రామచంద్రా!
సీతారామస్వామి ఆలయ భూముల్ని పరిశీలిస్తున్న ఏసీ అన్నపూర్ణ (ఫైల్‌)

సీతారామస్వామి మాన్యం అన్యాక్రాంతం
ఒకప్పుడు 502.67 ఎకరాల భూములు
వీటిలో చాలావరకు రికార్డులు మాయం
అప్పుడప్పుడు మొక్కుబడి పరిశీలనలు
రెవెన్యూ, దేవదాయశాఖల నిర్లక్ష్యం


రాజాం రూరల్‌, ఆగస్టు 6: సుమారు 502.67 ఎకరాల భూములున్న దేవుడు.. నిత్య నైవేద్యానికి నోచుకోని దీనుడు... ఆనాడు అందరివాడుగా పూజలందుకున్న శ్రీరామచంద్రుడు నేడు ఎవరికీ కానివాడై పోయాడు.. చారిత్రక ప్రసిద్ధి గాంచిన గుళ్లసీతారాంపురం సీతారామచంద్రుడి దుస్థితి ఇది. రాజాం మునిసిపాలిటీ పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే భూమలున్న డోలపేట ఉమామహేశ్వర లక్ష్మినారాయణ స్వామిదీ ఇదే పరిస్థితి. దేవదా యశాఖ పరిధిలో ఉన్న ఈ రెండు ఆలయాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో భూముల పరిస్థితిని పరిశీలించి వాటిని పరిరక్షించేందుకు అధికారులు ప్రయత్నించకపోవడం ఆక్రమణదారుల పాలిట వరంగా మారుతోంది.
సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురంలోని సీతారామస్వామి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. రాజుల కాలం నాటి ఆలయంగా పేరొందింది. ముఖ్యమైన రోజుల్లో భక్తులు స్వామిని విశేషంగా దర్శిస్తుంటారు. బొబ్బిలి రాజులు 16వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించి 502.67 ఎకరాల భూములను ఆలయానికి సమకూర్చినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో చాలా భూములు రికార్డులు మారిపోయాయి. ఆక్రమణదారుల అడ్డాలో కలిసిపోయాయి. కాగా ఆలయానికి వంగర మండలంలో ఉండే 143.71 ఎకరాల భూమి మడ్డువలస ప్రాజెక్టు నిర్మాణం సమయంలో మునిగిపోయింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో 60 శాతం రైతులకు, 40 శాతం ఆలయానికి పంచారు. అలా సమకూరిన రూ.16 లక్షలను బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. ఆ మొత్తంపై వచ్చిన ఆదాయంతోనే సీతారామస్వామి ఆలయ నిర్వహణ చూస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 358.96 ఎకరాల భూమిలో రాజాంలో 8.04 ఎకరాలు, రాజాం మున్సిపాలిటీ పరిధిలోని సారధిలో 12.62 ఎకరాలు, రేగిడి మండలం ఖండ్యాంలో 28.49 ఎకరాలు, సంతకవిటి మండలం బొద్దూరులో 28.07 ఎకరాలు, గుళ్లసీతారాంపురంలో 6.83 ఎకరాలు, మాధవరాయపురంలో 21.40 ఎకరాలు, వాసుదేవపట్నంలో 3.42 ఎకరాలు, శంకరుణి అగ్రహారంలో 0.26 సెంట్లు, బూర్జ. మండం చినలంకాలంలో 39.19 ఎకరాలు, పాలకొండ మండలం పద్మాపురంలో 2.65 ఎకరాలు, వాటపాగులో 57.72 ఎకరాలు, గార మండలం శ్రీకూర్మంలో 150.53 ఎకరాలను బొబ్బిలి రాజులు ఇచ్చినట్లు రికార్డుల్లో నమోదై ఉంది.

అన్యాక్రాంతమే ఎక్కువ
ప్రస్తుతం గుళ్ల సీతారాంపురంలోని 9.1, 5.1 సర్వే నెంబర్లలో 6.83 ఎకరాలు మాత్రమే ఆలయం పేరుతో ఉంది.
 బొద్దూరులోని 28.07 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఆలయం పేరు లేదని సమాచారం. మరికొన్ని భూములకు సంబంధించి రైతులు, దేవదాయశాఖ మధ్య వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది.
 వాసుదేవపట్నంలో సర్వే నెంబర్‌ 166, 390లో 3.42 ఎకరాలు తొమ్మిది సబ్‌ డివిజన్లలో 12 మంది రైతుల పేరున ఉంది. శంకరుణి అగ్రహారంలో సర్వే నెంబర్‌ 53.4లో 0.26 సెంట్లు భూమి ఒక రైతు పేరున ఉంది.

ఇదొక్కటే ఆదాయం
బూర్జ మండలం చినలంకాంలో సర్వే నెంబర్‌ 59, 60, 62, 104, 111, 113లలో ఉన్న 39.19 ఎకరాల భూమి నుంచి మాత్రమే ఆలయానికి (రైతుల నుంచి) ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


లక్ష్మినారాయణుడిదీ ఇదే దుస్థితి
డోలపేటలోని ఉమామహేశ్వర లక్ష్మి నారాయణస్వామి ఆలయ భూములు సైతం ఆక్రమణదారుల గుప్టెట్లో ఉన్నాయి. ఈ ఆలయానికి చెందిన 20 ఎకరాలను దేవదాయశాఖ నుంచి ఆర్టీసీ గతంలో సేకరించింది. అయితే డిపో నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో దేవదాయశాఖ తిరిగి స్వాధీనం చేసుకుంది. హీనపక్షంగా రూ.150 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని పరిరక్షించే చర్యలు శూన్యమనే చెప్పాలి. ఈ భూమిని ఆనుకుని ఉన్న స్థలం ఆక్రమణదారుల గుప్టెట ఉంది. కేర్‌ హాస్పిటల్‌ సమీపంలో సర్వే నెంబర్‌ 94లో కోట్ల విలువ చేసే స్థలం సైతం రైతుల ఆక్రమణలో ఉంది. ఈ భూములు తమవేనంటూ ఆ ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు సైతం నిర్మించారు. ఇదే ఆలయానికి చెందిన చెరువుపై రెవెన్యూశాఖ ఇళ్లపట్టాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.


వెంకన్న భూములూ ఆక్రమణలోనే..

రాజాం పట్టణంలోని వేంకటేశ్వర దేవాలయాన్ని ఆనుకుని ఉన్న సర్వే నెంబర్‌ 112 సబ్‌ డివిజన్‌ 1, 2లో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే 1.20 ఎకరాల స్థలం ఉంది. ఆ భూమి పరిరక్షణకు దేవదాయశాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఫలితంగా ఈ స్థలంలో కొంత భాగాన్ని ఓ ఆక్రమణదారుడు ప్లాట్లుగా విభజించి అమ్మేశాడు. రిజిస్ట్రేషన్‌ సమయంలో దేవదాయ భూములుగా తేలడంతో తీసుకున్న అడ్వాన్స్‌ తిరిగి చెల్లించాల్సి వచ్చింది.

అందరినోటా ఒకటే పాట
దేవదాయశాఖ అధికారులంతా ఒకటే పాట పాడుతున్నారు. ఆలయ భూముల్ని పరిరక్షిస్తాం.. ఆక్రమిత స్థలాలు వద్ద బోర్డులు పెడతాం.. అని ప్రకటించడం.. ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయింది. తమకెందుకులే అన్న ధోరణి శాఖాధికారుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ అన్నపూర్ణ (శ్రీకాకుళం) భూముల్ని ఏడాది క్రితం పరిశీలించినప్పటికీ చర్యల్లేవు.

ఆలయ భూముల్ని పరిరక్షిస్తాం

దేవదాయశాఖ భూముల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. రాజాం పట్టణంలో ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. కొంతమంది ఆక్రమణదారులకు నోటీసులిస్తున్నాం. కేసులు కూడా నమోదు చేస్తున్నాం. కొన్నిచోట్ల రైతులు, ఆక్రమణదారులు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఏదేమైనా ఆక్రమణదారులైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
        - బలివాడ మాధవరావు, ఈవో, సీతారంపురం దేవస్థానం


Updated Date - 2022-08-07T05:05:38+05:30 IST