Abn logo
Sep 17 2020 @ 00:44AM

నాయకులే నిర్మాతలు!

కథానాయకుడు... కథను ముందుండి నడిపించేవాడు!

వెండితెరపై కనిపించేవాడు.. సందడి చేసేవాడు!

వెండితెరపై కనిపించని కథానాయకుడు? నిర్మాతే!

రోడ్డు మీద బండి కదలాలంటే పెట్రోల్‌ కావాలి.

సెట్‌లో షూటింగ్‌ జరగాలంటే నిర్మాత డబ్బు ఖర్చు పెట్టాలి. 

డబ్బే కదా? అనుకోవడానికి లేదు.. ఆ ఖర్చులో కష్టం ఉంటుంది!

అయినా సరే అంటూ కొందరు కథానాయకులు ఆ కష్టాన్ని మోయడానికి ముందుకొస్తున్నారు!

నవతరం నాయకులే నిర్మాతలు కావడం నయా ట్రెండ్‌!

కథానాయకులు నిర్మాతలు కావడమనేది పూర్వం నుంచి ఉన్నదే! ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కాంతారావు,  కృష్ణ, మోహన్‌బాబు నిర్మాతలుగా మారి సొంత చిత్రాలు అనేకం తీశారు. తర్వాతి తరంలో బాలకృష్ణ, నాగార్జున, మహేశ్‌బాబు నిర్మాతలుగా మారారు. అయితే... గతంలో కథానాయకులు అప్పుడప్పుడు సినిమాలు తీసేవారు.  మరి, ఇప్పుడు? వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. నిర్మాతలుగా మారుతున్న కథానాయకులందరినీ ఒకే గాటన కట్టలేం! వివిధ వర్గాలుగా విభజించవచ్చు.

నో నటన... నిర్మాణమే! 

కొన్ని కథలు బావుంటాయి. అగ్ర నాయకులకు నచ్చుతాయి. కానీ, వాటిలో వాళ్లకు సరిపడా పాత్రలు ఉండకపోవచ్చు. అందుకే మనసుకు నచ్చిన కథలను ప్రేక్షకులకు చూపించాలనీ, అభిరుచిని చాటుకోవాలనీ కొందరు కథానాయకులు నిర్మాతలుగా మారుతున్నారు. ఉదాహరణకు... నాని! ఆయన ‘అ!’ వంటి విభిన్న చిత్రాన్ని నిర్మించారు. అందులో ఆయన నటించలేదు. అలాగే, విష్వక్‌ సేన్‌ హీరోగా ‘హిట్‌’ నిర్మించిందీ ఆయనే. హీరోగా తన తొలి చిత్రం తీసిన దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ను హీరోను చేస్తూ ‘మీకు మాత్రమే చెప్తా’ నిర్మించారు విజయ్‌ దేవరకొండ. రాజ్‌ తరుణ్‌ హీరోగా పరిచయమైన ‘ఉయ్యాలా జంపాలా’ కథ నచ్చడంతో పి. రామ్‌మోహన్‌తో కలిసి నాగార్జున ఆ చిత్రాన్ని నిర్మించారు. సంపూర్ణేష్‌బాబు హీరోగా ‘సింగమ్‌ 123’ నిర్మించారు మంచు విష్ణు. ఇన్నాళ్లూ తన చిత్రాలకు మాత్రమే పరిమితమైన మహేశ్‌బాబు, ముంబై ఉగ్రదాడిలో అమరుడైన సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా సోనీ పిక్చర్స్‌తో కలిసి ‘మేజర్‌’ నిర్మిస్తున్నారు. అందులో ఆయన నటించడం లేదు. కేవలం నిర్మిస్తున్నారంతే! అడివి శేష్‌ ఆ చిత్రంలో హీరో. యువ హీరో సందీప్‌ కిషన్‌ కూడా ‘వివాహ భోజనంబు’ అని ఓ చిత్రం నిర్మిస్తున్నారు. అందులో ఆయన నటించడం లేదు. హాస్య  నటుడు సత్య, మరొకరు హీరోలుగా నటిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఓటీటీ వేదికల్లో వచ్చిన ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’కి రానా సమర్పకుడిగా వ్యవహరించారు. 

నిర్మాతలు కాని నిర్మాతలు!

నిర్మాతలు కాని నిర్మాతలుగా కొందరు హీరోలు ఉంటున్నారు. నిర్మాతలుగా వాళ్ల పేరు తెరపై కనిపించదు. వాళ్ల  బంధుగణం నిర్మాతలుగా ఉంటారు. వెంకటేశ్‌ నిర్మాత కాదు. కానీ, ఆయనో నిర్మాత కుమారుడు. ఆయన అన్న సురేశ్‌బాబు నిర్మాత. వెంకటేశ్‌ నటించిన కొన్ని చిత్రాలను తండ్రి, లేదంటే అన్నయ్య నిర్మించారు. ప్రస్తుతం వెంకటేశ్‌ నటిస్తున్న ‘నారప్ప’కు సురేశ్‌బాబు ఓ నిర్మాత. అల్లు అర్జున్‌దీ ఇటువంటి నేపథ్యమే. ఆయన నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు. తండ్రి నిర్మించిన కొన్ని చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా... కొన్ని చిత్ర నిర్మాణాల్లో బంధుగణాన్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. ‘రేసుగుర్రం’కి మావయ్య డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’కి మరో మావయ్య నాగబాబు, ప్రస్తుతం నటిస్తున్న ‘పుష్ప’లో బంధువులకు చెందిన ముత్తంశెట్టి మీడియా సంస్థను అల్లు అర్జున్‌ భాగస్వామిగా చేర్చారు. బాక్సింగ్‌ నేపథ్యంలో వరుణ్‌ తేజ్‌ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో అల్లు అరవింద్‌ పెద్ద కుమారుడు వెంకటేశ్‌ (బాబీ) నిర్మాతగా మారుతున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రంతో చిరంజీవి కుటుంబం నిర్మాణ రంగంలోకి వచ్చింది. అంతకుముందు తమ్ముడు నాగబాబు నిర్మాణంలో కొన్ని చిత్రాలు చేసిన చిరంజీవి, సతీమణి సురేఖ సమర్పణ-తనయుడు రామ్‌చరణ్‌ నిర్మాణంలో ‘ఖైదీ నంబర్‌ 150’, ‘సైరా’ రూపుదిద్దుకొన్నాయి. ‘ఆచార్య’ నిర్మాణంలోనూ మెగా కుటుంబానికి చెందిన కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ భాగస్వామిగా ఉంది. తమ్ముడు ఎన్టీఆర్‌తో ‘జై లవకుశ’ నిర్మించారు కల్యాణ్‌రామ్‌. ప్రభాస్‌కి ‘మిర్చి’, ‘సాహో’, ప్రస్తుతం సెట్స్‌ మీదున్న ‘రాధే శ్యామ్‌’ చిత్ర నిర్మాతలలో ఒకరైన ప్రమోద్‌ ఉప్పలపాటి కజిన్‌. అలాగే  కుమారులు నాగ చైతన్య, అఖిల్‌ హీరోలుగా నటించిన కొన్ని చిత్రాలను నాగార్జున నిర్మించారు. ‘ఒక లైలా కోసం’ ప్రొడక్షన్‌ పనులు చైతూ చూసుకున్నాడని ఒకానొక సందర్భంలో ఆయన వెల్లడించారు. రామ్‌ హీరోగా నటించే కొన్ని చిత్రాలను ఆయన పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్‌ నిర్మిస్తుంటారు. తనయుడు సాయి శ్రీనివాస్‌ను హీరోగా నిలబెట్టడం కోసం బెల్లంకొండ సురేశ్‌ భారీ బడ్జెట్‌ చిత్రాలు నిర్మించారు. యువ హీరో నాగశౌర్యతో తల్లితండ్రులు ఉషా-శంకర్‌ ప్రసాద్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నారు. కార్తికేయ గుమ్మకొండతో ఆయన బాబాయ్‌ అశోక్‌రెడ్డి కొన్ని చిత్రాలు నిర్మించారు. తనయుడు ఆకాశ్‌ హీరోగా నటిస్తున్న చిత్రాలను పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు.

పారితోషికమే వీళ్ల పెట్టుబడి!

మరి కొంతమంది కథానాయకులు నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకొంటున్నారు.  పాక్షికంగా పెట్టుబడి పెట్టడమో? లేదంటే పారితోషికం తీసుకోకుండా దాన్నే పెట్టుబడిగా పెట్టడమో చేస్తున్నారు. మహేశ్‌బాబు నటించే ప్రతి చిత్రానికీ ఆయన సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేరు పడుతుంది. పారితోషికం బదులు నాన్‌-థియేట్రికల్‌ లేదంటే శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు మహేశ్‌ తీసుకుంటారని వినికిడి. దీనివల్ల భాగస్వామిగా ఉన్న నిర్మాతకు ఎంతో కొంత లాభమే! సాధారణంగా కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే కథానాయకులకు సినిమా సెట్స్‌ మీదకు వెళ్లడానికి  ముందే అడ్వాన్సు రూపంలో కొంత మొత్తాన్ని నిర్మాతలు ఇస్తుంటారు. కొందరు నిర్మాతలైతే వడ్డీకి తీసుకొచ్చి మరీ ఇస్తారు. అదే కథానాయకులు నిర్మాణంలో భాగస్వామ్యులైతే ఈ అడ్వాన్సులు, వడ్డీల భారం ఉండదు. సినిమా పూర్తయిన తర్వాత లాభానష్టాల్లో వాటా పంచుకోవచ్చు. ‘నిను వీడని నీడను నేనే’తో నిర్మాతగా మారిన సందీప్‌ కిషన్‌, వెంకటాద్రి టాకీస్‌ సంస్థ నెలకొల్పి తాను హీరోగా నటించే చిత్రాల్లో భాగస్వామిగా మారుతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’లోనూ సందీప్‌ కిషన్‌ నిర్మాణ భాగస్వామి.

నటన... నిర్మాణం... రెండూ!

కొందరు కథానాయకులు చిత్రంలో నటించడంతో పాటు స్వయంగా నిర్మిసున్నారు.  నాగార్జున, నందమూరి కల్యాణ్‌రామ్‌ పేర్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.  కథ నచ్చితే నాగార్జున చిత్రాన్ని నిర్మించడమే కాదు... కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడానికీ వెనుకాడరు. ఈమధ్య కాలంలో ‘సోగ్గాడే చిన్ని నాయనా’తో కల్యాణ్‌కృష్ణను ఆయనే  దర్శకుడిగా పరిచయం చేశారు. . అలాగే, ఇప్పటి అగ్ర దర్శకుడు సురేందర్‌రెడ్డిని ‘అతనొక్కడే’ చిత్రంతో నందమూరి కల్యాణ్‌రామ్‌ దర్శకుడిగా పరిచయం చేశారు. తండ్రి బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’తో బాలకృష్ణ ఈ జాబితాలో చేరారు. అందులో ఆయన ఎన్టీఆర్‌గా నటించడంతో పాటు స్వయంగా నిర్మించారు. మంచు మోహన్‌బాబు వారసులు విష్ణు, లక్ష్మీ సొంతంగా నిర్మాణ సంస్థలు నెలకొల్పి తమ చిత్రాలు తామే నిర్మించారు. ‘అహం బ్రహ్మాస్మి’తో మంచు మనోజ్‌ కూడా నిర్మాతగా మారుతున్నారు. ఈ నెల 18న ఓటీటీలో విడుదలవుతున్న ‘అమరం అఖిలం ప్రేమ’ చిత్రానికి అందులో హీరో విజయ్‌ రామ్‌ నిర్మాత. ‘కో అంటే కోటి’తో శర్వానంద్‌ నిర్మాతగా మారారు. ఆ తర్వాత మరో చిత్రం చేయలేదు. ‘నన్ను దోచుకుందువటే’తో సుధీర్‌బాబు నిర్మాతగా మారారు.  నిర్మాణంలో  లాభమైనా, నష్టమైనా ఈ కథానాయకులే భరిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement