Abn logo
Feb 8 2020 @ 22:28PM

పెళ్ళికాకుండా పిల్లల్ని కనను: తాప్సీ పన్ను

టాలీవుడ్‌లో తాప్సీ వేసిన తప్పటడుగులు అందరికీ తెలిసిందే. ఆమె చేసిన తప్పలే ఆమె కెరీర్‌కు శాపాలయ్యాయి. దాంతో టాలీవుడ్‌లో  స్టార్‌ హీరోలు ఆమెకు ఎవరూ లిఫ్ట్ ఇవ్వలేదు. ఇక టాలీవుడ్‌లో లాభం లేదనుకుని కోలీవుడ్‌లో అడుగు పెట్టింది. అక్కడా సేమ్ సీన్ ఎదురైంది. పేరొస్తే హిట్టు రాలేదు.. హిట్టొస్తే పేరు రాలేదు! దీంతో తాప్సీ కెరీర్‌ గజిబిజి అయిపోయింది. దక్షిణాదికి గుడ్‌బై చెప్పేసి బాలీవుడ్‌ బాట పట్టింది. అక్కడ మాత్రం ఊహాతీతమైన అవకాశాలతో దూసుకుపోతోంది. అక్కడ వరుసగా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లో రాణిస్తోంది. బేబీ, పింక్, బద్లా వంటి ప్రయోగాత్మక చిత్రాలతో దూసుకుపోతున్న తాప్సీతో...


అమితాబ్‌ లాంటి గొప్ప నటుడిని విమర్శించాలని ఎలా అనిపించింది?

నేనేమీ ఆయనను వ్యక్తిగతంగాకానీ, కావాలని కానీ విమర్శించలేదు. ‘బద్లా’ సినిమాలో నా పాత్ర నిడివి తక్కువేమీ కాదు. చాలా సన్నివేశాలలో కనిపిస్తాను. కానీ, సినిమా పోస్టర్లలో కానీ, ప్రచారపు వీడియోల్లో కానీ నాకు తగిన గుర్తింపునూ, ప్రాధాన్యతను ఇవ్వలేదు. మొత్తం అమితాబ్‌గారి సినిమా అన్నట్టుగానే చూపించారు. అదే కోపం తప్ప నాకు ఆయన మీద ఎలాంటి కోపం లేదు. ఆయనను అభిమానించే వ్యక్తుల్లో నేను ఎప్పుడూ ముందే ఉంటాను. 


అందరినీ విమర్శిస్తూ పోతే అవకాశాలు రావన్న భయం లేదా?

నిజం మాట్లాడడానికి భయం ఎందుకు? నేనేమీ తప్పుగా మాట్లాడలేదు కదా? నా మాటలు చాలా మందిని ఆలోచింపచేశాయన్న విషయం నాకు తెలుసు. 


బాలీవుడ్‌లో మీ తాజా సినిమా గురించి?

‘ముల్క్‌’ దర్శకుడు అనుభవ్‌ సిన్హా కాంబినేషన్‌లో మరో మహిళా ప్రాధాన్య చిత్రంలో నటిస్తున్నాను. అదే ‘తప్పడ్‌’. మహిళలు బయటకు చెప్పుకోలేని కొన్ని సంగతుల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో నేనొక సాధారణ మహిళగా కనిపిస్తాను. ఈ పాత్రలో చాలా కోపంగా, ఆగ్రహంగా ఊగిపోతూ ఉండాలి. కానీ నేను ఇప్పటి వరకూ అటువంటి పాత్రలు చేయలేదు. ఆ రూపం ఎలా తీసుకురావాలి అన్నదే నాకు, అభినవ్‌ సిన్హా సర్‌ ముందు ఉన్న పెద్ద సవాలు. ఈ సినిమా పూర్తయ్యాక మళ్లీ మాట్లాడతా. ఇందులో రియల్‌ తాప్సీ కనిపించదు. అమృత పాత్ర మాత్రమే కనిపిస్తుంది. 


ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించడానికి కారణం?

రెండు కారణాలున్నాయి.. నా దగ్గరకి అన్నీ అలాంటి సినిమాలే వస్తున్నాయి. రెండో కారణం నేను ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోతానని నా దర్శకనిర్మాతలు భావించడం. ఏమైనా నటిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలు చేస్తున్నాను. అదే ఆనందంగా ఉంది. 


సినిమా పూర్తయ్యాక కూడా పాత్ర నుంచి బయటకు రారట నిజమేనా?

నూటికి నూరుపాళ్ళు నిజం. నేను ఒక పాత్ర చేస్తున్నప్పుడు షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పాక కూడా ఆ పాత్ర ప్రభావం కనీసం పది శాతం అయినా నా మీదుంటుంది. అందుకు ఓ ఉదాహరణ చెబుతాను. ‘మన్‌మర్జియాన్‌’ సినిమాలో నేను ముక్కుసూటిగా మాట్లాడే అమ్మాయిగా చేశాను. మనసులో అనుకున్నది ముఖం మీద చెప్పేస్తాను. గట్టిగా మాట్లాడే పాత్ర. ఆ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక కూడా ఆ పాత్రలోనే ఉండిపోయాను. అలాంటి సమయంలో ఒక వ్యక్తి నా అనుమతి తీసుకోకుండా ఫోన్‌తో ఫొటో తీయడానికి ప్రయత్నించాడు. అంతే.. ఆ ఫోన్‌ నువ్వు లోపల పెట్టకపోతే ఫోన్‌ని విరగ్గొడతాను అని అరిచేశాను. అంత చిన్న విషయానికి అంతలా రియాక్ట్‌ కానవసరంలేదు. అయితే ఆ పాత్ర తాలూకు ప్రభావం ఉండటంతో అలా చేశాను. చాలావరకూ నన్ను నేను కంట్రోల్‌ చేసుకుంటూ ఉంటాను. కొన్నిసార్లు అలా చేసుకోలేను. అలాంటప్పుడు పై సంఘటనలు జరుగుతుంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు తాప్సీ కోపిష్ఠిది, పొగరు ఎక్కువ అన్న బిరుదులు ప్రధానం చేసేస్తారు. కానీ నేనేమిటో నాతో ఉన్నవారికే తెలుస్తుంది.


డబ్బు సమస్య కాదంటూనే తరచూ పారితోషికం గురించి ఎందుకు ప్రస్తావిస్తారు?

సినిమాలో హీరో హీరోయిన్లకు పారితోషికం విషయంలో ఉన్న హెచ్చుతగ్గుల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. కానీ నాకు ఎక్కువ ఇవ్వమని ఎప్పుడూ అడగను. నా కష్టానికి తగిన ప్రతిఫలం అడగడం కూడా తప్పేనా? సినిమాలో హీరో హీరోయిన్లకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇద్దరికీ సమానంగా ఇవ్వాలి కదా? అదే నా డిమాండ్‌. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రెమ్యునరేషన్‌ విషయంలో చాలా మార్పు వచ్చింది. బాలీవుడ్‌లో ఓ సినిమాకు పది నుంచి పదిహేను కోట్లు అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. కాకపోతే హీరోలతో పోల్చుకుంటే ఇది తక్కువ మొత్తమే! అందుకే మాట్లాడవలసి వస్తోంది. 


హీరోయిన్‌ అయిన తరువాత స్వేచ్ఛను కోల్పోయామని కొందరు తరచూ చెబుతుంటారు కదా? మీకూ అలా అనిపించిందా?

సెలబ్రెటీని కావడంతో నేను పుట్టి పెరిగిన ఢిల్లీలో కూడా బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా నాకే కాదు, నాతో వచ్చేవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నో మీన్స్‌ నో అన్నది ప్రజలు ఇంకా అర్థం చేసుకోవడం లేదు. ఇలాంటి సమస్యల కారణంగానే నేను ఏదైనా షాపింగ్‌ చేయాలంటే విదేశాల్లోనే చేసుకుంటున్నాను. నిజానికి నాకు మాల్స్‌కు వెళ్లి షాపింగ్‌ చేయడం చాలా ఇష్టం. అయితే ఇండియాలో అలా చేయలేకపోతున్నాను. ప్రజలు నేనంటే అభిమానం చూపిస్తున్నారన్నది సంతోషకరమైన విషయమే. అయితే హద్దులు దాటి నా వ్యక్తిగత జీవితంలోకి రావడం నన్ను బాధకు గురి చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలో సెలబ్రిటిని అయిన తరువాత నా జీవితంలో చాలా మార్పు వచ్చింది.


మీరు ప్రేమిస్తున్న అబ్బాయి గురించి?

అతను నటుడో, క్రికెటరో కాదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం అతను నాకు చాలాదూరంగా కూడా ఉన్నాడు. అతన్ని ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాను? ఎప్పుడు పిల్లల్ని కంటాను? అన్నది పూర్తిగా నా వ్యక్తిగతం. వాటి గురించి అందరితో డిస్కస్‌ చేయలేను. ఈ విషయంలో మా పేరెంట్స్‌తో మాత్రమే మాట్లాడతాను. పెళ్ళి తరువాతే పిల్లల్ని కంటాను. పెళ్ళికాకుండా పిల్లల్ని కనడం నాకు ఇష్టముండదు. మళ్ళీ అలా కంటున్నవారున్నారు కదా? వారిని విమర్శిస్తున్నారా? అని మాత్రం అడగకండి. దీని మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. 


మీరు ఇష్టపడే వ్యక్తిని మీ సిస్టర్‌ పరిచయం చేశారట కదా?

నిజమే! నా సిస్టర్‌ షబ్నమ్‌ పరిచయం చేసింది. అందులో వింతేముంది? 


వ్యాపారంలో స్థిరపడతానని తరచు చెబుతుంటారు కదా? దానికి ఇంకా సమయముందంటారా?

నేను భవిష్యత్తు గురించి అంటే మరో పది పదిహేను సంవత్సరాల తరువాత గురించి మాట్లాడాను. అంతే తప్ప రాబోయే ఏడాదిలోనో, రెండేళ్ళల్లోనో వ్యాపారంలో స్ధిరపడతానని కాదు. ప్రస్తుతం నా చేతిలో మరో మూడు నాలుగు సంవత్సరాల వరకూ ఖాళీ లేనంతగా పని ఉంది. అన్ని సినిమాలు చేస్తున్నాను. ఎంబిఏ చేశాను కనుక. సహజంగానే నాకు వ్యాపార రంగమంటే మక్కువ. ఆ కారణంగానే భవిష్యత్తులో వ్యాపారంలో స్థిరపడతానని చెప్పాను. ఇప్పటి నుంచే అందరూ ఎప్పుడూ ఇదే అడుగుతుంటారు ఎందుకో నాకు ఇప్పటికీ అర్ధం కాదు.

–స్పందనరెడ్డి

Advertisement
Advertisement
Advertisement