Abn logo
Mar 9 2020 @ 22:16PM

ఆ పదమే నాకు నచ్చదు: రీతు వర్మ

కొందరు హీరోయిన్స్ తెలుగులో రెండు మూడు సినిమాలకే కనుమరుగైపోతారు. అదే లిస్టులోకి వస్తుంది రీతు వర్మ. ‘పెళ్ళి చూపులు’ తర్వాత రీతు పాపులర్ హీరోయిన్స్ లిస్టులో చేరుతుందని ఊహించారు అందరూ. కానీ ఆ సినిమా తర్వాత ఏదో అడపాదడపా సినిమాలు చేసి మెల్లగా కోలీవుడ్‌కి షిఫ్ట్ అయింది రీతు. ఇక తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్తుందేమో అనుకుంటున్న సమయంలో మూడు సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగులో తిరిగి బిజీ అయిన రీతు వర్మతో...


టాలీవుడ్‌కి తిరిగి వచ్చారని అనుకోవచ్చా?

ఆ పదమే నాకు నచ్చదు. నేను టాలీవుడ్‌ నుంచి వెళ్ళిపోలేదు. మంచి కథలు రాక ఇక్కడ సినిమాలకి కొంత గ్యాప్‌ వచ్చింది అంతే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళినట్టు కాదు. ఇప్పుడు మంచి కథలు వచ్చాయి. అందుకే ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పాను. 


తెలుగులో తొలి సినిమా తరువాత ఎందకంత గ్యాప్‌ వచ్చిందంటారు?

ఈ రంగంలో నిలదొక్కుకోవడం అనుకున్నంత ఈజీ కాదు. పైకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందే తప్ప నటించేటప్పుడు, సినిమాల ఎంపిక అంత కలర్‌ఫుల్‌గా ఉండదు. మనకు కావలసిన కథలు ఎప్పుడూ రావు. వచ్చిన కథలలోనే మంచివి చేద్దామనుకున్నా కొన్నిసార్లు అది కూడా సాధ్యం కాదు. తెలుగులో గ్యాప్‌ రావడానికి ఇదొక కారణం.


కోలీవుడ్‌లో సినిమాలు చేసేటప్పుడు భాష ఇబ్బంది అనిపించలేదా?

మొదట్లో నాకు వేరేవాళ్ళు డబ్బింగ్‌ చెప్పేవారు. కొన్నిసార్లు అది సరిగ్గా వచ్చేదికాదు. తెర మీద చూస్తే ఆ లోపం స్పష్టంగా కనిపించేది. ఇలా కాదనుకుని ఓ ట్యూటర్ని పెట్టుకుని నెలరోజుల్లో తమిళం నేర్చుకున్నాను. చిన్న చిన్న పదాలు పలకడం, భాష అర్ధం చేసుకోవడానికి ఈ సమయం సరిపోయింది. ఇప్పుడు నా పాత్రకి నేనే డబ్బింగ్‌ చెప్పుకునే స్థాయిలో భాష నేర్చుకున్నాను. 


ధృవనక్షత్రం సినిమా ఆలస్యానికి కారణం?

ఈ రంగంలో ఆలస్యం కావడానికి కారణం ఇది అని చెప్పడానికి ఉండదు. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. షూటింగ్‌ లేటవుతుందనుకున్న సినిమా త్వరగా పూర్తి కావచ్చు. త్వరగా పూర్తవుతుందనుకున్న సినిమా లేట్‌ కావచ్చు. ఏది ఏమైనా అది గౌతమ్‌ మీనన్‌ సినిమా కనుక ఎంత లేటైనా లేటెస్ట్‌గానే ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. 


ఆ మధ్య సల్మాన్‌ సరసన బాలీవుడ్‌లో ఛాన్స్‌ వచ్చిందన్నారు నిజమేనా?

ఆ వార్తలు నా వరకూ వచ్చాయి. కానీ బాలీవుడ్‌ నుంచి నన్నెవరూ కాంటాక్ట్‌ చేయలేదు. అలాంటి వార్త ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. మంచి అవకాశం వస్తే అక్కడ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.


ఎలాంటి పాత్రలంటే ఇష్టం?

ఇది కూడా నా చేతిలో ఉండదు. కాకపోతే కథల ఎంపికలో చాలా సెలక్టివ్‌గా ఉంటాను. ఆ పాత్రకి నేను సరిపోతానా లేదా అని నాలుగైదు సార్లు ఆలోచించుకుని ఓకే చెబుతాను. కథ విన్న వెంటనే ఓకే చెప్పను. రీతుతో సినిమా ఓకే చేయించుకోవడం కష్టమంటారు కానీ, నా పాత్ర బాగుంటేనే నేను ఒప్పుకుంటాను. ముందుగానే నేను టైము తీసుకుంటాను అని చెబుతాను. నాకు అంత టైం ఇవ్వడానికి ఇష్టపడిన వారే నాతో చేస్తారు. 


లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలు చేసే ఆలోచన ఉందా?

నేను అలాంటి పాత్రలకు సరిపోనని నా అభిప్రాయం. అయినా నా దగ్గరకు ఇంతవరకూ అలాంటి కథలు రాలేదు. ఎవరైనా వస్తే అప్పుడు ఆలోచిస్తాను.


గ్లామర్‌ విషయంలో గతంలో ఉన్న అభిప్రాయంలో మార్పు ఏమైనా ఉందా?

ఎప్పుడూ లేదు. నన్ను అందంగా చూపిస్తానంటే ఒప్పుకుంటాను కానీ గ్లామర్‌ పేరుతో అసభ్యంగా చూపిస్తానంటే మాత్రం ఒప్పుకోను. గతంలో ఒకటి రెండు పెద్ద సినిమాలు ఈ కారణంతో వదులుకున్నాను. అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ నా నిర్ణయంలో మార్పు ఉండదు. రాదు కూడా!

–భరత్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement