Abn logo
Feb 23 2020 @ 21:49PM

ఆయనంటే చాలా ఇష్టం: నూరిన్‌ షరీఫ్‌

తెలుగులోకి మాలీవుడ్‌ భామలు చాలామందే వచ్చారు. అలా వచ్చినవారిలో కొందరు స్టార్‌ హీరోయిన్లు అయ్యారు. వారి బాటలోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది మాలీవుడ్‌ భామ నూరిన్‌ షరీఫ్‌. తెలుగులో డబ్‌ అయిన ‘లవర్స్‌ డే’లో ఆమె నటనకు మంచి మార్కులే పడినా తెలుగులో అవకాశంకోసం దాదాపు ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. తెలుగులో చేయడానికి ఇంత గ్యాప్‌ వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదంటున్న నూరిన్‌ షరీఫ్‌తో...


సినిమాల్లోకి రావాలని ఎప్పుడు అనిపించింది?

మా తాతగారు ఒకప్పుడు సినీ దర్శకుడు. మా అమ్మకి కూడా నటన అంటే చాలా ఇష్టం. నటించాలని ఆవిడ చాలా ఆశపడింది. కానీ ఆవిడకి అది తీరని కోరికే అయింది. ఆవిడ కోరిక నేను తీరుస్తున్నాను. నాకూ నటన అంటే ఇష్టమే! సినీ నేపథ్యం ఉండడంతో సినిమాల్లోకి రావడం పెద్ద కష్టంగా అనిపించలేదు. వచ్చిన తరువాతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అయితే మా పేరెంట్స్‌ సపోర్టు నాకు పూర్తిగా ఉండడంతో వాటిని తేలికగానే అధిగమించగలిగాను. నేను పదవ తరగతి చదివే సమయంలోనే ఓ షార్ట్‌ ఫిలిం చేశాను. నాకు అప్పటినుంచే నటన అంటే ఆసక్తి కలిగింది.


చదువును మధ్యలోనే వదిలేసినట్టున్నారు?

ఎం.బి.ఏ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్న సమయంలో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చదువుకి ఇబ్బంది కలగకుండా షూటింగ్‌ ప్లాన్‌ చేసుకునేదాన్ని. ఇప్పుడు చదువు పూర్తయింది. పూర్తిస్థాయి నటిగా మారిపోయాను.


తెలుగులో చాలా గ్యాప్ వచ్చినట్టుంది?

నిజమే...దాదాపు సంవత్సరం గ్యాప్‌ వచ్చినా పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే...‘ఊల్లాల ఊల్లాల’ సినిమా ఆ బాధను పోగొట్టింది. సినిమా కథ నాకు బాగా నచ్చింది. ఎలాంటి కథతో తెలుగువారి దగ్గరకు రావాలనుకున్నానో సరిగ్గా అలాంటి కథే నాకు దొరికింది. సినిమా జయాపజయాలను పక్కనపెడితే ఈ సినిమాలో నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. చాలామంది నా నటన బాగుందని మెచ్చుకున్నారు కూడా! ఇకనుంచి సాధ్యమైనన్ని తెలుగు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను.


భాష ఇబ్బందిగా అనిపించలేదా?

ప్రారంభంలో ఏదైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ‘ఊల్లాల ఊల్లాల’ కోసం ఎక్కువ కాలం హైదరాబాదులో ఉండాల్సి వచ్చింది. దాంతో భాష కొద్దిగా వచ్చింది. పూర్తి స్థాయిలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడి హలీమ్‌, బిర్యానీ నాకు బాగా నచ్చాయి. వీటి రుచి మరెక్కడా రాదని అనిపించింది. 


బాగా డ్యాన్స్‌ చేస్తారట కదా?

చిన్నతనంనుంచీ డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. కొన్నిరోజులు డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఆ తరువాత కుదరక మానేశాను. ఇప్పటికీ ఇంట్లో ఖాళీగా ఉంటే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటాను. 


ఈ రంగంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన వ్యక్తులు

అల్లు అర్జున్‌ గారంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు కొన్ని కేరళలో విడుదలయ్యాయి. అవి చూసి ఆయనకి వీరాభిమానిగా మారిపోయాను. ఆయనతో నటించాలని ఉంది. ఇకపోతే నయనతారగారే నాకు స్ఫూర్తి. నాలాంటి అప్‌కమింగ్‌ హీరోయిన్లకు ఆవిడే స్ఫూర్తి అని అనుకుంటున్నాను.


ప్రియా వారియర్‌తో విభేదాలు సమసిపోయినట్టేనా?

విభేదాలు కాదు. కొద్దిగా గ్యాప్‌ వచ్చిందంతే! దానికే మా మధ్య ఏదో జరిగిందని అందరూ అనుకున్నారు. నిజానికి ‘లవర్స్‌ డే’ చేస్తున్న సమయంలోనే నేనూ, తనూ మంచి స్నేహితులమైపోయాం. ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో ఇద్దరికీ కాస్త నిరాశే కలిగింది. సినిమా సక్సెస్‌ కాకపోయినా మాకు పేరు మాత్రం ఎక్కువే వచ్చింది. 


మీరు తదుపరి చేయబోతున్న సినిమాల గురించి

ప్రస్తుతానికి మాలీవుడ్‌లో రెండు, కోలీవుడ్‌లో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో కథలు విన్నాను కానీ, వేటికీ ఓకే చెప్పలేదు. 

                          –భరత్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement