Abn logo
Feb 18 2020 @ 23:12PM

నాకు ఎంత ఇవ్వాలో వారికి బాగా తెలుసు: నభా నటేష్‌

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు.. చేతిలో సినిమాలు ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనుకుంటోంది గ్లామరస్ హీరోయిన్ నభా నటేష్. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో తన సత్తా నిరూపించుకున్న నభాకు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. అందుకే ఒక్కసారిగా తన రెమ్యునరేషన్‌ పెంచేసిందంటున్నారు. అయితే అవన్నీ అబద్ధాలేననీ, తనకు ఎంత ఇవ్వాలో తన దర్శకనిర్మాతలకు తెలుసంటున్న నభా నటేష్‌తో.... 


2019 మీకు ఎలాంటి అనుభవాలను ఇచ్చింది?

2019 నిజంగా నాకు బెస్ట్ ఇయర్. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ అందుకున్నాను. ఆ సినిమా విజయం నాకు మంచి కిక్‌ ఇచ్చింది. ఆ కిక్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను. ఎక్కడకు వెళ్లినా, ఆ సినిమాలోని సాంగ్స్ పాడమని, డైలాగ్స్ చెప్పమని అడుగుతున్నారు. 


టాలీవుడ్‌లో మీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌?

నిజం చెప్పాలంటే ఇక్కడ నాకు మిత్రులు ఎవరు లేరు. నాది బెంగుళూరు కావడం వలన ఇక్కడ షూట్ అయిపోగానే వెంటనే వెళ్ళిపోతాను. దానితో ఎవరితో స్నేహం పెంచుకునేంత సమయం దొరకడం లేదు. అంత త్వరగా నా అంతట నేనుగా ఎవరితోనూ మాటలు కలపలేను. ఒకవేళ ఎవరైనా పలకరిస్తే మాత్రం వెంటనే స్నేహం చేసుకుంటాను. కొద్దిగా స్టార్టింగ్‌ ట్రబులన్నమాట. 


తెలుగు హీరోయిన్ల మధ్య పోటీ ఎలా ఉందంటారు?

హీరోయిన్ల మధ్య పోటీ  తెలుగులోనే కాదు. అన్ని భాషల్లోనూ ఉంటుంది. ఎక్కడైనా ఎవరికి తగ్గ అవకాశాలు వారికి వస్తుంటాయి. ఇక్కడ పోటీ ఆరోగ్యకరంగా ఉంది. ఒకరిని చూసి ఒకరు అసూయ పడడం, ఈర్ష్య పడడం లాంటివి నాకు కనిపించలేదు. సినిమా బయట అందరూ స్నేహంగానే ఉంటారు. నా సీనియర్స్‌ చేసిన సినిమాలు ఇప్పటికే చాలా చూశాను. వారి నటన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. వారికన్నా బాగా చేయాలని తపన పడుతుంటాను. 


ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?

ఒక నటిగా విభిన్న పాత్రలు చేయాలని ఎవరికైనా ఉంటుంది. అయితే అనుకున్నంత మాత్రాన రావు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలలో నాకు మాత్రం డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ చేసే అవకాశాలు వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను సినిమా అభిమానిని. కాబట్టి ఏ జానర్‌ సినిమా అయినా నాకు ఇష్టమే.


ఇటీవలి కాలంలో మీ రెమ్యునరేషన్‌ డబుల్‌ చేశారని అంటున్నారు నిజమేనా?

నాకు ఎంత ఇవ్వాలో నా దర్శకనిర్మాతలకు బాగా తెలుసు. నేను ఇప్పుడిప్పుడే ఈ రంగంలో నిలదొక్కుకుంటున్నాను. ఇంకా డిమాండ్‌ చేసే స్థాయికి చేరుకోలేదు. అయినా ఒకరిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు నాది. ఎంత ఇచ్చినా తీసుకుంటాను. అలాగని మరీ తక్కువ ఇస్తానంటే మాత్రం చేయలేను. 


పాయల్‌ రాజ్‌పుత్‌తో చేయడం ఎలా అనిపించింది?

‘డిస్కో రాజా’ షూటింగ్‌ సమయంలో ఇద్దరం కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. బయట మామూలుగా మాట్లాడుకుంటాం అంతే! తనతో కలిసి నటించే అవకాశం ఈ సినిమాలో నాకు రాలేదు. మరో సినిమాలో ఆ అవకాశం వస్తుందేమో చూడాలి. 


మీ మొదటి రెండు సినిమాలు కుర్ర హీరోలతో చేశారు. మొదటిసారి సీనియర్‌ హీరో రవితేజతో చేయడం ఎలా ఉంది?

రవితేజ గారితో కలిసి పనిచేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఆయన నటించిన ‘కిక్’ నా ఫేవరేట్ మూవీ. ఆయన ఎనర్జీ లెవెల్స్ అద్భుతం. సెట్‌లో ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూనే ఉంటారు. సినిమాలు, ఫుడ్ ఇలా చాలా విషయాలు చెప్పేవారు. 


మీ తరువాతి సినిమాల గురించి?

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలో నా పాత్ర డిఫరెంట్‌గా ఉంటుంది. అదేవిధంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్నాను. అలాగే తమిళంలో ఓ సినిమా చర్చల్లో ఉంది. 

–కె. రామకృష్ణ

Advertisement
Advertisement
Advertisement