Mar 23 2020 @ 23:10PM

ఆ కోరిక, ఆ తొందర నాకు లేవు: మాళవిక నాయర్‌

‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో తెలుగువారికి పరిచయమైన మాళవిక నాయర్‌ ఆ తరువాత వచ్చిన ‘కల్యాణవైభోగమే’, ‘మహానటి’, ‘టాక్సీవాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మకుట్టి కొచ్చిన్‌లో చదువుకుంది. అందరూ చదువు పూర్తయిన తరువాత  సినీ రంగంలోకి వస్తే, చదువుకుంటూనే నటనను కొనసాగిస్తున్న మాళవిక నాయర్‌తో...


చదువుకుంటూ నటించడమంటే రెండుపడవల మీద ప్రయాణం చేయడం కదా....ఇబ్బందిగా అనిపించడంలేదా?

రెండూ ఇష్టమైనవే కనుక రెండుపడవల ప్రయాణం ఎప్పుడూ ఇబ్బంది అనిపించలేదు.


సినిమాలపై ఇష్టం ఎలా ఏర్పడింది?

నేను మలయాళం సినిమా ద్వారానే సినీరంగం ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే కదా! ఆ సినిమా చేసేటప్పుడు సినిమాలమీద ఎలాంటి అభిప్రాయం ఉండేది కాదు. క్రమేపీ వాటి మీద ఇష్టం ఏర్పడింది. తెలుగులో ‘ఎవడే సుబ్రమణ్యం’ తరువాత నా ఆలోచనల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. ఈ సినిమా చేసేవరకూ సినిమా జీవితమని ఎప్పుడూ అనుకోలేదు. 


ఎలాంటి పాత్రలు చేయాలని అనుకుంటున్నారు?

ఫలానా పాత్ర చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కాకపోతే కంఫర్ట్‌జోన్‌లో ఉండే పాత్రలు చేయడం ఇష్టం ఉండదు. నాలోని నటికి సవాలు విసిరే పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. ఇప్పటివరకూ అలాంటి పాత్రలే ఎంచుకుంటూ వస్తున్నాను.


డిగ్రీతో ఆపే ఆలోచన ఉందా? లేక పై చదువులు కొనసాగిస్తారా?

మొదట డిగ్రీ తరువాత పీజీ చేయాలని అనుకున్నాను. కానీ సినిమాలు చేస్తున్న సమయంలోనే సినిమా మేకింగ్‌ మీద ఆసక్తి పెరిగింది. విదేశాలలో దీనికి సంబంధించిన కోర్సు తప్పకుండా చేస్తాను. నటన తరువాత నేను ఎక్కువగా ఇష్టపడేది దర్శకత్వాన్నే. భవిష్యత్తులో మంచి దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. 


ఈ రంగంలో మీకు ఆదర్శం?

పాత్రల ఎంపికలో అమీర్‌ఖాన్‌తో పాటు విద్యాబాలన్‌ నాకు ఆదర్శం. కమర్షియల్‌–నాన్‌ కమర్షియల్‌ సినిమాలను సమన్వయం చేసుకోవడంలో అమీర్‌ నాకు బాగా నచ్చుతారు. అలాగని బాలీవుడ్‌కి వెళ్లాలనే ఆత్రం లేదు. ఆసక్తి కూడా లేదు. 


మిగతావారిలాగా వరుస సినిమాలు ఎందుకు చేయరు?

ఒకదాని తరువాత మరొక సినిమా వెంటవెంటనే చేయాలన్న కోరిక, తొందర నాకు లేదు. ఎడాపెడా సినిమాలు చేసేయాలనే తొందర లేదు. నచ్చేపాత్రలు వచ్చేవరకు ఓపికగా ఎదురుచూస్తాను. రాకపోతే బాధ పడను. ఒక సినిమా సక్సెస్‌ అయితే సంతోషంతో పాటు, స్క్రిప్ట్‌ ఎంపికలో నా మీద నాకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. ‘టాక్సీవాలా’ విషయంలో ఇలాగే జరిగింది.. మంచి పాత్రల విషయంలో నిడివి గురించి ఆలోచించను. కమర్షియల్‌ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు. అయితే అందులో నేను చేస్తున్న పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. పాత్ర నచ్చకపోవడంతో ఈమధ్య ఒక కమర్షియల్‌ సినిమాను వద్దనుకున్నాను.


సోషల్‌ మీడియాకి దూరంగా ఎందుకుంటారు?

చాలామంది ఇదే ప్రశ్న అడుగుతుంటారు. మనగురించి మన సినిమాలు మాట్లాడాలి తప్ప మనం కాదు అనేది నా అభిప్రాయం. సోషల్‌ మీడియా టైమ్‌ ఎక్కువగా తినేస్తుంది. దానికి దూరంగా ఉండడంలోనే హాయి ఉంది. 


ఈ రంగంలో మీ రోల్‌మోడల్‌?

నా రోల్‌ మోడల్‌ మలయాళ నటి పార్వతి. ఆమె చేసిన పాత్రలు ఇష్టం. ఒక పాత్ర చేసే ముందు ఎంతో రీసెర్చ్‌ చేసిగాని ఆమె కెమెరా ముందుకు రాదు.


ఈ రంగంలో మీ స్నేహితుల గురించి?

ఇక్కడ నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. నాతో చేసిన హీరోలతోనే నేను ఫ్రెండ్లీగా ఉంటాను. అందరికన్నా విజయ్‌ దేవరకొండతో కాస్త చనువెక్కువ. ‘టాక్సీవాలా’ తన కోసమే చేశాను. ఇప్పటి వరకూ తనతో మూడు సినిమాలు చేశాను. ఆ తరువాత, నాని, నాగశౌర్య ఇద్దరూ చాలా స్నేహంగా ఉంటారు.

–కె.రామకృష్ణ

Advertisement

తారలతో ముచ్చట్లుమరిన్ని...