Abn logo
May 4 2020 @ 23:45PM

వాటికెప్పుడూ రెడీనే: హన్సిక

కాశ్మీర్‌ ఆపిల్‌ లాంటి అందచందాలతో కుర్రకారు గుండెల్ని గిలిగింతలు పెట్టింది. ఆమె అందానికి ముగ్ధులైన తమిళ తంబిలు ఆమెకు ఏకంగా గుడికట్టి గుండెల్లో పెట్టుకుని పూజించారు. ఆమె ఎవరో కాదు. హన్సికా మోత్వానీ. టాలీవుడ్‌లో ‘దేశముదురు’తో వెండితెరకు పరిచయమైనా కోలీవుడ్‌లోనే ఎక్కువ ఆదరణ పొందగలిగింది. చాలా గ్యాప్‌ తరువాత తెలుగువారిని ఇటీవల వచ్చిన ‘తెనాలి రామకృష్ణ’తో పలుకరించింది హన్సిక. మంచి చిత్రం అనుకుంటే ఏభాషలోనైనా చేయడానికి సిద్దమే అని చెబుతున్న హన్సికతో..


ఈ మధ్యకాలంలో తెలుగులో తక్కువ చిత్రాలు చేస్తున్నారు?

దురదృష్టవశాత్తూ ఎందుకో ఒక తెలుగు సినిమా తర్వాత మరొకటి చేయడానికి చాలా సమయం పడుతుంది. నేను తమిళ సినిమాలలో బిజీ అవడం కూడా ఒక కారణం. కానీ తెలుగులో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అస్సలు వదులుకోకుండా చేస్తూనే ఉన్నాను. నాకు భాషా భేధాలు అంటూ ఏమీ లేవు. మంచి చిత్రం అనుకుంటే ఏభాషలోనైనా చేయడానికి సిద్దమే.


ఇప్పటి వరకూ మీ కెరీర్ చూస్తుంటే ఏమనిపిస్తోంది?

ఇప్పటికే అన్ని భాషలలో 50కి పైగా చిత్రాలు చేశాను. అన్ని భాష‌ల‌లో స్టార్ హీరోలతో నటించే అవకాశం ద‌క్కింది. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. అలాగే ఇప్పటివరకూ నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ నేను చేసిన సినిమాలు, క్యారెక్టర్స్ పట్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను.


భవిష్యత్తులో నెగెటివ్ రోల్స్ చేసే అవకాశం ఉందా?

కచ్చితంగా ఉంది. పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ కాకున్నా కొన్ని చిత్రాలలో ఆల్రెడీ ఆ తరహా పాత్రలను చేశాను. నాకు తెలిసి కామెడీ, విలన్ పాత్రలు చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తే నటించడానికి నేను ఎప్పుడూ రెడీనే.


చిన్నతనం నుంచీ నటిస్తున్నారు కదా....బాల్యాన్ని కోల్పొయానన్న బాధ కలిగిందా?

ఏమీ తెలియని వయస్సులోనే నటించడం మొదలుపెట్టాను. షూటింగ్‌లో గ్యాప్‌ వచ్చిన సమయంలో చదువుకుంటూ ఉండేదాన్ని. ఇక ఆటపాటలంటే.. యూనిట్‌ సభ్యులతో ఆడుకునేదాన్ని. షూటింగ్‌ని బాగా ఎంజాయ్‌ చేసేదాన్ని. చిన్నదాన్ని కావడంతో అందరూ బాగా ముద్దు చేసేవారు. నా చిన్నతనాన్ని కోల్పోయానన్న ఆలోచన ఇంతవరకూ నాకెప్పుడూ రాలేదు. అయితే స్కూల్‌డేస్‌లో నన్నొక సెలబ్రిటీగా ట్రీట్‌ చేసేవారు. అదే కొద్దిగా బాధగా అనిపించేది. టీచర్లు కూడా అలా ట్రీట్‌ చేస్తుంటే ఎందుకో మొహమాటంగా అనిపించేది. 


చిన్నవయస్సులోనే డబ్బు, పేరు వచ్చాయి కదా? వాటి ప్రభావం మీమీద ఎలా ఉంది?

వాటి గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకోను కూడా. డబ్బు విషయాలన్నీ మా మదరే చూసుకుంటారు. గతంలో నాకు ఎంత ఇస్తున్నారు? ఎంత వస్తోందన్నది అస్సలు తెలుసుకునేదాన్ని కాదు. ఇప్పుడిప్పుడు అమ్మే అన్ని వివరాలు చెబుతూ ఉంటుంది. కానీ నాకు అవి ఎప్పుడూ బోరే! 


సినిమాల తరువాత మీరు బాగా ఇష్టపడేది?

డ్రైవింగ్‌. రకరకాల కార్లు డ్రైవ్‌ చేయాలంటే చాలా ఇష్టం. ఇటీవలే మా మదర్‌ నాకు బెంజ్‌కారు ప్రజెంట్‌ చేశారు. 


మీరు బాగా అల్లరి చేస్తారట నిజమేనా?

ఇంట్లోనే. బయట కాదు. నేనూ, మా బ్రదర్‌ కలిస్తే ఇప్పటికీ చిన్న పిల్లల్లాగా అల్లరి చేస్తుంటాం. మా గొడవని మా మదర్‌ మొదట్లో బాగా ఎంజాయ్‌ చేసినా, అది తారాస్థాయికి చేరితే మాత్రం బాగా అరిచేస్తారు. అమ్మకి కోపం రాగానే ఇద్దరం కామ్‌ అయిపోతుంటాం. కాకపోతే ఎప్పుడూ అల్లరి చేయడం కుదరదు. అప్పుడప్పుడు సరదాగా చేస్తుంటాం.


మీ మీద వచ్చే గాసిప్స్‌ని ఎలా తీసుకుంటారు?

మామీద వచ్చే అర్ధం పర్ధం లేని వార్తలు చదివినా, విన్నా చాలా బాధగా ఉంటుంది. మొదట్లో బాగా బాధపడేదాన్ని. ఇప్పుడు అంతగా బాధపడడం లేదు. 

Advertisement
Advertisement
Advertisement