Abn logo
Mar 10 2020 @ 22:35PM

ఆ బరువు మోయలేను: దిగంగన సూర్యవంశీ

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న నానుడి దిగంగన సూర్యవంశీకి చక్కగా సరిపోతుంది. పరిశ్రమలో హీరోయిన్ల కొరత ఉన్నా ఇప్పటి వరకూ ఆమెకు సరైన బ్రేక్‌ రాలేదు. దానికి కారణం ఆమె అందమో, లేకపోతే ఆమె నటనో కారణం కాదు. ఆమె దురదృష్టం అంతే! ఎన్నో ఆశలు పెట్టుకున్న తొలి సినిమా నిరాశ పరిచినా, వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ వెండి తెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న దిగంగన సూర్యవంశీతో...


హిప్పీ సినిమా ఫలితం మీపై ఎలాంటి ప్రభావం చూపించింది?

కొన్ని విషయాలు మన కంట్రోల్‌లో ఉండవు. మనం ఎంత బాగా నటించినా, ఒక్కొక్కసారి ఫలితం దక్కకపోవచ్చు. సినిమా తీసిన విధానం, దానిని ప్రేక్షకులు చూసే కోణం వేరుగా ఉండొచ్చు. హిప్పీ మూవీ సక్సెస్ కాకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ఆ సినిమాలో ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేశారు. అలాగే క్రిటిక్స్ నుండి కూడా నా పాత్రకు పాజిటీవ్ రివ్యూస్ వచ్చాయి.


తొలి సినిమానే ఫ్లాప్‌ అయ్యిందే అని బాధ పడ్డారా?

బాధ ఎందుకుండదు? ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. ఆ సినిమా చేయాలనుకున్నప్పుడు కేవలం నా పాత్ర గురించి మాత్రమే ఆలోచించాను. సినిమా సక్సెస్‌కు అన్ని పాత్రలూ కీలకమే అన్న విషయం ఇప్పుడు నాకు బాగా అర్ధమయింది. అయినా కొన్నిసార్లు ఫలితం గురించి మనం అంచనా తప్పవుతుంది.. హిప్పీ విషయంలో అదే అయ్యింది.. 


తొలి సినిమా తరువాత గ్యాప్‌ రావడానికి కారణం?

హిప్పీ తరువాత గ్యాప్ రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నేను తమిళంలో ఒక మూవీ చేయడం, రెండవది హిప్పీ చిత్రంలో గ్లామరస్ రోల్ చేశాను కాబట్టి తర్వాత కథా బలం ఉన్నఒక మంచి పాత్ర చేయాలని డిసైడ్ అయ్యాను. ఆ సమయంలో ‘వలయం’ దర్శకుడు చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా క్యారెక్టర్‌కి నటించడానికి మంచి స్కోప్ ఉండడంతో ఇప్పుడు వలయం చిత్రంలో నటించాను.


ప్రస్తుతం కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటున్నాను.. కేవలం నా పాత్ర మీదే కాకుండా.. స్క్రిప్ట్‌పై కూడా ఫోకస్ పెడుతున్నాను. అలా ఎంపిక చేసుకుందే ‘వలయం’ కూడా. ఈ సినిమా విషయంలో నా అంచనా తప్పుకాలేదు. 


మీలో మంచి రచయిత ఉందట నిజమేనా?

నేను రెండు సినిమా స్క్రిప్ట్స్ రాశాను, అవి నాకు ఎంతో ఇష్టం. పేరెంట్స్ కూడా నువ్వు వరుసగా సినిమాలు ఎందుకు రాయకూడదు అన్నారు. కథలు, స్క్రిప్ట్స్ రాయడం నాకు ఇష్టం.


దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?

అలాంటి ఆలోచన నాకు లేదు. దర్శకత్వం అనేది చాలా పెద్ద బాధ్యత. ఆ బరువు నేను మోయలేను. కథలు వరకూ అయితే ఓకే! 


తెలుగులో చేస్తున్న సినిమాల గురించి?

గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సిటీమార్ సినిమాలో నటిస్తున్నాను. ఆ చిత్రంలో నేను ఆయన ప్రక్కన ఒక హీరోయిన్‌గా నటిస్తున్నాను. అది కూడా ఒక ఛాలెంజింగ్ రోల్.


తెలుగులో మీకు ఇష్టమైన హీరోలు?

తెలుగులో మహేష్ బాబు, రామ్ చరణ్‌, అల్లు అర్జున్ సినిమాలు చూస్తుంటాను. వారి సినిమాలంటే నాకు చాలా ఇష్టం. వారితో కలిసి నటించే అవకాశం త్వరగా రావాలని కోరుకుంటున్నాను. వీరిద్దరనే కాదు, చాలా మంది హీరోలంటే నాకు అభిమానం. 


అందాల ఆరబోతపై మీ అభిప్రాయం?

వెండితెర మీద గ్లామర్‌గా కనిపిస్తున్నామని అనుకుంటూ కొందరు మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌ చేస్తుంటారు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకం. నాకు అవకాశాలు రాకపోయినా ఫర్వాలేదు కానీ గ్లామర్‌ పేరుతో ఎక్స్‌పోజింగ్‌ చేయమంటే మాత్రం చేయను. ఈ విషయాన్ని దర్శకనిర్మాతలకు ముందే చెప్పేస్తాను.

–భరత్‌ కుమార్‌

Advertisement
Advertisement
Advertisement