Abn logo
Apr 18 2020 @ 23:09PM

ప్రేమిస్తున్నానని చెప్పాగా.. పెళ్లి గురించి చెబుతా..: అమలాపాల్‌

అమలాపాల్‌ అంటేనే సంచలనం అన్నంతగా ముద్ర వేసుకుంది. ఎంత వేగంగా స్టార్‌ హీరోయిన్‌ ఇమేజ్‌ తెచ్చుకుందో, అంతే వేగంగా ఆమె జీవితంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. కెరీర్‌ ప్రారంభంలోనే ప్రేమ, పెళ్ళి అంటూ తొందరపడింది. తను చేసిన పనికి తీరిగ్గా బాధపడి వివాహ బంధం నుంచి విముక్తురాలైంది. ఇక అప్పటినుంచీ వివాదాలు ఆమె నేస్తాలయ్యాయి. ఎన్ని వివాదాలు తలెత్తినా, తనని ఎందరూ ఎంతగా విమర్శించినా బెదరకుండా, అదరకుండా కెరీర్‌లో దూసుకుపోతున్న అమలాపాల్‌తో....


వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నట్టున్నారు?

హిందీలో మహేష్ భట్, జియో స్టూడియోస్ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో పర్వీణ్ బాబి అనే పాత్రలో నటిస్తున్నాను. ఈ కథ 1970 నాటిది. నాతో పాటు వెబ్ సిరీస్ లో తాహిర్ రాజ్ బాసిన్, అమిత్రాపూరీ, పుష్ఫదీప్ భరద్వాజ్ కూడా నటిస్తున్నారు. బాలీవుడ్‌లో నటించాలన్న నా కల తీరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీని గురించి ఇప్పుడు ఇంతకన్నా చెప్పలేను. 


మీ విడాకులకు ధనుష్‌ కారణమన్న వార్తల్లో నిజమెంత?

దొంగలు పడిన ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టు, ఇప్పుడు నా విడాకుల గురించి చర్చ అనవసరం. అది నా పర్సనల్‌. విడాకులు తీసుకోవాలన్న నిర్ణయం పూర్తిగా నాదే. దానికి ఎవరినీ బాధ్యులను చేయను. ఒకరి కారణంగా ఎవరైనా విడాకులు తీసుకుంటారా? ధనుష్‌గారు నా వెల్‌విషర్‌. ఈ విషయంలో నన్నేమీ అడగకండి. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 


‘ఆడై’ సినిమాకి అవార్డు రాలేదన్న బాధ ఉందా?

మనసుపెట్టి చేసిన సినిమా. అవార్డు రాలేదంటే బాధగా ఉండదా? ఉంటుంది. కానీ, ఆ సినిమాలో నా నటనను ప్రేక్షకులు, విమర్శకులు మెచ్చుకున్నారు. నాకు జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. అలా అనుకోవడమే నాకు పెద్ద అవార్డు. అయినా అవార్డుల కోసమని సినిమాలు చేసే అలవాటు నాకు లేదు. నా సినిమాలకు అవార్డులు వచ్చినా రాకపోయినా, అవి ప్రేక్షకులకు నచ్చితే చాలు. 


మీ తాజా సినిమా ‘అదో అందపరవై పోల’ గురించి?

ఓ అమ్మాయి కారడవిలో ఒంటరిగా చిక్కుకుంటే అక్కడి నుంచి ఆ అమ్మాయి ఎలా తప్పించుకుంది అనే ఈ సినిమా కథ. ప్రతి సన్నివేశం సహజంగా ఉంటుంది.


ఈ సినిమా కోసమే హిమాలయాలకు వెళ్ళారట కదా నిజమేనా?

మూడు సంవత్సరాల క్రితమే నేను హిమాలయాలకు ట్రెక్కింగ్‌కి వెళ్ళాను. అక్కడ షూటింగ్‌ జరపాలని ముందు యూనిట్‌ అనుకున్నా ఆ తరువాత అడవిలో జరపాలని నిర్ణయించుకున్నారు. నేను హిమాలయాలకు వెళ్ళడానికీ ఈ సినిమాకు ఎలాంటి సంబంధమూ లేదు.


ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారా?

ఇందులో మూడు పోరాట సన్నివేశాలున్నాయి. కొంత ట్రైనింగ్‌ తీసుకున్నాను. ప్రతి వ్యక్తిలోనూ ఎంతోకొంత పోరాడేతత్త్వం ఉంటుంది. అది నాలోనూ ఉంది. ఈ సినిమా షూటింగ్‌లో నాకు అది అర్ధమైంది. కాకపోతే అన్నివేళలా అది బయటకు రాదు అంతే!


మణిరత్నం సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం?

అన్ని పాత్రలూ అందరూ చేయలేరు. మణిరత్నంగారి సినిమాలో నా పాత్రకి నేను న్యాయం చేయలేనని అనిపించింది. ఆ పాత్రకి నాకు సూట్‌ కాదు. నాకు నప్పని పాత్ర చేసి విమర్శలపాలు కావడంకన్నా ముందే తప్పుకోవడం మంచిదనిపించింది. మణిరత్నంగారి తరువాతి సినిమాలో నాకు అవకాశమొస్తే తప్పకుండా చేస్తాను.


మీరొక వ్యక్తిని ప్రేమించానని చెప్పారు కదా? పెళ్ళెప్పుడు?

దానికి ఇంకా సమయముంది. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నాను. అవి పూర్తి కాగానే పెళ్ళి గురించి చెబుతాను. నా ప్రేమ గురించి చెప్పాను కదా....అలాగే పెళ్ళి గురించి కూడా చెబుతాను. అప్పటి వరకు కంగారు పడవద్దు. పెళ్లి అయిపోయిందని పుకార్లు పుట్టించవద్దు. అన్నీ సమయం చూసుకుని చెబుతాను.


తెలుగు సినిమాలో నటించబోతున్నారట?

దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేను.

Advertisement
Advertisement
Advertisement